iDreamPost

సిక్కోలు గ్రామ పోరులో నెగ్గేదెవరు .. !

సిక్కోలు గ్రామ పోరులో నెగ్గేదెవరు .. !

శ్రీకాకుళం రాష్ట్రానికి ఓ అంచున ఉన్న జిల్లా.. ! తెలుగుదేశం ఆవిర్భావం నుంచి టీడీపీ జిల్లాలో పట్టు నిలుపుకుంటోంది. ఐతే ఈ సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఆ పార్టీకి గట్టిషాక్ ఇచ్చాయి. జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలకు గానూ వైఎస్సార్సీపీ ఎనిమిదింటిని తన ఖాతాలో వేసుకుంది. దీన్నుంచి టీడీపీ తేరుకొనేలోగానే ఎప్పటినుంచో వాయిదా పడుతున్న స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగడం ఆ పార్టీకి సకటంలా మారింది. ముందుగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని శుక్రవారం జరిగిన కెబినెట్ భేటీలో నిర్ణయించారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని దాదాపు వెయ్యి గ్రామపంచాయతీలు, తొమ్మిది మేజర్ పంచాయతీలకు తొలుత ఎన్నికలు జరగనున్నాయి.

పోరు రెండిటి మధ్యే

పంచాయతీ పోరు పార్టీ సింబల్స్ పై జరగకపోయినా.. అభ్యర్థులను పార్టీలే నిలబెడతాయి. ఎన్నికలకు సంభందించి ప్రధానంగా వైఎస్సార్సీపీ, టీడీపీ మధ్యే పోటీ ఉండనుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున టెక్కలి నుంచి అచ్చెన్నాయుడు, ఇచ్ఛాపురం నుంచి బెండలం అశోక్ గెలుపొందారు. శ్రీకాకుళం పార్లమెంటు స్థానం నుంచి రామ్మోహన్ నాయుడు అతి కష్టం మీద ఒక శాతం కంటే తక్కువ ఓట్లతో బయటపడ్డారు. దీంతో టీడీపీ క్యాడర్ అంత పూర్తిగా డీలా పడిపోయింది. మరో వైపు బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ పంచాయతీ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని ఉవ్విళూరుతోంది. బీజేపీ సైతం నూతనంగా ఏర్పాటు చేయబోయే జిల్లాలను దృష్టిలో పెట్టుకొని కమిటీలను ఏర్పాటు చేస్తోంది. తద్వారా స్థానిక పోరులోనూ పోటీఇవ్వాలని చూస్తోంది. ఆ పార్టీ జిల్లా అధ్యక్ష పదవి కోసం ఇద్దరు ముగ్గురు పోటీ పడుతున్నారు. ఇక జనసేన ప్రభావం నామమాత్రంగా ఉండే అవకాశం ఉంది.

టీడీపీది ఎదురీతే

జిల్లాలో తొలినుంచి పార్టీకి అండగా ఉంటూ వస్తున్న బీసీ వర్గాలు గత ఎన్నికల్లో దూరమయ్యాయి. దీంతో ఎలా తిరిగి వారికి దగ్గరవ్వాలని ఆలోచిస్తుండగానే ఆ పార్టీకి రాజధాని షాక్ కొట్టింది. చంద్రబాబు దర్శకత్వంలో అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు, రామ్మోహన్ నాయుడు, ప్రతిభాభారతి, కూన రవికుమార్ తదితర నాయకులు మూడు రాజధానులు వద్దు అమరావతే ముద్దు అనే నినాదం ఎత్తుకోవడంతో ప్రజల్లో టీడీపీపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ మద్యే జరిగిన జిల్లా పార్టీ సమన్వయ సమావేశంలో అమరావతిపై తీర్మానం చేయాలని ప్రయత్నించిన అచ్చెమ్ నాయుడు ప్రతిపాదనకు కోండ్రు మురళితో ఇతర నాయకుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. కోండ్రు మురళి సమావేశానంతరం మీడియా సమావేశంలోకూడా పాల్గొనకుండా వెళ్లిపోవడంతో అయన పార్టీ మారుతున్నారనే ప్రచారం జోరందుకుంది. జిల్లాలోని మరికొంతమంది నేతలు రాజధాని అంశాన్ని ఆసరాగా చేసుకొని పార్టీ మారేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే పంచాయతీ పోరులో టీడీపీకి కష్టాలు తప్పవు.

వైఎస్సార్సీపీ జోరు

ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే పంచాయతీ పోరులో వైఎస్సార్సీపీకి అనుకూల పవనాలు వీస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి నేతృత్వంలో టీడీపీ ఇసుక అక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వైఎస్సార్సీపీ విజయవంతం అయ్యింది. దీంతో పాటు రాజధాని అంశం.. పార్టీకి అంది వచ్చిన వరంగా మారింది. ధర్మాన మొదలు స్పీకర్ వరకు జిల్లాలో పర్యటిస్తూ రాజధాని అంశాన్ని, ఉత్తరాంధ్ర సెంటిమెంటును పార్టీకి అనుకూలంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నాలు ఫలితాలు ఇస్తున్నట్లు కనిపిస్తున్నాయి. గురువారం శ్రీకాకుళంలోని ఏడు రోడ్ల కూడలిలో టీడీపీ అమరావతికి మద్దతుగా నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో పట్టుమని 50 మంది కూడా పాల్గొనలేదు. ఇదే పరిస్థితి కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పరువు పోవడం ఖాయం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి