iDreamPost

సినీ మీడియా దివిటి ఇక లేరు

సినీ మీడియా దివిటి ఇక లేరు

తెలుగు సినిమా జర్నలిజంలో అత్యంత అనుభవజ్ఞులుగా పేరున్న పసుపులేటి రామారావు ఇవాళ కన్ను మూశారు. ఎన్టీఆర్ కాలం నుంచి ఇప్పటి తరం దాకా ఎందరో నటీనటులతో ప్రయాణించిన అనుభవం ఆయనది. విశాలాంధ్ర పత్రికతో తన పాత్రికేయ జీవితాన్ని ప్రారంభించిన రామరావు గారు ఆ తర్వాత సంతోషం లాంటి న్యూ జనరేషన్ మ్యాగజైన్స్ కు వరకు ఎన్నో సంస్థలకు సేవలు అందించారు. ఈయన స్వస్థలం ఏలూరు. డిగ్రీ దాకా విద్యాభ్యాసం చేశారు. ప్రజానాట్య మండలి, కమ్యూనిస్టు పార్టీలలో కీలక సభ్యునిగా చాలా కాలం పని చేశారు.

సినిమా పరిశ్రమలో చెన్నైలో ఉన్నప్పుడు తన విస్తృతమైన పరిచయాల ద్వారా ఎన్నో ఇంటర్వ్యూలు, ప్రేక్షకులకు ఆసక్తి కలిగేలా ఎన్నెనో విశేషాలు అందరికంటే ముందు అందించే వారిగా పేరుంది. పసుపులేటి అని పేరు చెప్పగానే పెద్ద హీరోలు సైతం సెట్ లో ప్రత్యేకంగా కొంత టైం కేటాయించి మరీ ముఖాముఖీ ఇచ్చేవారంటేనే అర్థం చేసుకోవచ్చు ఈయన ఎంత గౌరవం పొందారోవయసుని లెక్క చేయకుండా ముదిమి వయసులోనూ రామారావు రచనలు మానలేదు.

చిరంజీవి. శ్రీదేవి, సావిత్రి, దాసరి లాంటి దిగ్గజాల గురించి పసుపులేటి రాసిన పుస్తకాలు సినిమా ప్రేమికులకు మంచి రిఫరెన్స్ గా నిలిచాయి. చిరంజీవి ప్రత్యేకంగా మెచ్చుకుని మరీ బుక్ లాంచింగ్ కు విచ్చేయడం విశేషం. ఇప్పటికీ అప్ కమింగ్ జర్నలిస్టులకు ఎలాంటి సలహాలు సూచనలు కావాలన్నా ముందుకువచ్చే పసుపులేటి రామారావు గారు ఇక లేరన్న వార్త మీడియా లోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. చాలా అరుదైన వ్యక్తిత్వం ఆయనదని గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న రామారావుకి భౌతికంగా లేకపోయినా పరిశ్రమకు చేసిన సేవలు మాత్రం ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి