iDreamPost

ఆ లేఖ నేను రాయలేదు..! మరి ఎవరు రాసుంటారు..?

ఆ లేఖ నేను రాయలేదు..! మరి ఎవరు రాసుంటారు..?

కేంద్ర హోం శాఖకు తాను ఎలాంటి లేఖ రాయలేదని ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ చెప్పారు. ఏఎన్‌ఐ వార్తా చానెల్‌కు ఈ అంశంపై వివరణ ఇచ్చారు. ఆ లేఖ తాను రాయలేదని తెలిపారు.

తనకు ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలంటూ నిన్న బుధవారం రమేష్‌కుమార్‌ లేఖ రాశారంటూ ప్రచారం జరిగింది. ఓ లేఖ మీడియా, సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. దీనిపై మీడియాలో విస్తృతంగా కథనాలు ప్రచారమయ్యాయి. వార్త ఛానెళ్లలో చర్చలు జరిగాయి. ఆయా మీడియా సంస్థలు వివరణ అడిగినా.. రమేష్‌ కుమార్‌.. అవుననో, కాదనో చెప్పలేదు. దీంతో అటు ప్రభుత్వం, ఇటు ఎన్నికల కమిషన్‌లోనూ హీట్‌ పెరిగింది.

లేఖ తాను రాయలేదని రమేష్‌కుమార్‌ ప్రకటించడంతో ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఆ లేఖ ఎవరు రాశారు..? అనేది తేల్చేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్‌ జగన్‌తో రాష్ట్ర డీజీపీ సమావేశమయ్యారు.

Read Also: రాష్ట్రంలో నాకు రక్షణ లేదు.. మీరే రక్షణ కల్పించాలి … కేంద్రానికి రమేష్ కుమార్ లేఖ

లేఖలో రమేష్‌కుమార్‌ తనకు ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలని కోరడమే కాకుండా.. స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా సీరియస్‌ వ్యాఖ్యలు చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం కావడంపై ఆక్షేపించారు. ఎన్నికలకు సజావుగా జరగాలంటే కేంద్ర బలగాలను పంపాలని కూడా రాశారు. ఈ అంశాలను కావాలనే ప్రస్తావించారని, తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలని ఎవరో కావాలనే కుట్ర చేశారని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో లేఖ వెనుక ఉన్న కుట్రదారులను బట్టబయలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి