iDreamPost

అమరావతి కుంభకోణంపై విచారణ.. సుప్రిం ఏం తేల్చబోతోంది..?

అమరావతి కుంభకోణంపై విచారణ.. సుప్రిం ఏం తేల్చబోతోంది..?

అమరావతి భూ కుంభకోణంపై దర్యాప్తు అంశం దేశ అత్యున్నత న్యాయస్థానం వద్దకు చేరింది. అమరావతిలో జరిగిన భూ కుంభకోణంపై విచారణ చేయాలా..? వద్దా..? అనే అంశంపై ఈ రోజు మధ్యాహ్నం సుప్రిం కోర్టు క్లారిటీ ఇవ్వబోతోంది.

అమరావతి భూ కుంభకోణంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం, సిట్‌ దర్యాప్తును నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రిం కోర్టులో సవాల్‌ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రిం కోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ప్రతివాదులైన టీడీపీ నేత వర్ల రామయ్య, చంద్రబాబు ప్రభుత్వంలో అడ్వకేట్‌ జనరల్‌గా పని చేసిన దమ్మాలపాటి శ్రీనివాస్‌లు కౌంటర్‌ అఫిడవిట్‌లు దాఖలు చేయడంతో.. జస్టిస్‌ అశోక్‌భూషన్, జస్టిస్‌ సుభాష్‌రెడ్డిల నేతృత్వంలోని ధర్మాసనం ఈ రోజు మధ్యాహ్నం విచారణ చేయబోతోంది.

Also Read:మైలారంలో దేవినేని ఉమా మైలేజీ ప‌డిపోయిందా?

రాజధానిగా అమరావతిని ప్రకటించక ముందే అక్కడ చంద్రబాబు, ఆయన బినామీదారులు, పలువురు టీడీపీ నేతలు భూములు కొన్నారని ఏపీ మంత్రివర్గ ఉపసంఘం ప్రాథమికంగా నిర్థారించింది. మంత్రివర్గం ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో జరిగిన భూ కుంభకోణంపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేసింది. సిట్‌తోపాటు సీఐడీ, ఏసీబీలు తమకు వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేపట్టాయి.

మాజీ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్, సుప్రిం కోర్టు న్యాయమూర్తి ఎన్‌వీ రమణ కుమార్తెలు సహా 13 మందిపై ఏసీబీ కేసు కూడా నమోదు చేసింది. ఏసీబీ కేసుపై ఏపీ హైకోర్టు స్టే విధంచడంతోపాటు కేసు వివరాలు బయటకు వెళ్లడించకూడదంటూ గ్యాగ్‌ ఆర్డర్‌ను జారీ చేసింది. దీనిపై దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. హైకోర్టు తీర్పుపై ఏపీ ప్రభుత్వం సుప్రింను ఆశ్రయించగా.. విచారణ చేపట్టిన జస్టిస్‌ అశోక్‌భూషన్, జస్టిస్‌ సుభాష్‌రెడ్డి, జస్టిస్‌ ఎంఆర్‌ షాలతో కూడిన ధర్మాసనం గ్యాగ్‌ ఆర్డర్‌ను ఎత్తివేసింది.

Also Read:ఆరుగురు ఎమ్మెల్సీలు కూడా ఏకగ్రీవమే

కేబినెట్‌ సబ్‌కమిటీ, సిట్‌ విచారణలపై కూడా ఏపీ హైకోర్టు స్టే విధించడం సర్వత్రా విమర్శలకు తావిచ్చింది. ఓ వైపు టీడీపీ నేతలు అమరావతిలో ఎలాంటి స్కాం జరగలేదంటూ. ఎలాంటి విచారణకైనా సిద్ధమని చెబుతూనే.. మరో వైపు విచారణ జరగకుండా ఆపాలంటూ కోర్టుల్లో పిటిషన్లు వేయిస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ఏపీ హైకోర్టు గత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకె మహేశ్వరి.. సిట్, కేబినెట్‌ సబ్‌కమిటీ విచారణలపై స్టే విధించారు.

దీన్ని ఏపీ ప్రభుత్వం సుప్రింలో సవాల్‌ చేసింది. ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపుకు పాల్పడుతోందంటూ ప్రతివాదులైన వర్ల రామయ్య, దమ్మాలపాటి శ్రీనివాస్‌లు తమ కౌంటర్‌ అఫిడవిట్‌లో పేర్కొన్నారు తప్పా.. అక్కడ భూ కుంభకోణం జరగలేదని చెప్పడం లేదు. ఈ నేపథ్యంలో సుప్రిం కోర్టు సిట్‌ విచారణకు పచ్చ జెండా ఊపుతుందా..? లేదా హైకోర్టు తీర్పును సమర్థిస్తుందా..? వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి