iDreamPost

ధూళిపాళ్ల వాదన అదుర్స్‌..!

ధూళిపాళ్ల వాదన అదుర్స్‌..!

సంగం డెయిరీ అక్రమాల వ్యవహారం నుంచి బయటపడేందుకు ఆ డెయిరీ చైర్మన్, టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ కోర్టుల్లో వాదనను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ఈ రోజు ఏసీబీ కోర్టులో నరేంద్ర బెయిల్‌ పిటిషన్, కస్టడీ కోరుతూ ఏసీబీ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. ఇరు వైపుల వాదనలను విన్న న్యాయస్థానం బెయిల్‌ పిటిషన్‌పై విచారణను వచ్చే నెల 3వ తేదీకి వాయిదా వేసింది. కస్టడీ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్‌ చేసింది. సోమవారం తీర్పును వెలువరిస్తామని తెలిపింది.

ఏసీబీ కోరిన కస్టడీని వ్యతిరేకిస్తూ.. ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ తరఫున న్యాయవాది రామకృష్ణ ప్రసాద్‌ వాదనలు వినిపించారు. ప్రస్తుతం సంగం డెయిరీ ప్రభుత్వ ఆధీనంలో ఉందని, అలాంటప్పుడు ఇక ధూలిపాళ్ల నరేంద్రను విచారించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. డెయిరీ కార్యకలాపాల్లో ధూళిపాళ్ల వ్యక్తిగతంగా ఎలాంటి ప్రయోజనం పొందలేదని వాదించారు.

ధూళిపాళ్ల నరేంద్ర న్యాయవాది రామకృష్ణ ప్రసాద్‌ చేసిన వదన విన్న వారు ఆశ్చర్యపోతున్నారు. సంగం డెయిరీని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకున్నప్పుడు.. ఇక విచారణ అవసరం ఏముందుంటూ న్యాయవాది రామకృష్ణ ప్రసాద్‌ చెబుతున్నారు. అంటే సంగం డెయిరీ ప్రభుత్వం పరిధిలోకి రావడం వల్ల.. నిన్నటి వరకు డెయిరీలో జరిగిన అక్రమాలు, అవినీతి వ్యవహారాలపై విచారణ అవసరం లేదనేలా రామకృష్ణ వాదన ఉంది. మరి ధూళిపాళ్ల న్యాయవాది ఏ తర్కంతో ఇలా వాదించారో గానీ.. ఈ తరహా వాదనతో ఆయన వార్తల్లో నిలిచారు.

Also Read : ధూళిపాళ్లకు హైకోర్టులో ఎదురుదెబ్బ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి