iDreamPost

వాలంటీర్లకు వందనం.. తుఫానులోనూ ఓ సైన్యంలా కదిలారు!

మిచౌంగ్ తుఫాన్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై విరుచుకుపడింది. ఏపీ కోస్తా తీర ప్రాంతం, చెన్నై నగరంపై ఈ తుఫాన్ తీవ్ర ప్రభావాన్ని చూపింది. అయితే ఈ తుఫాన్ భీభత్సానికి చెన్నై నగరం పండుటాకులా వణికింది. కానీ ఏపీ..

మిచౌంగ్ తుఫాన్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై విరుచుకుపడింది. ఏపీ కోస్తా తీర ప్రాంతం, చెన్నై నగరంపై ఈ తుఫాన్ తీవ్ర ప్రభావాన్ని చూపింది. అయితే ఈ తుఫాన్ భీభత్సానికి చెన్నై నగరం పండుటాకులా వణికింది. కానీ ఏపీ..

వాలంటీర్లకు వందనం.. తుఫానులోనూ ఓ సైన్యంలా కదిలారు!

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారి మిచౌంగ్ తుఫాన్ రూపంలో విరుచుకుపడింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను వణికించేసింది. చెన్నై నగరం సంగతైతే చెప్పనక్కర్లేదు. భారీ వర్షాలకు అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. జనజీవనం అస్తవ్యస్థమైంది. ఈ తుఫాన్ ధాటికి సుమారు 10 మంది మరణించారని సమాచారం. రోడ్లన్నీ జలమయ్యాయి. కార్లు కూడా కొట్టుకుపోయిన సంగతి విదితమే. ఈ తుఫాన్ చెన్నై, తీర ప్రాంతాలన్నింటినీ విధ్వంసం చేసిందని చెప్పొచ్చు. అలాగే మిచౌంగ్.. ఆంధ్రప్రదేశ్ పై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపించింది. అయితే చెన్నై అంతా ఘోర పరిస్థితులు ఏపీలో లేకపోవడానికి కారణం ఇక్కడి వాలంటీర్ వ్యవస్థ.

బంగాళా ఖాతంలో వాయు గుండం ఏర్పడుతోందని.. తమిళనాడుతో పాటు ఏపీపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించగానే.. పొరుగు రాష్ట్రం లైట్ తీసుకుంది. కానీ ఏపీలో అలా కాదు.. వెంటనే అలర్ట్ అయ్యింది ప్రభుత్వం. ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో గ్రామ, వార్డు వాలంటీర్లను రంగంలోకి దింపారు ఉన్నత అధికారులు. తుఫాన్ ప్రభావిత జిల్లాల్లోని తీర, ముంపు ప్రాంతాలకు వెళ్లి.. అక్కడి ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సహాయక కేంద్రాలకు తరలి వెళ్లాలని సూచించారు. కొంత మంది ప్రజలు పరిస్థితిని అర్థం చేసుకుని శిబిరాలకు కదలి వెళ్లారు. మత్య్సకారులను వేటకు వెళ్లొద్దని విన్నవించారు. అలాగే రైతులకు కొన్ని సూచనలు చేశారు.

ఇక తుఫాన్ రెండు, మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌ను కుదిపేసింది. అయితే అప్పటికే అలర్ట్ గా ఉన్న వాలంటీర్లు  వెంటనే  ఓ సైన్యంలా కదిలి.. ప్రజలు ఎక్కడ తీవ్రంగా ప్రభావితమయ్యారో అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఓ రకంగా చెప్పాలంటే ఇదొక రెస్య్కూ ఆపరేషన్‌లా తీసుకుని ముందుకు కదిలారు. ఎక్కడిక్కడ సమన్వయం చేసుకుంటూ.. నీట మునిగిన ప్రాంత ప్రజలను సహాయక కేంద్రాలకు, సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారికి భోజన వసతి కల్పించారు. మందులు, ఇతర అవసరాలు తీర్చారు. కల్లాలు, ఇతర ప్రాంతాల్లో ఆరబోసిన పంటను పరిరక్షించేందుకు, ఆర్బీఐ కేంద్రాలకు తరలించేందుకు రైతులకు సాయం చేశారు. జోరున వర్షం పడుతున్నా.. ఫించన్ పంపిణీని ఆపలేదు. తడస్తూనే, మోకాళ్ల లోతులో నీళ్లు ఉన్నా.. ఫించనుదారులకు నగదు అందజేశారు.

వాలంటీర్లే లేకపోతే.. ఇంకా తీవ్ర నష్టం వాటిల్లేది అనడంలో ఎటువంటి సందేహం లేదు. వాలంటీర్లు తుఫాన్ ముందస్తు చర్యలు ఎలా చేపట్టారో.. ఆ తర్వాత కూడా రెస్య్కూ దళాలను మించిన కృషి చేశారు. ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు సాయాన్ని అందించారు. పెను నష్టం నుండి గట్టెక్కించారు. కానీ ఇవన్నీ తెలియని ప్రతిపక్షాలు ఆ వ్యవస్థను తిట్టిపోశాయి. వాలంటీర్లను ఇష్టమొచ్చినట్లు నోరు పారేసుకున్నారు ప్రతి పక్ష నేతలు. వాలంటీర్లు అరాచకాలకు పాల్పడుతున్నారని, మావన అక్రమ రవాణా జరుగుతుందని అపవాదులు వేశారు. సేవే పరమార్ధంగా గ్రామ, వార్డు వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఏ ఉద్దేశంతో అయితే వాలంటీర్లు వచ్చారో.. వాటిని నిజం చేశారు. ఇలాంటి విపత్తుల సమయంలో వారి అసలైన సేవలు వెలుగులోకి వచ్చాయి.

వాలంటీర్లు ముందస్తుగా చర్యలు, ఆ తర్వాత సహాయక చర్యల కారణంగా తుఫాన్ భీభత్సానికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. వీటన్నింటికి కారణం కేవలం వాలంటీర్లే. ఈ సేవాతత్పరులు చేపట్టిన చర్యలకు బాధితులు, సహాయం పొందిన ప్రజలు.. వేనోళ్ల పొగుడుతున్నారు. వారికి హ్యాట్సాప్ చెబుతున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వీరి సేవలను కొనియాడారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు వాలంటీర్లు అందించిన సేవలు అమోఘమని ప్రశంసించారు. ఇప్పుడు ఈ వ్యవస్థ, వారి సేవలపై ఏపీ వ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వారి కృషిని, సేవను గుర్తించి.. ప్రతిపక్షాలు మాట్లాడితే మంచిదని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరీ ఈ  వాలంటీర్ల వ్యవస్థపై మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి