iDreamPost

ఎన్టీఆర్ పై విమర్శనాస్త్రం ఈ సినిమా – Nostalgia

ఎన్టీఆర్ పై విమర్శనాస్త్రం ఈ సినిమా – Nostalgia

టాలీవుడ్ చరిత్రలో అత్యంత ప్రయోగాలు, విభిన్నమైన చిత్రాలు చేసిన తొలినాటి హీరోల్లో సూపర్ స్టార్ కృష్ణ ఒకరు. 70 ఎంఎంలో తీసినా, కౌ బాయ్ కల్చర్ ని తెలుగువాళ్ళకు పరిచయం చేసినా, ముప్పై ఏళ్ళ క్రితమే బాహుబలి రేంజ్ గ్రాండియర్ ని చూపించినా, ఇంగ్లీష్ వాళ్లకు తప్ప మనకు అంతగా వంటబట్టని జేమ్స్ బంద్ సంస్కృతిని ఇక్కడికి తీసుకొచ్చినా ఆయనకే చెల్లింది. తన భావజాలాన్ని చూపించేందుకు కృష్ణ ఎన్నడూ వెనుకాడేవారు కాదు. స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగుదేశం స్థాపించి అధికారంలోకి వచ్చాక ఆయన పద్ధతులు, పాలన కృష్ణకు బొత్తిగా నచ్చేది కాదు. దానికి తోడు ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉండటం విబేధాలకు మరింత ఆజ్యం పోసింది.

1989లో ఎన్టీఆర్ ను ఎండగట్టడమే టార్గెట్ గా పి. చంద్రశేఖర్ రెడ్డితో ఒక కథను సిద్ధం చేయించారు కృష్ణ. సంభాషణలు మహారథితో రాయించారు. కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా టిడిపిని లక్ష్యంగా పెట్టుకుని పక్కా స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నారు. దర్శకత్వ బాధ్యతలు ఎవరికో ఇచ్చి వాళ్ళను రిస్క్ లో పెట్టేబదులు ఆ రిస్క్ ని కృష్ణ సతీమణి విజయనిర్మల గారే తీసుకున్నారు. మంచి ఫామ్ లో ఉన్న రాజ్ కోటి సంగీత దర్శకులుగా, లక్షణ్ గోరె ఛాయాగ్రాహకుడిగా సెట్ చేసుకున్నారు. నరేష్ సెకండ్ హీరోగా ఎంపికయ్యారు. వాణి విశ్వనాథ్, గుమ్మడి, కోట, రాధారవి, గిరిబాబు, రాజ్యలక్ష్మి తదితరులు ఇతర పాత్రలు పోషించారు.

ఇందులో దూరం నుంచి చూస్తే అచ్చం ఎన్టీఆర్ గా అనిపించే పాత్రను సింహపురి ప్రభాకర్ తో చేయించారు. అప్పట్లో ఎన్నికల ప్రచారంలో, వివిధ నిరసన కార్యక్రమాల్లో ఎన్టీఆర్ చేసిన పనులన్నీ ఈయన ద్వారా సినిమాలో నేరుగా చూపించేశారు. ఆ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రంగా హత్యను ఇందులో పెట్టడం ఓ సంచలనం. 1989 మే 25న విడుదలైన సాహసమే నా ఊపిరి ఊహించని స్థాయిలో ఘనవిజయం సాధించింది. భారీ ఓపెనింగ్స్ తెచ్చుకుని వంద రోజులు ఆడటం విశేషం. ఇంత జరిగినా ఎన్టీఆర్ బయట సభల్లో విజయనిర్మలను కలిసినప్పుడు ఏమ్మా నా మీద ఇంకా సినిమాలేమైనా ఉన్నాయా అని సరదాగా అడగటం కొసమెరుపు ఇదే కోవలో మండలాధీశుడు, నా పిలుపే ప్రభంజనం, గండిపేట రహస్యం చిత్రాలు వచ్చాయి.

Also Read : నిన్న ఆవేశపడ్డారు – ఇవాళ చల్లబడ్డారు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి