iDreamPost

గురి కుదరని తెలుగు బాండ్ – Nostalgia

గురి కుదరని తెలుగు బాండ్ – Nostalgia

హాలీవుడ్ లో జేమ్స్ బాండ్ మీదున్న క్రేజ్ ఏ స్థాయిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే పాతిక సినిమాలు వచ్చినా సరే కొత్త మూవీ వస్తోందంటే చాలు ప్రేక్షకులు ఎగబడి మరీ మొదటి రోజు చూసేందుకు తహతహలాడతారు. కానీ మన తెలుగుకొచ్చేటప్పటికి ఈ బాండ్ కాన్సెప్ట్ అంతగా వర్కౌట్ కాలేదన్నది నిజం. ఒకరిద్దరు ప్రయత్నాలు చేశారు కానీ అంతగా సఫలీకృతం కాలేదు. 80 దశకంలో సుమన్ తో ఈ సబ్జెక్టుతో చేసిన కొన్ని ప్రయోగాలు మంచి ఫలితాలు ఇచ్చాయి కానీ మరీ గొప్పగా అయితే కాదు. కౌ బాయ్ థీమ్ తో కృష్ణ మోసగాళ్లకు మోసగాడుతో ఒక ట్రెండ్ చేసినట్టు ఈ జేమ్స్ బాండ్ కథలతో టాలీవుడ్ లో అద్భుతాలు జరగలేదు.

1989లో సుప్రసిద్ధ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ ఆంధ్రజ్యోతి కోసం  రాసిన రుద్రనేత్ర సీరియల్ అప్పట్లో పెద్ద సంచలనం. ఆయన కథలతో అప్పటికే చిరంజీవి అభిలాష, ఛాలెంజ్, రాక్షసుడు, మరణమృదంగంలు చేసి మంచి హిట్లు అందుకోవడంతో మరోసారి ఈ నవలతో వర్క్ అవుట్ చేసుకోవచ్చనే ఆలోచనతో దర్శకుడు రాఘవేంద్రరావుతో నిర్మాత వరహాల రాజు భారీ బడ్జెట్ తో ఈ సినిమా మొదలుపెట్టారు. ఖర్చుకు వెనుకాడకుండా మలేషియా, సింగపూర్ తదితర దేశాల్లో షూటింగ్ ప్లాన్ చేసుకున్నారు. హీరోయిన్లుగా రాధ, విజయశాంతి ఎంపికగా కాగా రావుగోపాల్ రావు, రఘువరన్, రాజా మురద్ లతో గట్టి విలన్ గ్యాంగ్ ని సెట్ చేసుకున్నారు.

దేశ వినాశనానికి ప్లాన్ చేసిన దుర్మార్గుల ఆటను సీక్రెట్ ఏజెంట్ నేత్ర ఎలా ఆట కట్టించాడన్న పాయింట్ తో రుద్రనేత్రను తెరకెక్కించారు. అయితే నవలలో ఉన్న బిగి కమర్షియల్ అంశాల వల్ల సినిమాలో సడలిపోవడంతో ప్రేక్షకులకు ఇది అంతగా కనెక్ట్ కాలేకపోయింది. ఇళయరాజా పాటలు, సత్యానంద్ సంభాషణలు, సాంకేతిక అంశాలు బాగున్నప్పటికీ బలహీనమైన కథనం విజయానికి బ్రేక్ వేసింది. భారీ ఓపెనింగ్స్ వచ్చాయి కానీ ఫలితం దక్కలేదు. 1989 జూన్ 16న రిలీజైన రుద్రనేత్ర ఫ్లాప్ అయ్యింది. దీనికన్నా ముందు వచ్చిన అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, స్టేట్ రౌడీ సక్సెస్ ల హ్యాట్రిక్ ని అందుకోలేకపోయింది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి