iDreamPost

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఈ ఏడాది కూడా నిరాశే!

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఈ ఏడాది కూడా నిరాశే!

ప్రస్తుతం తెలుగులో మరే హీరో ఫ్యాన్స్ లేనంత నిరాశలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే అప్పట్లో మిగతా స్టార్స్ తో పోలిస్తే వేగంగా సినిమాలు చేసే ఎన్టీఆర్.. ఈ ఐదేళ్లలో మాత్రం కేవలం రెండే సినిమాలు విడుదల చేశాడు. దానికి తోడు ఈ 2023 లో కూడా ఆయన నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కావడం లేదు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ డిజప్పాయింట్ అవుతున్నారు.
ntr - koratala combo raising so many questions
2001లో హీరోగా పరిచయమైన ఎన్టీఆర్.. అప్పటినుంచి 2018 వరకు ఏడాదికి కనీసం ఒక్క సినిమా అయినా విడుదల చేశాడు. ఆయనకు యాక్సిడెంట్ జరిగిన 2009 లో మాత్రమే ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. ఒక్క 2009 తప్ప.. 2001 నుంచి 2018 వరకు ప్రతి ఏడాది తన సినిమాలు ఉండేలా చూసుకున్నాడు. కానీ 2019 నుంచి మాత్రం ఆయన కెరీర్ చాలా నెమ్మదిగా సాగుతోంది. రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చేసే సమయంలో ఇతర సినిమాలు చేయలేదు. దాంతో 2019, 20, 21 ఇలా మూడేళ్ల పాటు ఆయన నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. ఇక 2022 లో ఆర్ఆర్ఆర్ విడుదలైంది. దాంతో ప్రపంచస్థాయి గుర్తింపు వచ్చిందని అభిమానుల ఎంతో ఆనందపడ్డారు. కానీ ఆ ఆనందం ఎంతోకాలం నిలవలేదు. ఎందుకంటే ఆయన తదుపరి చిత్రం ఇంతవరకు పట్టాలెక్కలేదు. ఆ చిత్ర విడుదల తేదీ కూడా చాలా వెనక్కి వెళ్ళిపోయింది.

ఆర్ఆర్ఆర్ విడుదలై తొమ్మిది నెలలు దాటింది. ఎన్టీఆర్ తో పాటు ఆర్ఆర్ఆర్ లో నటించిన రామ్ చరణ్ ఇప్పటికే ఆచార్యతో ప్రేక్షకులను పలకరించాడు. శంకర్ దర్శకత్వంలో చేస్తున్న తదుపరి చిత్ర షూటింగ్ కూడా సగానికి పైగా పూర్తి చేశాడు. కానీ ఎన్టీఆర్ మాత్రం ఇంతవరకు కొత్త చిత్రాన్నే మొదలు పెట్టలేదు. కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ ప్రకటన వచ్చి కూడా ఏడు నెలలు దాటింది. ఏవో కారణాల వల్ల ఈ సినిమా ప్రారంభం ఆలస్యమవుతూ వస్తోంది. అయితే ఈ చిత్ర షూటింగ్ ఫిబ్రవరిలో మొదలవుతుందని తాజాగా మేకర్స్ ప్రకటించారు. కానీ దానితో పాటు ఒక షాక్ కూడా ఇచ్చారు. ఈ చిత్రం ఏకంగా 2024, ఏప్రిల్ లో విడుదల కానుందని తెలిపారు. అదే ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరాశకు కారణమైంది. ఎన్టీఆర్-కొరటాల మూవీ ఆలస్యంగా పట్టాలెక్కినా.. వేగంగా షూటింగ్ పూర్తి చేసుకొని కనీసం 2023 చివరిలోనైనా విడుదలవుతుందని ఫ్యాన్స్ భావించారు. కానీ ఇప్పుడు ఏకంగా విడుదల 2024, ఏప్రిల్ కి వెళ్ళిపోయింది. ఈ ఆలస్యాలు, వాయిదాలు చూస్తుంటే కనీసం ఆ తేదీకైనా వస్తుందో లేదో అనే అనుమానాలు ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ 2023 కూడా తమ అభిమాన హీరో సినిమా లేకుండానే గడిపేయాలి అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ ఫీలవుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి