iDreamPost

ఆ విమర్శలను పట్టించుకోను.. నా ఫుల్ ఫోకస్ దాని పైనే..: రోహిత్ శర్మ

  • Author singhj Updated - 03:43 PM, Thu - 27 July 23
  • Author singhj Updated - 03:43 PM, Thu - 27 July 23
ఆ విమర్శలను పట్టించుకోను.. నా ఫుల్ ఫోకస్ దాని పైనే..: రోహిత్ శర్మ

నెల రోజుల కరీబియన్ దీవుల టూర్​ను టీమిండియా సక్సెస్​ఫుల్​గా మొదలుపెట్టింది. ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య వెస్టిండీస్​తో జరిగిన టెస్ట్ సిరీస్​ను భారత జట్టు 1-0 తేడాతో గెలుచుకుంది. నేటి నుంచి జరిగే 50 ఓవర్ల ఫార్మాట్​లో ఆడేందుకు మన టీమ్ సిద్ధమవుతోంది. టెస్ట్ సిరీస్​తో భారత్​కు ఎన్నో పాజిటివ్ అంశాలు ఉన్నాయి. అందులో ఒకటి సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీ. సుమారు ఐదేళ్ల తర్వాత విదేశాల్లో మూడంకెల స్కోరును సాధించాడు కోహ్లి. దీంతో చాలా మంది ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేశారు. అయితే మరికొందరు మాత్రం విరాట్ ఇన్నింగ్స్​ మీద విమర్శలు చేశారు.

వెస్టిండీస్​ పై విరాట్ సెంచరీ చేయడాన్ని తక్కువగా చేస్తూ కొందరు కామెంట్స్ చేశారు. తాజాగా అలాంటి విమర్శల మీద టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఘాటుగా స్పందించాడు. విండీస్​తో వన్డే సిరీస్ ప్రారంభం సందర్భంగా నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్​లో హిట్​మ్యాన్ మాట్లాడాడు. కోహ్లీతో సహా మరే ఇతర క్రికెటర్ పెర్ఫార్మెన్స్​ పైనా ఇలాంటి విమర్శలు చేయడం సరికాదని పేర్కొన్నాడు. ఇలాంటి విమర్శలపై తాను ఇప్పటికే పలుమార్లు స్పందించానన్న రోహిత్.. బయటి నుంచి వచ్చే వ్యాఖ్యలు, విమర్శలపై తాము ఎక్కువగా ఫోకస్ చేయమన్నాడు. అసలు టీమ్​లో ఏం జరుగుతుందో వారికి తెలియదన్నాడు.

‘మా దృష్టి అంతా అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించడం పైనే పెడతాం. వ్యక్తిగతంగా రాణించినా మ్యాచ్​లో ఎలా నెగ్గాలనేదే మాకు చాలా ముఖ్యం. టీమ్​కు ఏ రకంగా ఉపయోగపడ్డామనేది కీలకం. ప్రస్తుతం జట్టులోని ఆటగాళ్లు అందరూ విండీస్​తో మూడు వన్డేల సిరీస్​ను గెలవడం పైనే ఫోకస్ చేస్తున్నారు. ఈ సిరీస్​లో యంగ్ క్రికెటర్లకు ఎక్కువ ఛాన్సులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. టీమిండియాలో చాలా మంది ప్లేయర్లకు ఎక్కువ క్రికెట్ ఆడిన అనుభవం ఉందని.. వారికి స్పెషల్​గా తమ రోల్ గురించి చెప్పాల్సిన అవసరం లేదని హిట్​మ్యాన్ స్పష్టం చేశాడు. పిచ్ కండీషన్​, మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్లు ఆడే సత్తా వారిలో ఉందన్నాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి