iDreamPost

‘కింగ్ ఆఫ్ కొత్త’ రివ్యూ! దుల్కర్ సల్మాన్ మూవీ ఎలా ఉందంటే..

‘కింగ్ ఆఫ్ కొత్త’ రివ్యూ! దుల్కర్ సల్మాన్ మూవీ ఎలా ఉందంటే..

సీతారామం సినిమా తర్వాత మలయాళం హీరో దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైపోయాడు. ఒక తెలుగు హీరో సినిమాని ఎలా ఆదరిస్తారో.. అలా దుల్కర్ సినిమాలను ఓన్ చేసుకుంటున్నారు తెలుగు జనాలు. మహానటి, సీతారామం తర్వాత దుల్కర్ నుండి వస్తున్న పెద్ద సినిమా ‘కింగ్ ఆఫ్ కొత్త’. యాక్షన్ క్రైమ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా.. దుల్కర్ కి ఫస్ట్ పాన్ ఇండియా మూవీ అవుతుంది. అభిలాష్ జోషి రూపొందించిన ఈ మూవీ.. ఇప్పటికే ట్రైలర్, సాంగ్స్ తో మంచి బజ్ క్రియేట్ చేసుకుంది. ఆగష్టు 24న కేరళ ఓనం పండుగ సందర్బంగా ‘కింగ్ ఆఫ్ కొత్త’ థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. మరి దుల్కర్ మాస్ అవతారంలో కనిపించిన ఈ కొత్త సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం!

కథ:

కొత్త అనే ఏరియాకి రాజు(దుల్కర్ సల్మాన్) తండ్రి డాన్. చిన్నప్పటి నుండి రాజు కూడా తండ్రిలాగా ఆ ఏరియాకు డాన్ కావాలని అనుకుంటాడు. కానీ.. చిన్నప్పటి నుండి రాజు మంచి ఫుట్ బాల్ ప్లేయర్ కావడంతో.. రాజుని సిటీకి పంపించేస్తాడు తండ్రి. కట్ చేస్తే.. కొన్నాళ్ళకు రాజు కొత్తకు తిరిగి రావాల్సి వస్తుంది. అప్పటికే తండ్రి చనిపోవడంతో.. కొత్తలో పరిస్థితులన్ని తారుమారైపోతాయి. అసలు ఊహించని విధంగా కొత్తలో అక్రమాలు జరుగుతుంటాయి. ఇవన్నీ చూసి రగిలిపోయిన రాజు.. ఎలాగైనా తన తండ్రి స్థానాన్ని భర్తీ చేయాలని.. డాన్ అవ్వడానికి నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో ఎన్నో ఎదురు దెబ్బలు.. ఊహించని పరిణామాల మధ్య రాజు కొత్తకు డాన్ అవుతాడు. మరి రాజు డాన్ ఎలా అయ్యాడు? తన తండ్రిని ఎలా కోల్పోయాడు? కొత్తలో రాజుకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? తార(ఐశ్వర్య లక్ష్మి)తో రాజు లవ్ స్టోరీ ఏమైంది? చివరికి తన స్థానాన్ని ఎలా కాపాడుకున్నాడు? అనేది తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ:

గ్యాంగ్ స్టర్ డ్రామా సినిమాలు సౌత్ ప్రేక్షకులకు, నార్త్ ప్రేక్షకులకు కొత్త కాదు. కానీ.. కొత్తగా ఏ భాషవారు ట్రై చేసినా.. కథనాన్ని ఎంత కొత్తగా, ఆసక్తికరంగా నడిపారు అనేది పాయింట్. ఇలాంటి గ్యాంగస్టర్ డ్రామాలలో బోర్ కొట్టకుండా జనాలను ఆద్యంతం కూర్చోబెట్టే ప్రెజెంటేషన్ చాలా ముఖ్యం. కథ ముందుకు సాగుతున్నకొద్దీ.. ప్రేక్షకులు అందులో లీనమై పోయారంటే.. పక్కాగా హిట్ పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే.. ఒక్కసారి కనెక్ట్ అయితే మైనస్ లు పెద్దగా కనిపించవు. ఇప్పుడు కింగ్ ఆఫ్ కొత్త కూడా అదే వరుసలో చేరుతుందని అనిపిస్తుంది. ఎందుకంటే.. ట్రైలర్ లో చూసినట్లు కథ మామూలుగా ఉన్నా.. దాన్ని తెరపై ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంటుంది.

డైరెక్టర్ అభిలాష్ జోషి ఎంచుకున్న కథ కొత్తగా అనిపించదు. ఎందుకంటే.. గ్యాంగ్ స్టర్ కథలన్నీ దాదాపు ఓ ఏరియా గురించి లేదా ఓ ప్రాపర్టీని దక్కించుకోవడం చుట్టూ సాగుతుంటాయి. ఇది కూడా ఆ కోవకే చెందుతుంది. కానీ.. దర్శకుడు తెలివిగా స్క్రీన్ ప్లేలో మ్యాజిక్ చేసే ప్రయత్నం చేశాడు. కింగ్ ఆఫ్ కొత్త.. క్యారెక్టర్స్ అన్ని కొత్తగా బిహేవ్ చేస్తుంటాయి. ముఖ్యంగా రాజు క్యారెక్టర్ డిసైన్ చేసిన తీరు బాగుంది. ఇన్నాళ్లు డీసెంట్ గా కనిపించిన దుల్కర్ సల్మాన్.. ఒక్కసారిగా మాస్ అవతారంలో కనిపించడం సర్ప్రైజింగ్ గా అనిపిస్తుంది. అతన్ని అలా చూడటం కూడా కొత్త అనుభూతిని ఇస్తుంది. ఫస్టాఫ్ అంతా ఒక్కో క్యారెక్టర్ ని పరిచయం చేస్తూ.. మెయిన్ కథలోకి తీసుకెళ్తుంది. ఇంటర్వెల్ టైమ్ కి అదిరిపోయే ట్విస్ట్ పడుతుంది.

ఇక సెకండాఫ్ లో అసలు సీరియస్ నెస్ కనిపిస్తుంది. ఒక్కసారిగా క్యారెక్టర్స్ అన్ని కొత్తకు కింగ్ అవ్వడం గురించి పోటీ పడుతుంటాయి. ఈ క్రమంలో అవమానాలు, రక్తం చిందే ఫైట్ సీక్వెన్స్ లు.. స్పెషల్ సాంగ్.. లవ్ ట్రాక్.. ఎమోషనల్ మూమెంట్స్.. ఇలా అన్ని కలిపి క్లైమాక్స్ కి ఇంటరెస్ట్ క్రియేట్ చేస్తాయి. దీంతో ఎలాగో హీరో క్యారెక్టర్ కొత్తకు కింగ్ అవ్వడమే స్టోరీ టార్గెట్ కాబట్టి.. ఇన్ని అడ్డంకుల మధ్య ఎలా అవుతాడు? అనేది ఇంటరెస్టింగ్ గా రాసుకున్నాడు డైరెక్టర్. సినిమా ఆరంభం నుండి ఆకట్టుకుంటూనే.. మధ్యలో రొటీన్ డ్రామా పడినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే.. సినిమా నిడివి దాదాపు మూడు గంటలు ఉంటుంది. అందుకే మనకు మధ్యలో డ్రామా ఎక్కువైన ఫీలింగ్ కలుగుతుంది.. కానీ, వెంటనే డైరెక్టర్ హై ఇచ్చే యాక్షన్ సీక్వెన్స్ లు అక్కడక్కడా ప్లేస్ చేశాడు.

ఫస్టాఫ్ లో సాంగ్స్ పెద్దగా ఎక్కవు.. అదిగాక నేరేషన్ లో మలయాళం ఫ్లేవర్ కనిపిస్తుంది. నేరేషన్ స్లో అయినా.. దుల్కర్ స్క్రీన్ ప్రెజెన్స్ వల్ల ఇంటరెస్ట్ కంటిన్యూ అవుతుంది. ఇక సెకండాఫ్ లో గ్రూప్స్ మధ్య వార్.. దుల్కర్ యాక్షన్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎంగేజ్ చేస్తాయి. ఇందులో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో పాటు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఓల్డ్ డేస్ ఫ్లేవర్ కెమెరా వర్క్ లో క్లియర్ గా కనిపిస్తుంది. ఇక నటినటుల విషయానికి వస్తే.. దుల్కర్ మాస్ క్యారెక్టర్ లో జీవించేశాడు. తన ఫ్యాన్స్ కి పండగే అని చెప్పాలి. తెలుగులో ఓన్ గా డబ్బింగ్ చెప్పడం విశేషం. తార క్యారెక్టర్ లో ఐశ్వర్య బాగా చేసింది., చెంబన్ వినోద్ తనదైన నటనతో సీరియస్ గా కనిపిస్తూ నవ్వించాడు. ఇక మిగతా నటీనటులు వారి పాత్రల మేరకు న్యాయం చేశారు. డైరెక్టర్ అభిలాష్ జోషి.. నార్మల్ స్టోరీని ఇంటరెస్టింగ్ కథనంతో కొత్తగా నడిపించాడు. కానీ.. అక్కడక్కడా ఫ్లాస్ ఉన్నాయి. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

ప్లస్ లు:

  • దుల్కర్ సల్మాన్
  • స్క్రీన్ ప్లే
  • బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
  • యాక్షన్ సీక్వెన్స్ లు
  • క్లైమాక్స్

మైనస్ లు:

  • ప్రెడక్టబుల్ సీన్స్
  • అక్కడక్కడా స్లో డ్రామా
  • మూవీ లెన్త్

చివరిమాట: కింగ్ ఆఫ్ కొత్త.. దుల్కర్ ఫ్యాన్స్ కి పండగే!

రేటింగ్: 2.5/5

(గమనిక: ఈ రివ్యూ కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)