iDreamPost

షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ మూవీ రివ్యూ!

షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ మూవీ రివ్యూ!

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్.. ఈ ఏడాది పఠాన్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ హిట్ అందుకున్నాడు. దీంతో షారుఖ్ నెక్స్ట్ మూవీ జవాన్ పై ఒక్కసారిగా అంచనాలు పీక్స్ చేరుకున్నాయి. దర్శకుడు అట్లీ రూపొందించిన ఈ యాక్షన్ థ్రిల్లర్.. సాంగ్స్, ట్రైలర్ లతో అంచనాలు పెంచేసింది. షారుఖ్ ఫ్యాన్స్ ఎనిమిదేళ్ల నిరీక్షణకు పఠాన్ ఫలితం అందించింది. ఇప్పుడు జవాన్ మూవీ.. అదే ఊపును కంటిన్యూ చేస్తుందని ప్రమోషనల్ స్టఫ్ చూసి అంచనా వేస్తున్నారు. కాగా.. షారుఖ్ ఓన్ ప్రొడక్షన్ లో నిర్మించిన జవాన్ మూవీ.. తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. నయనతార, దీపికా పదుకొనే, విజయ్ సేతుపతి లాంటి స్టార్ కాస్ట్ నటించిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో చూద్దాం!

కథ:

జవాన్ కథ.. భారత్, చైనా సరిహద్దులో ఉన్న ఒక గ్రామంలో మొదలవుతుంది. ఒంటి నిండా పూర్తి గాయాలతో ఓ వ్యక్తి(షారుఖ్) నీటిలో కొట్టుకొస్తాడు. అక్కడి గ్రామస్తులు అతనికి వైద్యం చేసి కాపాడతారు. అక్కడే ఉంటూ ఆ గ్రామానికి ఏ కష్టం వచ్చినా చూసుకుంటాడు ఆ వ్యక్తి. కట్ చేస్తే.. కొన్ని సంవత్సరాల తర్వాత ఆరుగురు అమ్మాయిలతో కలిసి ముంబైలో మెట్రో ట్రెయిన్ హైజాక్ చేస్తాడు. అప్పుడే అతని పేరు విక్రమ్ రాథోడ్ అని తెలుస్తుంది. అయితే అదే హైజాక్ కు గురైన ట్రెయిన్ లో.. ప్రముఖ బిజినెస్ మ్యాన్ కాళీ(విజయ్ సేతుపతి) తన కూతురు చిక్కుకుంటారు. దీంతో ప్రభుత్వంని రాథోడ్ డిమాండ్ చేసిన రూ. 40 వేలకోట్లు కాళీ చెల్లిస్తాడు. అసలు విక్రమ్ రాథోడ్ ఎవరు? కాళీకి, అతనికి లింక్ ఏంటి? కథలో జైలర్ ఆజాద్(మరో షారుఖ్) ఎవరు? అనేది తెలియాలంటే సినిమా తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ:

కింగ్ ఖాన్ నుండి ఫ్యాన్స్ ఎలాంటి సినిమాలను ఎక్స్ పెక్ట్ చేస్తున్నారో.. సరిగ్గా అలాంటి సినిమాలలో ఒకటి జవాన్. షారుఖ్ కెరీర్ లో యాక్షన్ సినిమాలకు ఎంత క్రేజ్, ఎలాంటి రికార్డులు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ఏడాది పఠాన్ కూడా అదే కోవకు చెందుతుంది. అయితే.. అట్లీ జవాన్ మూవీ కోసం దాదాపు మూడేళ్లు షారుఖ్ చుట్టూ తిరిగాడు. ఇప్పుడు అతని నిరీక్షణకు మంచి ఫలితం అందుతుందని చెప్పుకోవాలి. పక్కాగా ఇది షారుఖ్ కోసమే రాసుకున్నాడు అట్లీ. మూవీ విషయానికి వస్తే.. సినిమాలో ప్రధాన కథను.. ప్రధాన క్యారెక్టర్స్ ని పరిచయం చేసిన తీరు చాలా బాగుంది. ఓ రకంగా షారుఖ్ ఇంట్రడక్షన్ సీన్స్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తాయి.

అలా షారుఖ్ క్యారెక్టర్స్ తో పాటు మొదటి గంటలో ప్రేక్షకులను పూర్తిగా కథలో భాగం చేశాడు దర్శకుడు. సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ లతో పాటు ఎమోషన్స్ ని కూడా అంతే జాగ్రత్తగా హ్యాండిల్ చేశాడు. అట్లీకి మాస్ పల్స్ బాగా తెలుసు. అలాంటిది షారుఖ్ లాంటి హీరో అవకాశం ఇస్తే ఊరుకుంటాడా.. జవాన్ ని నెక్స్ట్ లెవెల్ మాస్ ట్రీట్మెంట్ తో తెరకెక్కించాడు. ఒకటి ఎపిసోడ్ అయిపోయింది అనుకునేలోపు మరో యాక్షన్ బ్లాక్ ఎంటర్ అవుతుంది. అన్ని కథలో భాగంగానే రావడం ప్లస్ అయ్యింది. షారుఖ్ ఇందులో డ్యూయెల్ రోల్స్ లో కనిపించాడు. ఒకటి పోలీస్ కాగా.. మరోటి జవాన్. రెండింట్లోను తన పవర్ ని చూపించేసాడు.

ఇక అట్లీ స్క్రీన్ ప్లే మ్యాజిక్ మరోసారి రిపీట్ అయ్యిందని చెప్పాలి. యాక్షన్ సీక్వెన్స్ తో పాటు అదిరిపోయే థ్రిల్లింగ్ అంశాలను సరికొత్తగా చూపించారు. ముఖ్యంగా ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ లు కొత్తగా ఉన్నాయి. పోలీస్ క్యారెక్టర్ లో నయనతార.. విలన్ కాలి పాత్రలో విజయ్ సేతుపతి.. స్పెషల్ క్యామియోలో దీపికా పదుకొనే.. ఇలా చాలా సీక్వెన్స్ లు సర్ప్రైజ్ లతో కూడుకున్నాయి. వీటన్నిటికీ తోడు అనిరుధ్ సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. జికే విష్ణు సినిమాటోగ్రఫీ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి. షారుఖ్ క్యారెక్టర్ చుట్టూ ఎమోషన్స్ కూడా బలంగానే రాసుకున్నాడు డైరెక్టర్.

ఇక షారుఖ్ ఖాన్ ఎప్పటిలాగే డ్యూయెల్ రోల్స్ లో తన సత్తా చాటాడు. ఆయన నుండి ఫ్యాన్స్ ఏమేం కోరుకుంటున్నారో అన్ని ఈ సినిమాలో పుష్కలంగా ఉండేలా చూసుకున్నాడు. నయనతార బాలీవుడ్ డెబ్యూ జవాన్ తోనే చేసింది. ఆమె క్యారెక్టర్ ఉన్నంతలో క్యూట్ గా ఉంది. దీపికా క్యామియో సర్ప్రైజ్ చేస్తుంది. చిన్న రోల్ లో అయినా ఇంపాక్ట్ చూపిస్తుంది. విలన్ గా విజయ్ సేతుపతి బాలీవుడ్ లో మార్క్ చూపించే ఛాన్స్ అందుకున్నాడు. అతని క్యారెక్టర్ లో కూడా చాలా వేరియేషన్స్ చూపించాడు అట్లీ. వీరితో పాటు సినిమాలో మరో స్పెషల్ క్యామియో ఉంది. అది రివీల్ చెయ్యట్లేదు. ఎందుకంటే ఆ సర్ప్రైజ్ ఏంటో మీరు కూడా చూడాలి.

ప్లస్ లు:

  • షారుఖ్
  • కథ
  • మ్యూజిక్
  • సినిమాటోగ్రఫీ
  • యాక్షన్ సీక్వెన్స్ లు

మైనస్ లు:

  • సాంగ్స్ ప్లేస్ మెంట్
  • కొన్ని చోట్ల లాజిక్ మిస్సింగ్

చివరిమాట: జవాన్.. గూస్ బంప్స్ గ్యారంటీ!

రేటింగ్: 3/5

(గమనిక: ఈ రివ్యూ కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి