iDreamPost
android-app
ios-app

అల్లుడు అదుర్స్ రివ్యూ

  • Published Jan 14, 2021 | 12:08 PM Updated Updated Jan 14, 2021 | 12:08 PM
అల్లుడు అదుర్స్ రివ్యూ

టాలీవుడ్ లో ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న సక్సెస్ రాక్షసుడు రూపంలో వరించాక మళ్ళీ మాస్ రూట్ ని ట్రై చేద్దామని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చేసిన సినిమా అల్లుడు అదుర్స్. రేస్ లో ముందు ఆఖరి బెర్త్ తీసుకున్నా పండగ అడ్వాంటేజ్ ని పోగొట్టుకూడదనే ఉద్దేశంతో ఒక రోజు ముందుకు జరిగి రెడ్ తో పోటీకి సై అన్న ఈ ఎంటర్ టైనర్ మీద ప్రేక్షకుల్లో ఓ మోస్తరు అంచనాలు ఉన్నాయి. మొదటి సినిమా కందిరీగతో హిట్టు కొట్టినప్పటికీ రభస, హైపర్లతో ఫ్లాపులు ఎదురుకుని కొంత గ్యాప్ తీసుకున్న సంతోష్ శ్రీనివాస్ దీనికి దర్శకుడు. మరి అల్లుడు అదుర్సా లేక బెదుర్సా రివ్యూలో చూద్దాం

కథ

నిజామాబాద్ ఫ్యాక్షనిస్టు జైపాల్ రెడ్డి(ప్రకాష్ రాజ్)రెండో కూతురు కౌముది(నభ నటేష్)ని తొలిచూపులోనే ఇష్టపడిన శ్రీను(బెల్లంకొండ సాయిశ్రీనివాస్)ఆమె తండ్రి ముందే పది రోజుల్లో ప్రేమలో పడేస్తానని ఛాలెంజ్ చేస్తాడు. ఈలోగా స్కూల్ ఏజ్ లో లవ్ చేసిన వసుంధర(అను ఇమ్మానియేల్)ను ఓ కారణంతో ఇంట్లో పెడతాడు. కౌముది ప్రేమను గెలుచుకునే క్రమంలో ఇతని జీవితంలో రౌడి డాన్ గజ(సోనూ సూద్)ప్రవేశిస్తాడు. ఇక్కడ నుంచి అసలు స్టోరీ మొదలవుతుంది. అదేంటో తెరమీద చూసి తరించాల్సిందే తప్ప మాటల్లో వర్ణించేది కాదు.

నటీనటులు

బలమైన బ్యాక్ గ్రౌండ్ ఉన్న సాయి శ్రీనివాస్ కున్న బలాలు రెండు. ఒకటి ఫిజిక్, రెండు డాన్స్. వీటితో పాటు సమాన స్థాయిలో నటనను కూడా ఇంప్రూవ్ చేసుకునేందుకు గట్టిగానే కష్టపడుతున్నాడు కానీ ఇంకా మెచ్చుకునే స్థాయిలో ఎదగడం లేదు. ఎక్స్ ప్రెషన్లు బలంగా పలకవనే ఫిర్యాదుని సీరియస్ గా తీసుకున్నట్టు ఉన్నాడు ఇందులో రకరకాల వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ ని ఎంచుకున్నాడు.యాక్టింగ్ పరంగా చూసుకుంటే సాయి శ్రీనివాస్ ఇందులో పెంచుకున్న మార్కులు పెద్దగా లేవు. ఇలాంటి రొట్ట రొటీన్ కథలు ఓ పది చేస్తే ఏదో ఒక్కటి హిట్టు కాకపోదా అనే భ్రమ నుంచి త్వరగా బయటికి వస్తే మంచిది.

హీరో తర్వాత ఇతని కోసమైనా ఈ సినిమా చూడాలనిపించేలా చేసిన నేషనల్ ఛారిటీ హీరో సోనూ సూద్ ని ఇకపై కామెడీ విలన్ పాత్రల్లో చూడటం కష్టం. లాక్ డౌన్ టైంలో ఇతను చేసిన మంచి పనులకు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ వచ్చింది. ఇది గుర్తించే కొన్ని మార్పులు చేసినట్టు అనిపించించి కానీ ఓవరాల్ గా ఇకపై సెలక్షన్ లో సోనూ చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. లేదంటే ఫ్యాన్స్ ఫీలవుతారు. ఇందులో తనవరకు దర్శకుడు అడిగింది చేసేశాడు. మీడియం బడ్జెట్ సినిమాలో మంచి అవకాశాలు పడుతున్న నభ నటేష్ కు మరో చలాకి రోల్ దక్కింది. చాలా కాలం తర్వాత తెరమీద అను ఇమ్మానియేల్ దర్శనం.

ప్రకాష్ రాజ్ ది ట్రైన్ పట్టాల కింద నలిగిపోయి అరిగిపోయిన రూపాయి కాసంత రొటీన్ పాత్ర. ఆయనా ఏదో కీ ఇస్తే చేసే రోబోలాగా అలా చేసుకుంటూ పోయారు. రెమ్యునరేషన్ల కోసం చేయాల్సిందే తప్ప ఇలాంటివి ఒప్పుకోవడం ద్వారా వచ్చేదేమి లేదు. మోనాల్ గజ్జర్ సాంగ్ మాస్ కి కనెక్ట్ అయ్యేలా ఉంది. వెన్నెల కిషోర్, సత్య, చమ్మక్ చంద్ర, శ్రీనివాసరెడ్డి, బ్రహ్మాజీ, దువ్వాసి మోహన్, మహేష్ విట్టా, మిర్చి హేమంత్, కాదంబరి కిరణ్, సప్తగిరి అంతా కామెడీ కోసం వాడుకున్న బ్యాచే. రాతకు తగ్గట్టే వీళ్ళ నవ్వుల వాతలు ఉన్నాయి.జయ ప్రకాష్ రెడ్డి ఆఖరి సినిమా కాబోలు ఆయన కాసేపు కనిపించడం ఊరట.

డైరెక్టర్ అండ్ టీమ్

మాస్ మూవీస్ ని ఫలానా విధంగా తీస్తేనే హిట్ అవుతాయని చెప్పేందుకు ప్రత్యేకంగా గ్రామర్ అంటూ ఏమీ ఉండదు. ఒక్కసారి ఇవెలా సక్సెస్ అయ్యాయా అనిపించిన సినిమాలు లేకపోలేదు. ఎందుకంటే ఇలాంటివాటిలో లాజిక్ కు చోటు ఉండదు. హీరోయిజం ఎన్ని హద్దులైనా దాటవచ్చు. నేల విడిచి సాము చేయొచ్చు. అయితే ఇవన్నీ ఇమేజ్ మార్కెట్ ఉన్న హీరోలు చేస్తే చెల్లుతాయి. అయినా కూడా జనం అన్నీ మెచ్చుతారన్న గ్యారెంటీ లేదు. కానీ ఎందుకో మరి సాయి శ్రీనివాస్ ని అతిశయోక్తితో కూడుకున్న కథలలో చూపించడానికి ఇష్టపడుతున్నారు దర్శకులు. అల్లుడు అదుర్స్ ని కూడా సంతోష్ శ్రీనివాస్ అదే కోవలో తీర్చిద్దిదాడు.

మాస్ ఎంటర్ టైనర్స్ లో అన్నీ లాజిక్ ప్రకారం ఉండాలన్న రూల్ ఏమీ లేదు. సరైన పాళ్లలో వినోదాన్ని అందించి, కోరిన మసాలాలు సరైన రీతిలో కూర్చితే ఖచ్చితంగా సక్సెస్ దక్కుతుంది. కానీ అలా కాకుండా తలాతోక లేని స్క్రిప్ట్ తో ఓవర్ ఎలివేషన్లు, బిల్డప్పులు, ఊకదంపుడు డైలాగులతో ఇష్టం వచ్చినట్టు తీస్తే నిర్మొహమాటంగా జనం తిప్పికొట్టడం ఖాయం. అల్లుడు అదుర్స్ చూసే ప్రతి పది నిమిషాలకొకసారి అచ్చం ఇలాంటి ఫీలింగే కలుగుతుంది. హారర్ కామెడీని వెరైటీగా ట్రయ్ చేసి లారెన్స్ స్టైల్ లో సాయి శ్రీనివాస్ ని చూపించాలని చేసిన కామెడీ ట్రాక్ కూడా నవ్వులపాలైంది. అసలు సంభాషణలు రాసుకున్నప్పుడైనా రచయితలకు నవ్వొచ్చిందో లేదో కానీ ఫైనల్ గా మాత్రం ఎవరు రాశారాని టైటిల్ కార్డ్ వెతికి మరీ నిందించాలనిపిస్తుంది.

దేవిశ్రీప్రసాద్ సంగీతం సినిమాలాగే కొత్తగా లేదు. అంతా సోసోనే. పాటలు చాలా లావిష్ గా షూట్ చేయడంతో అవి మాత్రమే చూడాలనిపించేలా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ జస్ట్ ఓకే. ఛోటా కె నాయుడు పనితనంలో ఆయన అనుభవం కనిపించింది. తమ్మిరాజు ఎడిటింగ్ చాలా మోహమాటపడింది. ఫలితంగా లెన్త్ కూడా పెరిగింది. రామ్ లక్ష్మణ్ ఫైట్లు బాగున్నాయి కానీ దానికి తగ్గ బలమైన బ్యాక్ గ్రౌండ్ కథలో లేదు. గొర్రెల సుబ్రహ్మణ్యం నిర్మాణాన్ని మెచ్చుకోవాలి. ఇంతోటి సబ్జెక్ట్ కు మంచినీళ్లలా డబ్బును ఖర్చుపెట్టినందుకు.

ప్లస్ గా అనిపించేవి

ఖరీదైన నిర్మాణం
పాటల చిత్రీకరణ
కెమెరా పనితనం

మైనస్ గా తోచేవి

అర్థం లేని కామెడీ
సహనానికి పరీక్ష
సాయిశ్రీనివాస్ యాక్షన్
రొటీన్ డ్రామా

కంక్లూజన్

పండగ రోజు సరదాగా ఎంజాయ్ చేద్దామని సినిమాగా వెళ్లే ఆలోచన ఉంటే అది ఎంత పెద్ద తప్పో అనిపించేలా అల్లుడు అదుర్స్ చూపెట్టిన మానసిక నరకం గురించి ఎక్కువ చెప్పుకోకపోవడం మంచిది. రొటీన్ సినిమాలు చేయొచ్చు తప్పేం కాదు. కానీ వాటిలో కామన్ సెన్స్ ఉండాలి. అది లేనప్పుడు ఆడియెన్స్ ఎప్పటికీ మర్చిపోలేని బ్యాడ్ ఎక్స్ పీరియన్స్ టికెట్లకు పెట్టిన ఖర్చు సాక్షిగా ఇలా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. దానికి సాక్ష్యంగా అల్లుడు అదుర్స్ ని ఓ పది తరాల తర్వాత కూడా చెప్పుకోవచ్చు.

ఒక్క మాటలో – చూసినవాళ్ళు బెదుర్స్