iDreamPost

ఇళ్ల స్థ‌లాల పంపిణీ – ఓ ప‌రిశీల‌న‌..!

ఇళ్ల స్థ‌లాల పంపిణీ – ఓ ప‌రిశీల‌న‌..!

ఆంధ్ర‌ప్ర‌దేశ రాష్ట్రంలో అరుదైన ఘ‌ట్టం శుక్ర‌వారం (డిసెంబ‌ర్ 25) ఆవిష్కృత‌మైంది. ఇళ్ల స్థ‌లాల పంపిణీ గ‌తంలోనూ జ‌రిగింది. మున్ముందు కూడా జ‌ర‌గొచ్చు. కానీ గ‌తానికి, ఇప్ప‌టికి చాలా వ్య‌త్యాసం క‌నిపిస్తుంది. ఏపీ సీఎంగా వైఎస్ జ‌గ‌న్ కు ముందు ప్ర‌భుత్వాల హ‌యాంలో రేష‌న్ కార్డు పొందాలంటేనే ఓ ప్ర‌హ‌స‌నం. ఇక ఇళ్ల స్థ‌లం అంటే మాట‌ల్లో చెప్ప‌లేని సాహ‌సం. ఎన్నో అడ్డంకులను తొల‌గించుకుని.. ఎన్నెన్నో సార్లు అర్జీలు పెట్టుకుని.. లెక్క‌లేన‌న్ని సార్లు కార్యాల‌యాల చుట్టూ తిరిగినా ఆ పేదోడి క‌ల నెర‌వేరుతుందో లేదో కూడా చెప్ప‌లేని ప‌రిస్థితి. ఒక వేళ చ‌చ్చీచెడీ స్థ‌లం పొందినా.. ఆ స్థ‌లంలో గూడు క‌ట్టుకోవ‌డం మ‌రో సాహ‌సం. నిరుపేద‌ల‌కు శ‌క్తికి మించిన ప‌ని. జ‌గ‌న్ సీఎం అనంత‌రం అస‌లైన ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు పాల‌న మొద‌లైంది. ప్ర‌జ‌ల‌కు ఏ అవ‌స‌రం వ‌చ్చినా ద‌ర‌ఖాస్తు ఇచ్చేందుకు కూడా కార్యాల‌యానికి వెళ్లే అవ‌స‌రం లేకుండానే.. ప్ర‌భుత్వ ప్ర‌తినిధిగా వ‌లంటీరే ఇంటికి వ‌చ్చి తీసుకుని.. అర్హుల‌కు ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను అందిస్తున్నారు. ఇళ్ల స్థ‌లాల ల‌బ్ధిదారుల ఎంపిక కూడా క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జ‌ల ప‌రిస్థితి గ‌తుల‌ను స‌మీక్షించి, ఆధారాల‌తో రూడీ చేసుకుని అర్హ‌త గ‌ల‌వారిని ఎంపిక చేయ‌డం జ‌రిగింది.

దానికి ఎంతో ధైర్యం కావాలి..

ఇప్పుడు ఏపీలో ఎంత మందికి ఇళ్ల స్థ‌లాలు పంపిణీ చేస్తున్నారో తెలుసా… అక్ష‌రాలా 30 ల‌క్ష‌ల మందికి పైగానే. దేశ చ‌రిత్ర‌లోనే ఇంత మందికి స్థ‌లాలు ఇచ్చిన ఘ‌న‌త ఇదే ప్ర‌ప్ర‌థ‌మం. వాస్త‌వానికి అంద‌రికీ ఒకేసారి స్థ‌లాలు ఇచ్చి ల‌బ్ధిదారుల పేరిట రిజిస్ట్రేష‌న్ చేసి ఇవ్వాల‌నేది జ‌గ‌న్ సంక‌ల్పం. అంత‌టి నిర్ణ‌యం ఊహించుకోవ‌డానికే ఎంతో ధైర్యం కావాలి. అలాంటిది ఊహ‌కంద‌ని దానిని పేద‌ల‌కు అందించాల‌ని జ‌గ‌న్ సాహ‌సోపేత నిర్ణ‌యం తీసుకున్నారు. అదే జ‌రిగితే ఏపీలో ఇక త‌మ‌కు ఉనికే ఉండ‌ద‌ని కొంద‌రు రాజ‌కీయ అధినేత‌లు త‌మ వాళ్ల ద్వారా కోర్టులో కేసులు వేయించారు. ఫ‌లితంగా ల‌క్ష‌లాది మంది పేద‌ల ఆశ‌ల‌కు బ్రేక్ ప‌డింది. అడ్డంకులు తొలిగాక పేద‌లంద‌రి క‌ల ఒకేసారి నెర‌వేర్చాల‌ని జ‌గ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కూ వేచి చూశారు. దానికి మ‌రింత స‌మ‌యం ప‌ట్టేలా ఉండ‌డంతో వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించి తొలుత వివాదాలు లేని స్థ‌లాలు, ప్రాంతాల్లో పంపిణీకి సిద్ధ‌మ‌య్యారు. తూర్పు గోదావరి జిల్లా కొమరగిరిలో ఇళ్లు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్‌ శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికిపైగా అక్కాచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలను ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఈ పథకం కింద మొదటి దశలో 15 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం చేపట్టనుండగా రెండు దశల్లో 28 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం ఉచితంగా పూర్తి చేసిస్తామని చెప్పారు.

మాట‌ల్లో ఆత్మ‌విశ్వాసం..

ఇళ్ల స్థ‌లాల పంపిణీ కార్య‌క్ర‌మంలో జ‌గ‌న్ ఉప‌న్యాసాన్ని ప‌రిశీలిస్తే.. దీని కోసం ఆయ‌న ఎంత‌లా త‌ప‌న ప‌డ్డారో.. పేద‌ల అవ‌స‌రాల‌ను ఎలా గుర్తించారో తెలుస్తుంది. సొంతిల్లు లేని పేదల కష్టాలను పాదయాత్రలో కళ్లారా చూశానని, ఆ కారణం చేతనే ఇంత పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టాన‌ని చెప్పారు. 175 నియోజకవర్గాల్లో నూ నేటి నుంచి 15 రోజుల పాటు పండగలా పట్టాల పంపిణీ చేపడతామని ప్ర‌క‌టించ‌డం ద్వారా ఇది అమ‌లులోకి వ‌స్తున్నందుకు స్థ‌లం పొందిన ల‌బ్దిదారుల క‌న్నా.. ఇచ్చిన సీఎం ఎంత‌లా ఉద్విగ్నానికి లోన‌వుతున్నారో అర్థ‌మ‌వుతుంది. “కులాలు చూడం.. మ‌తాలు చూడం.. అర్హ‌త మాత్ర‌మే చూస్తాం..” అంటూ ల‌బ్దిదారుల ఎంపిక‌లో త‌మ చిత్త‌శుద్ధిని చాటారు. మ‌రో విచిత్రం ఏంటంటే.. యాధృచ్చిక‌మో.. నిర్ణ‌యాత్మ‌క‌మో కానీ.. ఈ కార్య‌క్ర‌మం ప్రారంభించిన తేదీ (డిసెంబ‌ర్ 25) స‌ర్వ‌మ‌త స‌మ్మేళ‌నంగా మారింది. ల‌బ్దిదారుల‌లో హిందూ – ముస్లిం – క్రైస్త‌వులు.. ఇలా అన్ని మ‌తాల వారూ ఉన్నారు. ప‌ట్టాల పంపిణీ రోజు కూడా అన్ని మ‌తాల ప‌ర్వ‌దినాల‌కు వేదిక‌గా మారింది. చ‌ర్చిల వ‌ద్ద క్రిస్మ‌స్ సంబ‌రాలు, దేవాల‌యాల వ‌ద్ద ఏకాద‌శి వేడుక‌లు, మ‌సీదుల వ‌ద్ద జుమ్మా (శుక్ర‌వారం) ప్రార్థ‌న‌లు అన్నీ ఒకే రోజు ఒక ప‌క్క జ‌రుగుతుండ‌గా.. మ‌రో ప‌క్క అన్ని మ‌తాల‌కు చెందిన పేద‌ల‌కు ప‌ట్టాల పండుగ కొన‌సాగింది. మాట‌ల్లో చెప్పిన‌ట్లే జ‌గ‌న్ చేత‌ల్లో చూపిన‌ట్లుగా మారింది. పాదయాత్రలో పేదల కష్టాలు దగ్గరుండి చూశానని, సొంతిల్లు లేని వారి కష్టాలను కళ్లారా చూశానని ఐదేళ్లలో 30.75 లక్షల మందికి ఇళ్లు కట్టిస్తామని ప్ర‌క‌టించి త‌న నిర్ణ‌యంపై వెనుదిరిగేది లేద‌ని వెల్ల‌డించారు. కుల, మత, రాజకీయాలకతీతంగా లబ్ధిదారుల ఎంపిక జరిగిందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఎన్నికల ముందు మొక్కుబడిగా ఇళ్ల నిర్మాణం ప్రారంభించిందని, మన ప్రభుత్వం కొత్త గ్రామాలను నిర్మించబోతుందన్నారు. ఇవాళ ఇళ్లు మాత్రమే కాకుండా ఊర్లు కడుతున్నామని చెప్పారు.

“అమరావతిలో 54వేల మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తామంటే సామాజిక అసమతుల్యం వస్తుందంటూ టీడీపీ కోర్టుకెళ్లింది. చంద్రబాబు, అనుచరుల పిటిషన్ల వల్ల 10% ఇళ్ల పట్టాల పంపిణీ నిలిచిపోయింది. నిన్న కూడా హైకోర్టులో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై పిల్ దాఖలు చేశారు. పేదల ఇళ్ల పట్టాల పంపిణీ కోసం ప్రభుత్వం సుప్రీం కోర్టులో పోరాడుతుంది. త్వరలోనే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఒక కులం ఉండకూడదని ఎవరైనా అంటారా? అందరూ కలిసి ఉండలేనప్పుడు అది రాజధాని ఎలా అవుతుంది? అందరికీ చోటు ఉంటేనే అది సమాజం అవుతుంది. అందరికీ మంచి చేస్తేనే అది ప్రభుత్వం అవుతుంది. 300 చదరపు అడుగుల టిడ్కో ఇళ్లలో జగనన్న స్కీమ్ కావాలా? చంద్రబాబు స్కీమ్ కావాలా? అని సర్వే చేశాం. 1.43 లక్షల మందిలో కేవలం ఒక్కరు మాత్రమే చంద్రబాబు స్కీమ్‌ అడిగారు. ఆ ఒక్కరికి చంద్రబాబు స్కీమ్‌లోనే ఇల్లు ఇస్తాం. మిగిలిన వారందరికీ జగనన్న స్కీమ్‌లో ఒక్క రూపాయికే ఇల్లు అందిస్తాం” అని చెబుతూ ప్ర‌తిప‌క్షానికి చురుక‌లు కూడా అంటించి రాజ‌నీతిజ్ఞ‌త ప్ర‌ద‌ర్శించారు. ఇంటి నిర్మాణాన్ని 224 చదరపు అడుగుల నుంచి 340 చదరపు అడుగులకు విస్తీర్ణం పెంచామ‌ని మ‌రో వ‌రాన్ని ల‌బ్దిదారుల‌కు అందించి పేద‌ల నివాసాలు కూడా విశాలంగా ఉండాల‌నే ఉద్దేశాన్ని ప్ర‌క‌టించారు. లబ్ధిదారుల పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించాలని ఆశ పడ్డా కొంత మంది కోర్టుకెళ్లి రిజిస్ట్రేషన్ ప్రక్రియను అడ్డుకున్నారని చెబుతూ.. త‌న ఆవేద‌న‌ను వెలిబుచ్చిన తీరు ప్ర‌శంస‌నీయం. కోర్టు అడ్డంకులు తొలగగానే లబ్ధిదారుల పేరుతో రిజిస్ట్రేషన్ చేసి తీరుతామ‌ని ప్ర‌క‌టించి ఇచ్చిన మాట‌పై వెన‌క్కి త‌గ్గేది లేద‌ని స్ప‌ష్టం చేశారు… ఇలా అణువ‌ణువూ ప‌ట్టాల పండుగ రోజు చ‌రిత్ర‌లో నిలిచిపోనుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి