iDreamPost

ఇకపై బ్యాంకులే కస్టమర్లకు ఫైన్ చెల్లించాలి! RBI సరికొత్త రూల్!

ఇకపై బ్యాంకులే కస్టమర్లకు ఫైన్ చెల్లించాలి! RBI సరికొత్త రూల్!

మనిషి మనుగడకు నీరు,గాలి ఎంత ముఖ్యమో.. డబ్బు కూడా అంతే. ‘ధనమేరా అన్నింటికి మూలం, ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం’ అని ఊరకనే చెప్పలేదు సినీ కవి. తాను సృష్టించిన డబ్బుకే.. దాసోహం అయ్యాడు మానవుడు. ఇప్పుడైతే డబ్బులేని లోకాన్ని ఊహించడం కష్టం. అయితే దేశంలో సామాన్యులు ఎక్కువ. దినసరీ కూలీలు, నెలసరి వేతనాలు తీసుకునే వారే అత్యధికులు. సంపాందిచిన కష్టంలో ఇంటి ఖర్చులు, ఇతర ఖర్చులు మినహాయించి.. మిగిలినదీ దాచుకుంటారు. వాటితోనే ఇల్లు, నగలు, ఇతర వస్తువులు తీసుకుంటుంటారు. అయితే అన్ని వేళలా పరిస్థితులు ఒకేలా ఉండవు.

ఆపదలు వచ్చినప్పుడు, పిల్లల చదువులకు,ఇతర ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు.. పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం పడుతుంటాయి. ఎవ్వర్నీ అడగాలో తెలియక.. రుణం కోసం బ్యాంకులకు, ఫైనాన్స్ సంస్థలకు వెళుతుంటారు. దాని కోసం స్థిర, చరాస్థులను తనఖా పెడుతుంటారు. అయితే ఆ అప్పులు తీర్చేశాక.. దానికి సంబంధించిన కాగితాలు ఇవ్వడంలో బ్యాంకులు, సంస్థలు జాప్యం చేస్తుంటాయి. తనఖా పెట్టిన డాక్యుమెంట్లను ఇవ్వకుండా రుణ గ్రహీతలను పలుమార్లు తమ చుట్టూ తిప్పించుకుంటూ.. ఏడిపిస్తూ ఉంటాయి. ఇక అటువంటి చర్యలకు చెక్ పెట్టేయనుంది భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ).

రుణం తీసుకున్న గ్రహీతలు.. తిరిగి మొత్తం అప్పు చెల్లించేశాక, వారు సమర్పించిన డాక్యుమెంట్లను 30 రోజుల్లోగా తిరిగి ఇచ్చేయాలని బ్యాంక్, బ్యాంకింగేతర సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది ఆర్బీఐ. ఈ ఆదేశాలను పాటించకపోతే.. 30 రోజుల తర్వాత రోజుకు రూ. 5 వేల చొప్పున లోన్ దారులకు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. లోన్ తీర్చేశాక రుణ గ్రహీతలకు తిరిగి ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్ విషయంలో పలు పద్ధతులను అనుసరిస్తున్నాయని, దాని వల్ల వివాదాలు దారి తీస్తున్నట్లు పేర్కొంది. పూర్తిగా రుణాలు చెల్లించిన తర్వాత.. 30 రోజుల వ్యవధిలో డాక్యుమెంట్లు తిరిగి ఇవ్వటానికి రిజిస్ట్రీలో నమోదైన చార్జీలను వసూలు చేయకూడదని బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థలను ఆదేశించింది.

ఒకవేళ డాక్యుమెంట్లు ఇవ్వటంలో జాప్యం జరిగితే, ఆలస్యానికి గల కారణాలను రుణ గ్రహీతలకు తెలియజేయాలని తన నోటిఫికేషన్‌లో వెల్లడించింది. ఏకైక లేదా ఉమ్మడి రుణ గ్రహీతలు మరణించినట్లయితే.. చట్టబద్ధమైన వారసులకు స్థిర, చరాస్తుల పత్రాలను తిరిగి చెల్లించేందుకు విధానపరమైన విధానాన్ని అనుసరించాలని పేర్కొంది. డిసెంబర్ 1, 2023 నుండి ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని తెలిపింది. ఈ లెక్క ప్రకారం.. లోన్ తీరిపోయిన 30 రోజుల్లో వారి పత్రాలు తిరిగి ఇవ్వకపోతే రోజుకు రూ. 5 వేల చొప్పున కస్టమర్లకు ఫైన్ కట్టాల్సి వస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి