iDreamPost

సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలు.. ప్రారంభంపై సీఎం క్లారిటీ..

సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలు..  ప్రారంభంపై సీఎం క్లారిటీ..

పరిపాలనా సంస్కరణతో గ్రామ స్థాయిలోనే ప్రభుత్వ కార్యకలాపాలు, సేవలు అందించేందుకు వైసీపీ ప్రభుత్వం పక్కా ప్లాన్‌తో వెళుతోంది. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా పరిపాలనా సంస్కరణలకు శ్రీకారం చుట్టిన సీఎం వైఎస్‌ జగన్‌ జాతీయ స్థాయిలో పేరుప్రఖ్యాతులు సంపాదించారు. గ్రామ సచివాలయాల ద్వారా రెవెన్యూ, వ్యవసాయం, పశుసంవర్థక, విద్య, వైద్యం, ఆరోగ్యం, విద్యుత్, పోలీస్‌ తదితర విభాగాలకు చెందిన 550 రకాల సేవలను ప్రభుత్వం అందిస్తోంది.

సచివాలయాల పక్కనే రైతులకు అవసరమైన అన్ని సేవలు అందించేందుకు వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లను స్థాపించాలని నిర్ణయించింది. గోడౌన్లు, ధాన్యం ఆరబెట్టుకునేందుకు కళ్లాలను కూడా నిర్మించాలని యోచిస్తోంది. ఇప్పటికే సచివాలయాలు, వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలకు శాశ్వత భవనాలను నూతనంగా నిర్మిస్తోంది. వచ్చే ఏప్రిల్‌ నాటికి వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లు, గోడౌన్లు, కళ్లాలును కూడా నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

రిజిస్ట్రేషన్‌ సేవలను కూడా సచివాలయాల్లో అందుబాటులోకి తెస్తామని సీఎం వైఎస్‌ జగన్‌ ఇప్పటికే ప్రకటించారు. అయితే ఆ సేవలు ఎప్పటి నుంచి ప్రారంభం అవుతాయన్న అంశంపై స్పష్టత లేదు. ఈ రోజు మంగళవారం ఈ విషయంపై సీఎం వైఎస్‌ జగన్‌ క్లారిటీ ఇచ్చారు. వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంపై సమీక్ష చేసిన సీఎం వైఎస్‌ జగన్‌ ఈ నెల 21వ తేదీన ఈ కార్యక్రమం ప్రారంభిస్తామని తెలిపారు. భూ రికార్డుల ప్రక్షాళన ( రీ సర్వే) తర్వాత గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలు ప్రారంభిస్తామని చెప్పారు. రీ సర్వే తర్వాత భూ యజమానులకు శాశ్వత ప్రాతిపదికన హక్కులు కల్పిస్తామని చెప్పారు.

వెఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం ( భూముల రీ సర్వే) మూడు దశల్లో చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. కార్స్‌ అనే అధునాతన టెక్నాలజీ ద్వారా ఈ సర్వే చేయనున్నారు. ఇప్పటికే అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. మూడు దశల్లో జరిగే భూ సర్వే కోసం మండలాన్ని రెవెన్యూ గ్రామాల ప్రాతిపదికన మూడు యూనిట్లుగా విభజించారు.

ఈ నెల 21 నుంచి ప్రారంభం అయ్యే మొదటి దశ రీ సర్వే 2021 డిసెంబర్‌ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. 2022 జనవరిలో రెండో దశ, 2023 జనవరిలో మూడో దశ రీ సర్వే చేయాలని భావిస్తోంది. 2024 మేలో జరిగే ఎన్నికలకు ఐదు నెలలు ముందుగానే రీ సర్వే పూర్తి చేసి భూములపై శాశ్వత హక్కులు కల్పించాలని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రణాళిక రచించారు. ప్రతి మండలంలో ఏ దశలో ఏఏ రెవెన్యూ గ్రామాల్లో రీ సర్వే చేయాలన్నది ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశలో తక్కువ భూ విస్తీర్ణం ఉన్న రెవెన్యూ గ్రామాలలో సర్వే చేయనున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి