iDreamPost

ఇక నుంచి 20 నిమిషాల్లో రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ పొందొచ్చు!

  • Published Sep 01, 2023 | 12:30 PMUpdated Sep 01, 2023 | 12:30 PM
  • Published Sep 01, 2023 | 12:30 PMUpdated Sep 01, 2023 | 12:30 PM
ఇక నుంచి 20 నిమిషాల్లో రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ పొందొచ్చు!

రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే పెద్ద ప్రక్రియ. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్ళాలి. మధ్యవర్తితో మాట్లాడి దస్తావేజులు రాయించుకోవాలి. అప్లికేషన్ ఫిల్ చేసి ఇవ్వాలి. అందుకోసం మధ్యవర్తికి కొంత డబ్బు ఇచ్చుకోవాలి. ఆ తర్వాత స్లాట్ బుక్ చేయించుకోవాలి. మళ్ళీ ఆ దరఖాస్తులను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్మిట్ చేయాలి. క్రయవిక్రయదారులు, సాక్షులు ఫోటోలు దిగాలి. ఇలా పెద్ద ప్రక్రియ. ఉదయం వెళ్తే మధ్యాహ్నం, సాయంత్రం అవుతుంది. దీని కంటే ముందు మధ్యవర్తి దగ్గర ఒక పూట సమయం పడుతుంది. ఇంత సమయం వృధా అవ్వకుండా, మధ్యవర్తి అవసరం లేకుండా జగన్ సర్కార్ రిజిస్ట్రేషన్ విధానాన్ని మరింత సులభతరం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం భూముల రిజిస్ట్రేషన్ కోసం ఆన్ లైన్ విధానాన్ని తీసుకొచ్చింది. ఆన్ లైన్ ద్వారా ఆస్తుల దస్తావేజుల రిజిస్ట్రేషన్ ని చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం అదనంగా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది.

ఇవాళ్టి నుంచి అనగా సెప్టెంబర్ 1 నుంచి ఈ విధానాన్ని కొన్ని ప్రాంతాల్లో అమలులోకి తీసుకొచ్చింది. సెప్టెంబర్ 15 నాటికి రాష్ట్రవ్యాప్తంగా దశల వారీగా అమలులోకి తీసుకురానుంది. ప్రస్తుతం ఉన్న ఆఫ్ లైన్ విధానాన్ని కొనసాగిస్తూనే ఆన్ లైన్ విధానాన్ని తీసుకొచ్చింది. ఐజీఆర్ఎస్ వెబ్ సైట్ లో చిన్న అప్లికేషన్ ని నింపడం ద్వారా కొనుగోలుదారులు డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ని సులభంగా పూర్తి చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ జరిగిన 20 నిమిషాల్లో రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ పొందవచ్చు. ఏ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఏ తేదీ నుంచి ఈ ఆన్ లైన్ విధానాన్ని అమలు చేయాలో రిజిస్ట్రేషన్ శాఖ ఆదేశాలు పంపినట్లు వెల్లడించింది. మధ్యవర్తులపై ఆధారపడకుండా సులువుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకునేలా సీఏఆర్డీ 2.O సాఫ్ట్ వేర్ ని రూపొందించినట్లు రిజిస్ట్రేషన్ శాఖ వెల్లడించింది. ఆధార్ నంబర్ తో రిజిస్ట్రేషన్ సేవలు లింక్ చేయడం వల్ల అసలు వ్యక్తులు లేకుండా డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయడం కుదరదని.. దీని వల్ల అవకతవకలను అదుపు చేయవచ్చునని వెల్లడించింది.

ఆన్ లైన్ విధానంతో రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎలా అంటే?

  • గూగుల్ లో ఐజీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ అని సెర్చ్ చేస్తే ఐజీఆర్ఎస్ – ఆంధ్రప్రదేశ్ వెబ్ సైట్ లింక్ వస్తుంది. ఆ లింక్ పై క్లిక్ చేసి వెబ్ సైట్ లోకి వెళ్ళాలి.
  • లేదా https://registration.ap.gov.in/igrs పై క్లిక్ చేయండి.
  • వెబ్ సైట్ లోకి వెళ్ళాక లాగిన్ అవ్వాలి.
  • మొబైల్ నంబర్ నమోదు చేశాక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని నమోదు చేస్తే ఒక దరఖాస్తు ఓపెన్ అవుతుంది.
  • ఆ దరఖాస్తులో ఆస్తుల వివరాలు, సర్వే నంబర్, లింక్ డాక్యుమెంట్ నంబర్ వంటి వివరాలు నమోదు చేయాలి.
  • ఆస్తుల తాలూకు పూర్వ దస్తావేజులు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.
  • రిజిస్ట్రేషన్ ఛార్జీలను ఆన్ లైన్ లో చెల్లించాలి.
  • క్రయవిక్రయదారుల ఫోటోలను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనే తీస్తారు. ఈకేవైసీ కూడా అక్కడే జరుగుతుంది. ఆధార్ కార్డులో ఉన్న బయోమెట్రిక్ వివరాలతో సరిపోలుస్తారు. ఈ విధానంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వినియోగదారులు ఎలాంటి దస్తావేజులను తీసుకెళ్లే పని లేదు. ఎందుకంటే ఆన్ లైన్ లో అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ ఆధారంగా వివరాలను పరిశీలిస్తారు.
  • ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న స్లాట్ కి అనుగుణంగా ఆ తేదీ, ఆ సమయానికి క్రయవిక్రయదారులు, సాక్షులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్ళాలి. సబ్ రిజిస్ట్రార్ ఈ-సైన్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిస్తారు. ఆన్ లైన్ లో నమోదు చేసిన వివరాలు, ఆన్ లైన్ లో జతపరిచిన డాక్యుమెంట్స్ ఆధారంగా భూముల వివరాలను పరిశీలించి 20 నిమిషాల్లో రిజిస్టర్డ్ దస్తావేజులను అప్పగిస్తారు. స్కానింగ్ ప్రక్రియ లేకపోవడం వల్ల రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ని 20 నిమిషాల్లో పొందవచ్చు.
  • మరోవైపు వ్యవసాయ భూమికి సంబంధించి విక్రయ రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాత ఎమ్మార్వో ఆఫీసుకు వెళ్లే పని లేకుండా వెంటనే మ్యుటేషన్ ప్రక్రియ జరిగేలా కొత్త విధానాన్ని రూపొందించడం జరిగింది.
  • ఏమైనా సందేహాలు ఉంటే ఇక్కడ క్లిక్ చేసి నివృతి చేసుకోవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి