iDreamPost

అక్కడ గెలుపు వారి తలరాతనే మార్చేసింది..!

అక్కడ గెలుపు వారి తలరాతనే మార్చేసింది..!

ఆల్‌ ఇండియా మజ్లిస్‌ ఎ ఇత్తేహదుల్‌ ముస్లమీన్‌ (ఏఐఎంఐఎం)… తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని పాతబస్తీకి, ఇంకా చెప్పాలంటే హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గానికే పరిమితమైన ఈ పార్టీ రూపురేఖలు ప్రస్తుతం మారిపోతున్నాయి. నగరం దాటి దేశంలోని వివిధ రాష్ట్రాలలో సత్తా చాటాలని ఎంఐఎం చేసిన ప్రయత్నాలు బిహార్‌ ఎన్నికల తర్వాత సఫలమవుతున్నాయి. గడచిన బిహార్‌ ఎన్నికల్లో ఆ పార్టీ ఐదు స్థానాలు గెలుచుకోవడం దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను ఆలోచింపజేసింది. అంతకు ముందు మహారాష్ట్రలోనూ ఆ పార్టీ ఖాతా తెరిసినా.. బిహార్‌ ఫలితం మాత్రం ప్రత్యేకంగా నిలిచింది. ఈ పరిణామం తర్వాత ఎంఐఎంతో ఎన్నికల పొత్తు పెట్టుకునేందుకు బీజేపీయేతర పార్టీలు ఆసక్తి చూపుతుండడం విశేషం.

దీదీ స్నేహహస్తం..

రాబోవు వేసవిలో పశ్చిమ బెంగాల్‌ శాసన సభ ఎన్నికలు జరగబోతున్నాయి. హాట్రిక్‌ కొట్టేందుకు తృణముల్‌ అధినేత మమతా, అధికారమే లక్ష్యంగా బీజేపీలు ఢీకొంటున్నాయి. ఇంకా ఎన్నికలకు సమయం ఉన్నా.. ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌లో ఆ రెండు పార్టీల మధ్య ఎన్నికల రాజకీయం ప్రారంభమైంది. బిహార్‌ ఎన్నికల ఫలితాల ఉత్సాహంలో ఉన్న ఎంఐఎం.. పశ్చిమ బెంగాల్‌లోనూ పోటీకి సిద్ధమైంది. ఆ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు మమతా బెనర్జీ ఆసక్తి చూపుతున్నారు. టీఎంసీతో కలసి వెళ్లేందుకు మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ సిద్ధంగా ఉన్నారు.

తమిళనాడులోనూ ఆహ్వానం..

తమిళనాడు శాసన సభకు రాబోవు వేసవిలోనే ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడా పోటీకి సిద్ధమైన మజ్టిస్‌కు.. ప్రస్తుత ప్రతిపక్ష పార్టీ డీఎంకే నుంచి పొత్తు రాజకీయానికి ఆహ్వానం అందింది. ఎన్నికల సన్నాహంలో భాగంగా ఈ నెల 6వ తేదీన మహానాడు పేరిట డీఎంకే కార్యక్రమం నిర్వహిస్తోంది. దీనికి ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ను డీఎంకే ఆహ్వానించింది. డీఎంకే ఆహ్వానాన్ని అసద్‌ కూడా అంగీకరించారు. ఇప్పటికే డీఎంకేతో పొత్తు పెట్టుకునేందుకు అసద్‌ తన ఆసక్తిని వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో తమిళనాడులో డీఎంకేతో మజ్లిస్‌ పొత్తు ఖాయంగా కనిపిస్తోంది. రెండు పర్యాయాలు అధికారానికి దూరంగా ఉన్న డీఎంకే ఈ సారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలనే లక్ష్యంతో ఉంది. కరుణానిధి రాజకీయ వారసుడుగా ఎంపికైన ఆయన చిన్న కుమరుడు స్టాలిన్‌ సమర్థత ఏమిటో గత లోక్‌సభ ఎన్నికల్లోనే తేలింది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తా చాటి సీఎం పీఠంపై కూర్చోవాలని స్టాలిన్‌ తహతహలాడుతున్నారు.

మజ్లిస్‌తో పొత్తుకు అదే కారణం..

సైద్ధాతికంగా బీజేపీ, ఎంఐఎంకు మధ్య తీవ్రమైన విభేదాలున్నాయి. బీజేపీతో పోల్చుకుంటే ఎంఐఎం చిన్న పార్టీ అయినా.. బీజేపీ రాజకీయాలను తీవ్ర స్థాయిలో విభేదించే పార్టీగా మజ్లిస్‌ నిలిచింది. మైనారిటీల గళాన్నివినిపించే, హక్కులను కాపాడే పార్టీగా ఇటీవల కాలంలో బాగా గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలో బీజేపీకి వ్యతిరేకంగా అన్ని రాష్ట్రాలలోనూ పోటీ చేస్తున్న మజ్లిస్‌.. ఎన్నికల ప్రచారంలో బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తోంది. అంతిమంగా ఇది అక్కడ బీజేపీయేతర పార్టీలకు నష్టం చేకూరుస్తోంది. సాధారణంగా స్థానిక మైనారిటీ ఓటర్లు బీజేపీయేతర పార్టీలకు మద్ధతిస్తున్నారు. ఎంఐఎం రంగ ప్రవేశం. అనంతరం బీజేపీని లక్ష్యంగా చేసుకుని చేసే ప్రచారం వల్ల హిందువుల ఓట్లు బీజేపీకి ఎక్కువగా పడడంతోపాటు.. మైనారిటీల ఓట్లు కొల్లగొడుతోంది. ఇది అంతిమంగా బీజేపీ వైరి పక్షానికి తీవ్ర నష్టం చేకూరుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎంఐఎంతో పొత్తుకు స్థానికంగా ఉండే పార్టీలు ఆసక్తి చూపుతున్నాయి. పొత్తు వల్ల మైనారిటీ ఓట్లు చీలిపోకుండా కాపాడుకోగలమని నమ్ముతున్నాయి. బిహార్‌లో ఆర్‌జేడీ‌ కూటమికి జరిగిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని ఇతర రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలు లౌక్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. దీన్ని అవకాశంగా మలుచుకుంటున్న ఎంఐఎం.. దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు మార్గాలు వేసుకుంటోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి