iDreamPost

తెలంగాణ ఎన్నికల్లో BRS ఓడిపోవడానికి 10 ప్రధానమైన కారణాలు ఇవే!

తెలంగాణ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో అసలు బీఆర్ఎస్ పార్టీకి ఇలాంటి ఫలితం దక్కడం ఏంటి? అనే ప్రశ్న వినిపిస్తోంది. అయితే అసలు బీఆర్ఎస్ పార్టీ ఓటమికి గల 10 ప్రధాన కారణాలు ఏంటో చూద్దాం.

తెలంగాణ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో అసలు బీఆర్ఎస్ పార్టీకి ఇలాంటి ఫలితం దక్కడం ఏంటి? అనే ప్రశ్న వినిపిస్తోంది. అయితే అసలు బీఆర్ఎస్ పార్టీ ఓటమికి గల 10 ప్రధాన కారణాలు ఏంటో చూద్దాం.

తెలంగాణ ఎన్నికల్లో BRS ఓడిపోవడానికి 10 ప్రధానమైన కారణాలు ఇవే!

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో వార్ వన్ సైడ్ అయిపోయింది. ‘ఔరేక్ దక్కా.. తెలంగాణ పక్కా’ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లి బీఆర్ఎస్ పార్టీకి నిరాశ తప్పేలా లేదు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలకు ప్రజలు పట్టం కడుతున్నారు. కాంగ్రెస్ ఏకపక్ష విజయం దాదాపుగా ఖరారు అయిపోయింది. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారం చేపట్టి.. పదేళ్లపాటు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పార్టీ ఈ తరహాలో పరాజయం పాలవడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. అయితే అసలు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి గల 10 ప్రధాన కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

పార్టీపై తగ్గిన విశ్వసనీయత:

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్ దే అనే మాటను ప్రజలు కూడా అంగీకరించారు. అందుకే ఆ పార్టీకి పదేళ్లపాటు అధికారాన్ని కట్టబెట్టారు. కానీ, గడిచిన కొన్నేళ్లలో బీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో విశ్వసనీయత తగ్గిపోయిందనే విషయం ఈ ఎన్నికల ఫలితాలతో తేటతెల్లమైంది. అధికార పార్టీ హోదా నుంచి ప్రతిపక్షంగా మారిపోయిన పరిస్థితి ఏర్పడింది. ‘ఔరేక్ దక్కా.. తెలంగాణ పక్కా’ అనేది కేవలం నినాదంగా మిగిలిపోవడానికి కారణం ఆ పార్టీ మీద ప్రజల్లో విశ్వసనీయత తగ్గడమే కారణం అంటున్నారు.

పదేళ్లలో నెరవేరని హామీలు:

బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు వెళ్లి గత రెండు దఫాల్లో ప్రజలకు వివిధ హామీలు ఉచ్చారు. వాటిలో బుట్ట దాఖలాలు అయిన హామీలు చాలానే ఉన్నాయి. గల్ఫ్ బోర్డు ఏర్పాటు, చనిపోయిన కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అనే అంశాలను మరచిపోయారు. మల్లన్న సాగర్ నిర్వాసితులకు అందాల్సిన పరిహారం అందకపోవడం. నిర్వాసితుల హామీలను నెరవేర్చకపోవడం. సింగరేణి ఓపెన్ కాస్ట్ గనులు మూయిస్తామన్న హామీలను నెరవేర్చకపోవడం. సింగరేణిలో కొత్త ఉద్యోగాలు వేయకపోవడం. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అందరికీ అందజేయలేకపోవడం. అమరవీరులకు భూములు, ఉద్యోగాలు ఇవ్వడంలో విఫలం కావడం. ఇలాంటి హామీలు నెరవేర్చడంలో బీఆర్ఎస్ వెనుకబడిపోయిందనే వాదన పెరిగిపోయింది.

అవినీతి ఆరోపణలు:

పార్టీలో ఉన్న ఎంతోమంది నాయకులపై విపరీతమైన అవినీతి ఆరోపణలు వచ్చాయి. అలాంటి ఆరోపణలను పార్టీ అధిష్టానం ఖాతరు చేయలేదు అనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా కేడర్ తో సంబంధం లేకుండా బడా బడా నాయకుల మీద కూడా అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. వాటిని ఖండించి మా పార్టీ అవినీతిని ప్రోత్సహించదు అనే మాటను బలంగా చెప్పలేకపోయారు. అవినీతి ముద్ర పడిన నాయకులకు అండగా నిలబడటం కూడా పార్టీని పెద్ద దెబ్బ కొట్టింది. ప్రజల్లో పార్టీ మీద నమ్మకం పోవడానికి కూడా ఇదొక కారణమంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అభ్యర్థుల ఎంపిక:

అభ్యర్థుల ఎంపిక విషయంలో బీఆర్ఎస్ పార్టీ తడబడినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. వారి ఓటమిలో అభ్యర్థుల ఎంపిక కీలక భూమిక పోషించింది. ఎవరి మీద అయితే వ్యతిరేకత ఉందో.. అలాంటి నాయకులకే మళ్లీ సీట్లు కేటాయించడం పెద్ద ఎదురుదెబ్బ అయ్యింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఎక్కువ వ్యతిరేకత ఉన్న స్థానాలను గుర్తించి.. అలాంటి సీట్లపై కఠినమైన నిర్ణయం తీసుకుని ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదంటూ రాజకీయ నిపుణులు చెబుతున్నారు.

సంక్షేమ పథకాలు:

తెలంగాణ ఏర్పడ్డాక అద్భుతమైన సంక్షేమ పథకాలను బీఆర్ఎస్ పార్టీ ప్రవేశ పెట్టింది. నిజానికి దేశానికే ఆదర్శంగా ఉండే ఎన్నో పథకాలను తీసుకొచ్చారు. కానీ, ఆ సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీ ఓటిమికి కారణంగా మారాయి. ఎందుకంటే అసలైన లబ్ధిదారులకు పథకాలు చేరవేయడంలో విఫలమైన పరిస్థితి కనిపించింది. కేవలం పార్టీ మనుషులకే పథకాలు అందాయి అనే అపవాదు ఉండనే ఉంది. దళిత బంధుపై కూడా తీవ్ర ఆరోపణలు, విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. అలాంటి సమయంలో కూడా పార్టీ స్పష్టమైన నిర్ణయం తీసుకోలేకపోయింది. అవి ప్రజల సంక్షేమం కోసం తెచ్చిన పథకాలు కాదు.. పార్టీ సంక్షేమ పథకాలే అంటూ విమర్శలు పెరిగిపోయాయి.

రెబల్ లీడర్స్:

పార్టీలో పెద్ద తలకాయలుగా ఉన్న ముఖ్యమైన నేతలు పార్టీని వీడడం పెద్ద ఎదురుదెబ్బ అయ్యింది. అసమ్మతి నాయకులను బుజ్జగించడంలో విఫలమయ్యారంటున్నారు. పైగా పార్టీ వీడిన నాయకులపై అవినీతి ఆరోపణలు చేయడం కూడా బ్యాక్ ఫైర్ అయ్యింది అంటున్నారు. పార్టీ వీడిన నేతలు కూడా తమ గెలుపు సంగతి పెక్కన పెట్టి మరీ.. బీఆర్ఎస్ పార్టీ ఓటమి కోసమే కృషి చేశారంటున్నారు.

ప్రజల్లో వ్యతిరేకత:

పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది అని చెప్పడానికి ఈ ఓటమే ప్రధాన ఉదాహరణ అంటున్నారు. ప్రజల్లో తమ పార్టీపై వస్తున్న వ్యతిరేకతను అంచనా వేయడంలో, ఆ వ్యతిరేకతను తగ్గించడంపై బీఆర్ఎస్ దృష్టి సారించలేదంటున్నారు. ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ అధిక ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పై నమ్మకం కంటే కూడా ఈ వ్యతిరేకతే బీఆర్ఎస్ ఓటమికి కారణం అంటూ నిపుణులు చెబుతున్నారు.

సౌత్ సెంటిమెంట్:

రాజకీయంగా సౌత్ లో ఒక సెంటిమెంట్ ఉన్న మాట అందరికీ తెలిసిందే. అదేంటంటే.. సౌత్ స్టేట్స్ లో ఒక రాజకీయ పార్టీ వరుసగా మూడోసారి విజయం సాధించలేదు. వరుసగా మూడోసారి బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని  భావించారు. అలా హ్యాట్రిక్ కొట్టి చరిత్ర సృష్టించాలని భావించారు కూడా. కానీ, ఈ సౌత్ సెంటిమెంట్ మళ్లీ రిపీట్ అయ్యింది. ఇక్కడి ఓటర్లు వరుసగా మూడోసారి ఒక పార్టీకి అధికారాన్ని అందించరు అనేది మరోసారి రుజువైంది అంటున్నారు.

నిరుద్యోగం:

బీఆర్ఎస్ పార్టీ నినాదం నీళ్లు, నిధులు, నియామకాలు అని అందరికీ తెలిసిందే. అయితే నియామకాల విషయంలోనే పార్టీ తడబడింది అంటున్నారు. ఇంటికో ఉద్యోగం అనే హామీని కేసీఆర్ నెరవేర్చలేకపోయారు కాబట్టి ఇలాంటి ఫలితం వచ్చిందంటున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకత రావడం వెనుక నిరుద్యోగులు కూడా ఉన్నారంటున్నారు. నిరుద్యోగుల సమస్యపై స్పెషల్ ఫోకస్ పెట్టి ఉంటే ఇలాంటి ఫలితం వచ్చేది కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

పోరాటాల అణచివేత:

తెలంగాణకు పోరాటాల పురిటిగడ్డ అనే పేరు ఉండనే ఉంది. పోరాటాలతోనే తెలంగాణను సాధించుకున్నారు. కానీ, అలాంటి పోరాటాలను బీఆర్ఎస్ పార్టీ అణచివేసింది అనే అపవాదు ఉందంటున్నారు. పోరాట యోధులను బీఆర్ఎస్ పార్టీ దూరం చేసుకోవడం పెద్ద పొరపాటుగా చెబుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నిరసన తెలియజేసే అవకాశం ఇవ్వలేదని, అణచివేత ధోరణి ప్రదర్శించిందంటూ విమర్శలు చేస్తున్నారు. పోరాటాలతో ఏర్పడిన పార్టీ నుంచి ఇలాంటి ఒక భావజాలాన్ని ప్రజలు తీసుకోలేకపోయారు అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి