iDreamPost

అన్నదాతకు, ఆరోగ్యానికి ‘భరోసా’ కేంద్రాలు

అన్నదాతకు, ఆరోగ్యానికి ‘భరోసా’ కేంద్రాలు

ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న అనేకానేక ఆరోగ్య సమస్యలకు.. వారు తినే ఆహారం ద్వారా శరీరాల్లోకి చేరుతున్న విషపూరిత పురుగుమందులేనని అనేక పరిశోధనల్లో ఇప్పటికే స్పష్టమైంది. ప్రజల ఆహార భద్రతను కాపాడేందుకు సదరు ఆహార పదార్ధాల ఉత్పత్తికి రైతులే వీటిని వినియోగించాల్సిరావడమే ఇక్కడ విషాదం. తింటున్నవారితో పాటు, వినియోగిస్తున్న వారి ఆరోగ్యానికి కూడా విషపూరిత పురుగుమందులు గొడ్డలిపెట్టుగా మారాయి. ప్రస్తుతం దేశంలో వినియోగిస్తున్న పురుగుమందుల్లో 40శాతం వరకు నిషేధిత జాబితాలోనే ఉన్నాయంటే ఆశ్చర్యం కలక్కమానదు.

సాగు నీరు, నేల పరిస్థితి, విత్తనం నాణ్యత ఇటువంటి అంశాలన్నిటితోనూ కలగలిసిన వ్యవసాయంలో పురుగుమందుల పాత్ర చాలానే ఉంటుందన్నది కాదనలేని సత్యం. ఆహార ఉత్పాదకను పెంచడంలో కూడా వీటి తోడ్పాటు ఎంతో ఉంటుంది. అయితే అంతిమంగా వినియోగదారుల ప్రాణాలకు ముప్పుతెస్తున్న నేపథ్యంలో పురుగుమందుల వినియోగం వీలైనంత మేరకు తగ్గించాల్సిన అవసరం ఎంతో ఉంది.

పురుగుమందుల వినియోగంలో రైతులకు అవగాహన ఉండడానికంటే, పురుగుమందుల షాపుల వాళ్ళ మాటే చెల్లుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అవసరం ఉన్నా లేకపోయినా పలు రకాల పురుగుమందులను రైతులకు అంటగట్టడంలో అమ్మకందారులు ఇప్పటికే ఆరితేరిపోయారు. ప్రపంచం మొత్తం నిషేధించిన గ్లైఫోసైట్‌ అనే కలుపునివారణ ముందు పేరు మార్చుకుని మన దేశంలో ఇప్పటిక్కూడా లభిస్తుందంటే పురుగుమందుల అమ్మకందారులు ఇక్కడ ఎంత బలమైనవారో అర్ధం చేసుకోవచ్చు.

ఆశాదీపాలుగా ఆర్‌బీకేలు..

ఇటువంటి పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం విప్లవాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు భరోసా కేంద్రాలు (ఆర్‌బీకే)లు ఆశాదీపాలుగా కన్పిస్తున్నాయి. గ్రామస్థాయిలోనే రైతులను ప్రకృతి వ్యవసాయం లేదా పెట్టుబడి లేని వ్యవసాయంవైపునకు మరల్చడం ఆర్‌బీకేల లక్ష్యాల్లో ఒకటి. అంతే కాకుండా సాగులో రైతులకు ఎదురయ్యే అనేకానేక సందేహాలను వెనువెంటనే తీర్చేందుకు కూడా ఆర్‌బీకేలు దోహదపడనున్నాయి. విషపూరిత రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించి, అవసరమైనంత వరకు మాత్రమే వినియోగించేలా రైతులను సమాయత్తం చేసేందుకు అక్కడి సిబ్బంది కృషి చేయనున్నారు. వీటి ద్వారానైనా తినే ఆహారంపై రసాయనాల భారిన పడకుండా ప్రజలు రక్షించబడతారన్న ఆశభావాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి