iDreamPost

ఐదు బ్యాంకులపై కొరడా ఝుళిపించిన RBI.. వీటిల్లో మీకు ఖాతా ఉందా..?

ఐదు బ్యాంకులపై కొరడా ఝుళిపించిన RBI.. వీటిల్లో మీకు ఖాతా ఉందా..?

పలు బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొరడా ఝుళిపిస్తోంది. ముఖ్యంగా కో ఆపరేటివ్ బ్యాంకులపై తీవ్ర చర్యలు తీసుకోంటోంది. నిబంధనలు పాటించడంలో అలసత్వం వహిస్తూ కస్టమర్ల సొమ్ములను ప్రమాదంలో పడేస్తుండటంతో ఇప్పటికే అనేక కో ఆపరేటివ్ బ్యాంకుల లైసెన్సులు రద్దు చేసింది. గత నెలలో కపూల్ కో ఆపరేటివ్ బ్యాంక్, లక్నో అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకు, అనంతసయనం కో ఆపరేటివ్ బ్యాంకు లైసెన్సులను రద్దు చేసిన సంగతి విదితమే. అలాగే జరిమానాలు విధిస్తోంది. ఇప్పుడు మరికొన్ని సహకార బ్యాంకులపై చర్యలకు ఉపక్రమించింది. తాజాగా ఏకంగా ఐదు కో ఆపరేటివ్ బ్యాంకులకు మొట్టి కాయలు వేసింది ఆర్బీఐ. ఇప్పుడు పేర్కొనే జాబితాలో మీ బ్యాంక్ కూడా ఉందేమో పరిశీలించండి.

ఎస్బీపీపీ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ది సహ్యాద్రి సహకారి బ్యాంక్ లిమిటెడ్, రహిమత్ పుర్ సహకారి బ్యాంక్ లిమిటెడ్, గాధీంగ్లజ్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ది కళ్యాణ్ జనతా సహకారి బ్యాంక్ లిమిటెడ్‌లపై 1949 బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం కింద జరిమానాలను విధించింది. డిపాజిట్ వడ్డీ రేట్లకు సంబంధించిన ఆదేశాలు, బ్యాంకింగ్ రెగ్యులేషన్ లోని కొన్ని సెక్షనల్లను ఉల్లంఘించిన కారణంగా ఈ బ్యాంకులకు ఫైన్ పడింది. గుజరాత్ ఎస్బీపీపీ కో ఆపరేటివ్ బ్యాంకుకు రూ. 13 లక్షలు, ముంబయిలోని సహ్యాద్రి సహకార బ్యాంకుకు రూ. 6 లక్షలు, సతారా రహిమత్ పుర్‌లోని.. రహిమత్ పుర్ బ్యాంకుకు రూ. లక్ష మేర జరిమానా విధించింది. నిరుపయోగ అకౌంట్ల వార్షిక సమీక్ష నిర్వహించని కారణంగా ఈ బ్యాంకుకు జరిమానా విధించింది.

కేవైసీతో సహా పలు ఆర్బీఐ నిబంధనలకు తూట్లు పొడిచినందుకు గాధీంగ్లజ్ బ్యాంకు పై రూ. 3 లక్షలు ఫైన్ పడింది. అలాగే డిపాజిట్ వడ్డీ రేట్లు, డిపాజిట్ అకౌంట్ల నిర్వహణ విషయాల్లో కేంద్ర బ్యాంకు ఆదేశాలను పాటించలేదన్న కారణంగా మహారాష్ట్రలోని మరో బ్యాంక్ కళ్యాణ్ జనతా సహకార బ్యాంకుకు రూ. 4. 50 లక్షల జరిమానా విధించింది. అంతటితో ఆగకుండా కస్టమర్లకు సమాచారం అందించకుండానే.. మినిమం బ్యాలెన్స్ మెయింటెన్స్ చేయని కస్టమర్ల నుండి చార్జీల రూపంలో వసూలు చేసింది. వీటన్నింటిపై ఫిర్యాదులు అందడంతో ఆర్బీఐ ఈ మేరకు చర్యలు తీసుకుంది. ఆర్బీఐ చేతిలో అత్యధికంగా మొట్టికాయలు తింటున్నాయి సహకార బ్యాంకులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి