iDreamPost

రాయపాటి నష్ట నివారణ చర్యలు.. నెపం మీడియా పైకి నెట్టిన మాజీ ఎంపీ..

రాయపాటి నష్ట నివారణ చర్యలు.. నెపం మీడియా పైకి నెట్టిన మాజీ ఎంపీ..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తాను చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు నష్టనివారణ చర్యలు చేపట్టారు. కమ్మవాళ్ళు తలుచుకుంటే జగన్ రెడ్డి లేచి పోతాడని తాను ఎక్కడ వ్యాఖ్యానించలేదని ఈ మాజీ ఎంపీ పేర్కొన్నారు. తన వ్యాఖ్యల్ని మీడియా తప్పుగా అర్థం చేసుకుందని నెపం మీడియా పైకి నెట్టేశారు. ఈ మేరకు ఈ రోజు మీడియాతో మాట్లాడిన రాయపాటి సాంబశివరావు తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నారు.

వైసీపీ ప్రభుత్వంలో కమ్మ కులస్తుల పట్ల జరుగుతున్న వివక్ష పైన తాను వ్యాఖ్యలు చేశానని మాజీ ఎంపీ రాయపాటి పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా సీఎం జగన్ అన్ని కులాలను కలుపుకుని ముందుకు సాగాలని సూచించానని చెప్పుకొచ్చారు. వైఎస్ జగన్ పైవ్యక్తిగతంగా తనకు ఎలాంటి ద్వేషం లేదని, ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనకు మంచి స్నేహితుడన్నారు. కమ్మ వారిపై ద్వేషం మంచిది కాదని.. రాజకీయాల్లో సీనియర్ గా తాను సలహా ఇచ్చానన్నారు.

సీఎం స్థాయి వ్యక్తి తరచు కులాల ప్రస్తావన తేవడం బాగాలేదని రాయపాటి వ్యాఖ్యానించారు. సీఎం వ్యాఖ్యలు తనకు చాలా బాధకు గురిచేశాయన్నారు. తాను అనని మాటలను అన్నట్లుగా మీడియాలో ప్రచారం కావడంతో రాత్రి నుంచి వందలాది బెదిరింపు కాల్స్ వస్తున్నాయని రాయపాటి ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో తన పై అసభ్యంగా పోస్టులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

నిన్న ఆగ్రహంతో ఊగిపోయి, కమ్మోళ్లతో పెట్టుకుంటే జగన్ లేచిపోతాడన్న రాయపాటి వాఖ్యలు ABN తో సహా అన్ని ఛానల్స్ ప్రసారం చేసాయి,పత్రికలు వార్త రాసాయి .. అనాల్సిన మాటలన్నీ అన్ని తీరికగా “నా వాఖ్యలు మీడియా వక్రీకరించింది” అనటం రాజకీయనాయకులకే మామూలే… ఇప్పుడు రాయపాటి కూడా తప్పంతా మీడియాదే అనటంలో విచిత్రం ఏముంది?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి