iDreamPost

ఎన్నిక‌లు ప్ర‌శాంతంగా జరిగేనా..

ఎన్నిక‌లు ప్ర‌శాంతంగా జరిగేనా..

సార్వ‌త్రిక ఎన్నిక‌లంటే ఒకెత్తు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లంటే మ‌రో ఎత్తు. అవును నిజ‌మే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఎన్నిక‌ల‌కు ప్ర‌త్యేక‌త ఉంది. స‌ర్పంచ్‌, ఎంపిపి, జెడ్పీటీసీ, జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్ ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో రాయ‌ల‌సీమ‌లో ప‌రిస్థితులు ఎలా ఉంటాయోన‌న్న భ‌యాందోళ‌న అంద‌రిలో నెల‌కొంది.

క‌ర్నూలు, క‌డ‌ప‌, అనంత‌పురం, చిత్తూరు జిల్లాలలో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై ఎప్పుడూ ఓప్ర‌త్యేక శ్ర‌ద్ద ఉంటుంది. ఆయా జిల్లాల యంత్రాంగం మొత్తం ఎన్నిక‌లెప్పుడు వ‌చ్చినా అల‌ర్ట్‌గా ఉంటారు. స‌రిగ్గా ఇప్పుడు అదే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీలైన వైసీపీ, టిడిపి మ‌ధ్య‌నే జ‌రుగుతాయ‌న్న‌ది అంతా చ‌ర్చించుకుంటున్న అంశం. ఎన్నిక‌ల నేప‌థ్యంలో గ్రామాల్లో గ్రూపుల మ‌ధ్య చిచ్చురేగే ప‌రిస్థితులు ఉన్నాయి. అందుకే పోలీసులు ముంద‌స్తుగానే నిఘా ఉంచిన‌ట్లు తెలుస్తోంది. గ్రామీణ స్థాయిలో రాయ‌ల‌సీమ‌లో వైసీపీకి మంచి ప‌ట్టు ఉంది. ఏ నియోజ‌క‌వ‌ర్గం తీసుకున్నా వైసీపీకి ప్ర‌జ‌ల్లో మంచి పేరుంది. ఈ నేప‌థ్యంలో ఈ ఎన్నిక‌ల్లో కూడా క‌చ్చితంగా గెలుపు వైసీపీదే అని ఇప్ప‌టికే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే రాష్ట్రంలో నెల‌కొన్న తాజా ప‌రిస్థితుల‌ను బేరీజు వేసుకొని టిడిపి గెలుపుపై ఆశ‌లు పెట్టుకుంది. ప్ర‌భుత్వ వ్య‌తిరేక విధానాలే త‌మ‌ను స్థానిక సంస్థ‌ల్లో గెలిపిస్తాయ‌ని టిడిపి నేత‌లు చెబుతున్నారు. 

Read Also: బాబు అమ్ముల పొదిలో అస్త్రం.. సరైన సమయంలో వదలాలనుకుంటున్నారా..?

స్థానిక పోరుతో పాటు ప‌ట్ట‌ణాల్లో కూడా మున్సిప‌ల్ ఎన్నిక‌ల హ‌డావిడి క‌నిపిస్తోంది. ఇప్ప‌టి నుంచి మూడు నెల‌ల పాటు ఎన్నిక‌లు వేడి ఉండే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో పోలీసు యంత్రాంగం ఇప్ప‌టి నుంచే వీటిపై గురి పెట్టిన‌ట్లు తెలుస్తోంది. గ‌డిచిన ఎన్నిక‌లు, ఆయా ప్రాంతాల్లో జ‌రుగుతున్న హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు బ‌ట్టి ఎలా ముందుకెళ్లాల‌న్న దానిపై అధికార యంత్రాంగం క‌స‌ర‌త్తులు చేస్తోంది. ప్ర‌ధానంగా క‌ర్నూలు జిల్లాలో నంద్యాల‌, ఆళ్ళ‌గ‌డ్డ‌, బ‌న‌గాన‌ప‌ల్లె, ప‌త్తికొండ‌, కోడుమూరు లాంటి ప్రాంతాల‌పై పోలీసులు ప్ర‌త్యేక శ్ర‌ద్ద క‌న‌బ‌రుస్తున్నారు. మొన్న బ‌న‌గాన‌ప‌ల్లె నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన దారుణ‌హ‌త్య లాంటి ఘ‌ట‌న‌లు జ‌రిగితే శాంతిభ‌ద్ర‌త‌లు దెబ్బ‌తింటాయ‌ని అల‌ర్ట్‌గా ఉన్నారు. ఇక అనంత‌పురం జిల్లాలో కూడా ఇదే ప‌రిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో శాంతిభ‌ద్ర‌త‌ల‌ను పోలీసులు ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఎన్నిక‌ల హ‌డావిడిలో ఉంటూనే ఆందోళ‌న‌లు చేసే వారిపై ఓక‌న్నేసి ఉంచిన‌ట్లు తెలుస్తోంది. ప‌నిగ‌ట్టుకొని ఆందోళ‌న‌లు ప్రోత్స‌హించే వారిపై జ‌గ‌న్ స‌ర్కార్ సీరియ‌స్‌గా వ్య‌వ‌హ‌రించ‌నుంది.

Read Also: మనసున్న మా”స్టారు”…

ఇక క‌డ‌ప జిల్లా విష‌యానికొస్తే జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 70 గ్రామాల‌ను పోలీసులు ఫ్యాక్ష‌న్ గ్రామాలుగా గుర్తించారు. వీటిలో హైప‌ర్ సెన్సిటివ్‌, సెన్సిటివ్‌, ఇలా విభాగాలు చేసుకున్నారు. హైపర్ సెన్సిటివ్‌గా ఉన్న లింగాల‌మండ‌లం గున‌క‌న‌ప‌ల్లి, చాపాడు మండ‌లం చిన్న వ‌ర్ధాయ‌ప‌ల్లి గ్రామాల్లో పోలీస్ పికెట్‌లు కొన‌సాగుతున్నాయి. ఇవి కాకుండా 12 సెన్సిటివ్‌, 40 డార్మెంట్ స‌మ‌స్య‌త్మాక గ్రామాలు ఉన్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో న‌మోదైన కేసుల‌ను బ‌ట్టి ప‌రిస్థితుల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు. పోలీసు యంత్రాంగం మొత్తం గ్రామీణ ప్రాంతాల‌పైనే ఫోక‌స్ పెట్ట‌న‌ట్లు తెలుస్తోంది. రౌడీషీట‌ర్ల‌తో పాటు అల‌ర్ల‌ను ప్రోత్స‌హించే వారిపై కూడా ప్ర‌త్యేక నిఘా ఉంచాల‌ని ప‌బ్లిక్ కోరుతున్నారు. ఏదిఏమైనా ఎన్నిక‌ల వేళ ఎలాంటి గొడ‌వ‌లు జ‌రుగ‌కుండా ప్ర‌శాంతంగా ఉండాలి.. ఈ విధంగా పోలీసులు చ‌ర్య‌లు తీసుకోవ‌డంతో పాటు ప్ర‌జ‌ల్లో కూడా అవ‌గాహ‌న రావాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి