iDreamPost

నరాలు తెగే ఉత్కంఠ.. కన్నీళ్లు పెట్టుకున్న రషీద్‌ ఖాన్‌!

  • Published Sep 06, 2023 | 8:49 AMUpdated Sep 06, 2023 | 9:34 AM
  • Published Sep 06, 2023 | 8:49 AMUpdated Sep 06, 2023 | 9:34 AM
నరాలు తెగే ఉత్కంఠ.. కన్నీళ్లు పెట్టుకున్న రషీద్‌ ఖాన్‌!

ఆసియా కప్‌ 2023లో అసలు సిసలైన క్రికెట్‌ మజాను అందించింది శ్రీలంక-ఆఫ్ఘానిస్థన్‌ మ్యాచ్‌. సూపర్‌ 4కి క్వాలిఫై అయ్యేందుకు ఆఫ్ఘాన్‌ తమ శక్తిమేరా అద్భుతంగా పోరాడింది. కానీ, ఒత్తిడిని తట్టుకోలేక చివర్లో చేతులెత్తేసింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన శ్రీలంక.. ఆఫ్ఘాన్‌ దెబ్బకు టోర్నీ నుంచే బయటికి వెళ్లిపోయే డేంజర్‌ నుంచి కొద్దిలో తప్పించుకుని సూపర్‌ 4కి క్వాలిఫై అయింది. చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు.. ఎట్టకేలకు లంక సూపర్‌ 4కు చేరుకుంది.

అయితే.. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘానిస్థాన్‌ పోరాటం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. 292 పరుగుల టార్గెట్‌. ఇది 50 ఓవర్లలో ఛేజ్‌ చేసినా.. వాళ్ల క్రికెట్‌ చరిత్రలో ఇదే అత్యధిక టార్గెట్‌ ఛేజ్‌ అవుతుంది. అలాంటి టీమ్‌.. కేవలం 37.1 ఓవర్లలో 292 పరుగులు చేస్తేనే ఆసియా కప్‌లో సూపర్‌ 4కి క్వాలిఫై అవుతుంది. మాజీ కెప్టెన్‌ నబీ 32 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సులతో 65 పరుగులు చేసి లంకేయులపై చెలరేగితే.. ఆఫ్ఘాన్‌లో ఆశలు చిగురించాయి. దాన్ని కెప్టెన్‌ షాహీదీ, జకత్‌, జద్రాన్‌, రషీద్‌ ఖాన్‌ కూడా కొనసాగించడంతో ఆఫ్ఘాన్‌ సూపర్‌ 4కు క్వాలిఫై అయిపోయినట్లే కనిపించింది.

కానీ, ఒత్తిడిని తట్టుకోలేకపోయారు ఆఫ్ఘాన్‌ బ్యాటర్లు. లంక టీమ్‌లో వికెట్‌ టేకింగ్‌ బౌలర్ల బౌలింగ్‌ కోటా పూర్తి అయిపోయినా చివర్లో సాధారణ బౌలర్లే ఆఫ్ఘాన్‌ కొంపముంచారు. నబీ అవుట్‌ అవ్వడంతో మ్యాచ్‌లో వెనుకబడిన ఆఫ్ఘాన్‌, జకత్‌, రషీద్‌, జద్రాన్‌ పోరాటంతో చివరి క్షణం వరకు పోరాడింది. చివరి 7 బంతుల్లో 15 పరుగులు అవసరమైన దశలో రషీద్‌ 6 బంతుల్లో మూడు ఫోర్లతో 12 పరుగులు చేశాడు. దీంతో ఒక్క బంతికి 3 రన్స్‌ అవసరైమన దశలో ముజీబ్‌ క్యాచ్‌ అవుట్‌ అవ్వడంతో ఆఫ్ఘాన్‌ ఆశలు ఆవిరయ్యాయి.

అయితే.. అదే ఓవర్‌లో ఓ సిక్స్‌ కొట్టినా ఆఫ్ఘాన్‌కు క్వాలిఫై అయ్యే ఛాన్స్‌ ఉన్నా.. ఆ విషయం తెలియని రషీద్‌ ఖాన్‌ ఓటమి బాధలోనే ఉండిపోయాడు. ఈ లోపు ఆఫ్ఘాన్‌ ఫారుఖీ రూపంలో చివరి వికెట్‌ కూడా కోల్పోయింది. 16 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో 27 పరుగులు చేసిన రషీద్‌ ఖాన్‌.. 37.1 ఓవర్లలో 292 పరుగులకు 3 పరుగుల దూరంలో ఆగిపోయామని బాధతో గ్రౌండ్‌లో మోకాళ్లపై కూలబడిపోయాడు. ఆ సమయంలో రషీద్‌ కళ్లలో నీళ్లు తిరిగాయి. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘాన్‌ ఓటమిపాలైనప్పటికీ రషీద్‌ ఖాన్‌తో పాటు నబీ పోరాటంపై ప్రశంసల వర్షం కురుస్తుంది. మొత్తానికి ఆసియా కప్‌లో ఓ అద్భుతమైన థ్రిల్లర్‌ మ్యాచ్‌ను అందించాయి శ్రీలంక-ఆఫ్ఘానిస్థాన్‌. మరి ఈ మ్యాచ్‌తో పాటు రషీద్‌ ఎమోషనల్‌ అవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: చిన్న వయసులోనే కష్టపడి ఎదిగి.. అసలు సమరానికి దూరంగా!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి