iDreamPost

చిన్న వయసులోనే కష్టపడి ఎదిగి.. అసలు సమరానికి దూరంగా!

  • Published Sep 05, 2023 | 5:40 PMUpdated Sep 06, 2023 | 10:02 AM
  • Published Sep 05, 2023 | 5:40 PMUpdated Sep 06, 2023 | 10:02 AM
చిన్న వయసులోనే కష్టపడి ఎదిగి.. అసలు సమరానికి దూరంగా!

భారత్‌ వేదికగా అక్టోబర్‌ 5 నుంచి ప్రతిష్టాత్మక వన్డే వరల్డ్‌ కప్‌ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ కోసం తాజాగా బీసీసీఐ 15 మందితో కూడిన స్క్వాడ్‌ను ప్రకటించింది. రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో పటిష్టమైన జట్టు వరల్డ్‌ కప్‌ కోసం సిద్ధం కానుంది. అయితే.. ఈ టీమ్‌లో కొంతమందికి చోటు దక్కలేదని, వాళ్లను ఎంపిక చేసి ఉండాల్సిందనే వాదనలు, విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే.. వారితో పాటు మరో ఆటగాడు కూడా ఈ వరల్డ్‌ కప్‌ను మిస్‌ అవుతున్నాడు. అతనెవరో కాదు భారత జట్టు భవిష్యత్తుగా కనిపించే.. హైలీ టాలెంటెడ్‌ క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌. ఈ వరల్డ్‌ కప్‌ టీమ్‌లో కచ్చితంగా ఉండాల్సిన ఆటగాడు. అన్నీ సవ్యంగా జరిగి ఉంటే.. టీమ్‌లో ఉండేవాడు. కానీ, దేవుడు పెట్టిన పరీక్షకు బలై.. ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్నాడు.

చిన్నతనం నుంచి క్రికెట్‌పై పిచ్చి ఇష్టంతో క్రికెట్‌నే కెరీర్‌గా మలచుకున్నాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో.. తన స్వగ్రామం ఉత్తరాఖండ్‌ నుంచి ఢిల్లీకి వెళ్లి మరీ క్రికెట్‌లో కోచింగ్‌ తీసుకున్నాడు. 13 ఏళ్ల వయసులో ఢిల్లీలో తారక్ సిన్హా వద్ద క్రికెట్‌ కోచింగ్‌ తీసుకుంటున్న సమయంలో సరైన వసతి సౌకర్యాలు లేకపోయినా.. గురుద్వార్‌లో ఉంటూ మరీ కోచింగ్‌ నేర్చుకుని.. అంచెలంచెలుగా ఎదిగి.. దేశం తరఫున ఆడే అవకాశం అందుకున్నాడు.

ధోని లాంటి గొప్ప క్రికెటర్‌ రిటైర్‌ అయిపోయిన తర్వాత.. టీమిండియా అంత మంచి కీపర్‌ దొరకడం కష్టమే అని అనుకుంటున్న తరుణంలో చిచ్చరపిడుగులా భారత జట్టులోకి వచ్చాడు పంత్‌. ఎంతో ఎనర్జిటిక్‌గా ఉంటూ.. జట్టులో నిత్యం ఉత్సాహం నింపుతూ ఎంతో చలాకీగా ఉండేవాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌ కూడా అయ్యాడు. అక్కడ రికీ పాంటింగ్‌, సౌరవ్‌ గంగూలీ లాంటి ఉద్ధండుల వద్ద మరింత రాటుతేలి.. టీమిండియాలో కీ ప్లేయర్‌గా మారాడు. వికెట్‌ కీపింగ్‌తో పాటు మిడిల్‌, లోయర్‌ ఆర్డర్‌ బ్యాటింగ్‌లో టీమిండియాకు వెన్నెముకలా మారిపోయాడు. పంత్‌ ఆడుతున్నంత సేపు.. అతను లేని టీమిండియాను ఊహించడం కూడా కష్టంగా మారేది.

2020-21లో గాబాలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో, అలాగే చెన్నైలో ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టులో పంత్‌ ఆడిన ఇన్నింగ్స్‌లను ఏ భారత క్రికెట్‌ అభిమాని కూడా అంత సులువుగా మర్చిపోలేడు. ఎంతో కీలక సమయంలో టెస్టుల్లో తనకు మాత్రమే సాధ్యమైన ఎటాకింగ్‌ క్రికెట్‌తో టీమిండియాను గెలిపించాడు. గాబా టెస్టుతో పంత్‌ పేరు మారుమోగిపోయింది. టీమిండియాలో పంత్‌ లాంటి ప్లేయర్‌ ఉండటం మన జట్టు చేసుకున్న అదృష్టంగా చాలా మంది క్రికెటర్లు అభివర్ణించారు. అలా టీమిండియాకు పంత్‌ ఒక రెగ్యులర్‌ వికెట్‌ కీపర్‌ కమ్‌ బ్యాటర్‌ అయిపోయాడు. పరిమిత ఓవర్ల క్రికెటర్ల కాస్త తడబడినా.. పంత్‌ ఓ అద్భుతమైన ఫినిషర్‌. అతను లేని టీమిండియాను ఊహించడం కష్టం. కానీ,

విధి ఆడిన నాటకంలో పంత్‌ ఏకంగా జట్టుకూ దూరమై చావు అంచుల వరకు వెళ్లొచ్చి, ఇంటికే పరిమితం అయ్యాడు. 2022 డిసెంబర్‌ 30.. అంతా కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు మరొక్కరోజే ఉందని ఎదురుచూస్తున్న క్రమంలో.. భారత క్రికెట్‌ను ఒక్కసారిగా కుదిపేసిన వార్త.. పంత్‌ కారు ప్రమాదం. ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్‌లోని తన స్వగ్రామం వెళ్తూ.. రూర్కీ వద్ద తెల్లవారుజామున పంత్‌ కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో పంత్‌ కారు కాలి బూడిదైంది. అదృష్టవశాత్తు పంత్‌ ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ విషాదం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటూ.. మళ్ళీ మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు.

ఆ ఒక్క రాత్రి పంత్‌ కారు నడపకపోయి ఉంటే.. ఈ రోజు వరల్డ్‌ కప్‌ స్క్వాడ్‌లో అతని పేరు ఉండేది. టీమిండియాకు ఓ అద్భుతమైన వికెట్‌ కీపర్‌తో పాటు బెస్ట్‌ ఫినిషర్‌ ఉండేవాడు. వరల్డ్‌ కప్‌లో ఎలాంటి బౌలర్‌నైనా ధైర్యంగా ఎదుర్కొని ఎటాక్‌ చేసే ఓ సూపర్‌ డూపర్‌ లెఫ్ట్‌ హ్యాండర్‌ టీమిండియాలో ఉండేవాడు. పంత్‌ లేకపోవడం కచ్చితంగా టీమిండియాకి పెద్ద దెబ్బే అని చెప్పాలి. క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకుని.. టీమిండియా తరఫున ఆడి తన కల నెరవేర్చుకున్న పంత్‌.. అసలు సమరానికి మాత్రం దేవుడు పెట్టిన పరీక్షతో దూరమయ్యాడు. అయినా కూడా పట్టువదలని విక్రమార్కుడిలా పంత్‌ మళ్లీ టీమ్‌లోకి వచ్చి.. కచ్చితంగా 2027 వరల్డ్‌ కప్‌ కి ఆడతాడన్న విశ్వాసం అందరిలో ఉంది. మరి ఈ వరల్డ్‌ కప్‌కి పంత్‌ లేకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి