iDreamPost

పెద్దల ఎంట్రీకి కరోనా అడ్డు

పెద్దల ఎంట్రీకి కరోనా అడ్డు

రాజ్యసభలో పెద్దల ఎంట్రీపై కూడా కరోనా ప్రభావం పడింది. ఈ నెల 26వ తేదీన రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే కరోనా వైరస్‌ ప్రభావంతో రాజ్యసభ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు మంగళవారం ప్రకటించింది. తిరిగి ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తామన్నది త్వరలో వెల్లడిస్తామని తెలిపింది.

వచ్చే నెల 4వ తేదీకి రాజ్యసభలో 55 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి ఈ ఖాళీలు భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల మొదటి వారంలో నోటిఫికేషన్‌ ఇచ్చింది. 13వ తేదీతో నామినేషన్ల గడువు ముగిసింది. 38 స్థానాలకు సింగిల్‌ నామినేషన్లు దాఖలు కావడంతో వారందరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. మరో 17 స్థానాలకు పోటీ ఉండడంతో ఈ నెల 26న ఎన్నికలు జరగాల్సి ఉండగా వాయిదా పడ్డాయి.

తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ నుంచి రెండు స్థానాలు ఖాళీ అవుతుండగా.. టీఆర్‌ఎస్‌ నుంచి కె.కేశవరావు, కేఆర్‌ సురేష్‌రెడ్డిలు ఇద్దరే నామినేషన్‌ దాఖలు చేయడంతో వారి ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇక ఏపీలో నాలుగు స్థానాలకు వైసీపీ నుంచి నలుగురు, బలం లేకపోయినా టీడీపీ నుంచి ఒకరు నామినేషన్‌ వేడయంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. మళ్లీ ఎన్నికలు జరిగే వరకూ పెద్దలు రాజ్యసభలో ఎంట్రీకి ఎదురుచూడాల్సిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి