iDreamPost

కొత్త చర్చకు తెరలేపుతున్న ‘రద్దు’ టిక్కెట్లు

కొత్త చర్చకు తెరలేపుతున్న ‘రద్దు’ టిక్కెట్లు

హఠాత్తుగా ఎక్కడికైనా ప్రయాణం పెట్టుకుని రైల్వే రిజర్వేషన్‌ కోసం ప్రయత్నిస్తే వెయిటింగ్‌ లిస్టులో మన పేరు ఉంటుంది. అయితే అది కన్ఫర్మ్‌అవుతుందో? లేదో? తెలియదు. ఒక వేళ కన్ఫర్మ్‌కాకపోతే రిజర్వేషన్‌ను మనం రద్దు చేసుకుంటాం. అయితే ఇలా ఒక అయిదేళ్ళలో రద్దు చేసుకున్న టిక్కెట్లు ఎన్ని ఉంటాయో ఎప్పుడైనా ఆలోచించారా..

అక్షరాలా అయిదు కోట్ల టిక్కెట్లు..

ఓ సామాజిక కార్యకర్త దరకాస్తు చేసుకున్న సమాచార హక్కుచట్టం ద్వారా ఈ విషయం వెల్లడైంది. దీంతో ఇలా రద్దు చేసుకున్న టిక్కెట్ల విషయం కొత్త చర్చలకు తావిస్తోంది. ఇప్పటికే పలు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడంలో కేంద్ర ప్రభుత్వం ఉత్సాహం చూపుతోంది. ఇదే క్రమంలో దశల వారీగా పెట్టుబడుల ఉపసంహరణలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే రైల్వేలో ప్రైవేటు రైళ్ళను ప్రవేశపెట్టేందుకు కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేసారు.

సాధారణంగా ఎక్కడైనా అత్యద్భుతమైన అవకాశాలు ఉన్న చోట వ్యాపరం చేయడానికి ఎవ్వరైనా ఆసక్తి చూపిస్తుంటారు. కానీ ప్రభుత్వ రంగ సంస్థల విషయంలో అద్భుత వ్యాపార అవకాశాలు ఉన్నవాటిని ప్రైవేటు పరం చేస్తుంటారు. రైల్వేలో కూడా అదే జరుగుతోందన్న చర్చ సోషల్‌ మీడియాలో ఊపందుకుంది. 5కోట్ల టిక్కెట్లు కేన్సిల్‌ చేసుకున్నారు అంటే ఆ స్థాయిలో రైల్వే సదుపాయాలను కల్పించలేకపోతోందన్నది తేలిపోయింది. ఒక వేళ ఈ డిమాండ్‌ ఉన్న స్థాయిలో రైల్వేలో సదుపాయాలను మెరుగుపరిచి ఆదాయం వచ్చేవిధంగా ఎందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించడం లేదన్న చర్చకు ఆస్కారం ఏర్పడుతోంది.

ప్రయాణీకుల సంఖ్య పెరగడం కారణంగా రైల్వేలో రిజర్వేషన్‌ సీట్లకు డిమాండ్‌ పెరుగుతోంది. ఈ విషయాన్ని ప్రైవేటు సెక్టార్‌ గమనించి ప్రైవేటు రెళ్ళను నడిపేందుకు సిద్ధపడుతోంది. కానీ ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. అంటే వామపక్షాలు, ఇతర పార్టీలు ఆరోపిస్తున్నట్లు బంగారు గుడ్లు పెట్టే బాతును ప్రైవేటు పరం చేస్తున్నట్టుగానే ప్రజలు భావించాల్సి వస్తోంది. అలాగే దేశాన్ని అద్భుతంగా ముందుకు తీసుకువెళతామని ప్రకటించుకునే ప్రభుత్వాలు ప్రజలకు అవసరమైన రైళ్ళను ప్రవేశపెట్టి, రైల్వేను నడిపించలేకపోవడం పట్ల ఆక్షేపిస్తున్నారు. అదే వరుసలో మా గొప్పగా చేస్తున్న ప్రకటనల పట్ల కూడా అనుమానంతో చూడాల్సి వస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి