iDreamPost
android-app
ios-app

పిచ్చి ప్రయోగాలన్నాం.. కానీ, ఇప్పుడు ద్రవిడ్‌ వల్లే టీమ్‌ సూపర్‌గా ఉంది!

  • Published Sep 23, 2023 | 12:03 PMUpdated Sep 23, 2023 | 12:06 PM
  • Published Sep 23, 2023 | 12:03 PMUpdated Sep 23, 2023 | 12:06 PM
పిచ్చి ప్రయోగాలన్నాం.. కానీ, ఇప్పుడు ద్రవిడ్‌ వల్లే టీమ్‌ సూపర్‌గా ఉంది!

టీమిండియా హెడ్‌ కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ను నియమించినప్పుడు భారత క్రికెట్‌ అభిమానులంతా ఎంతో హ్యాపీగా ఫీలయ్యారు. ఇలాంటి వ్యక్తిగా కదా కోచ్‌గా ఉండాల్సింది అంటూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయానికి మద్దతు పలికారు. కానీ, కొంతకాలం తర్వాత.. టీమ్‌తో అనవసరపు ప్రయోగాలు చేస్తున్నాడంటూ ద్రవిడ్‌పై ఆ అభిమానులే మండిపడ్డారు. పిచ్చి ప్రయోగాలతో జట్టును సర్వనాశనం చేస్తున్నాడంటూ విమర్శల వర్షం కురిపించారు. టీ20 వరల్డ్ కప్‌ 2021, ఆసియా కప్‌ 2022లలో టీమిండియా ఓటమికి హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ సైతం కారణమంటూ పేర్కొన్నారు.

కానీ, ఇప్పుడు అదే టీమ్‌.. ప్రపంచ క్రికెట్‌ రారాజుగా ఎదిగింది. ఒకటి కాదు, రెండు కాదు.. ఉన్న మూడు ఫార్మాట్లలోనూ టీమిండియానే నంబర్‌ వన్‌గా నిలిచింది. ఇదంతా కూడా ద్రవిడ్‌ ప్రయోగాల ఫలితమే. ప్రతిష్టాత్మక వన్డే వరల్డ్‌ కప్‌కి ముందు టీమిండియా ఇలా అరివీర భయంకరంగా తయారైందంటే.. కారణం ద్రవిడ్‌. జట్టును ఓ బలమైన శక్తిగా మార్చేందుకు, ఒకరిద్దరి మీద మాత్రమే ఆధారపడకుండా జట్టును తయారు చేశాడు. ఒక్కసారి.. ఆస్ట్రేలియాతో నిన్న జరిగిన మ్యాచ్‌ను ఉదహరణగా తీసుకుంటే.. ద్రవిడ్‌ ముందు చూపు, అతను పడిన కష్టం ఏంటో అర్థమవుతుంది.

ఆస్ట్రేలియాతో ఆడిన టీమ్‌ను ఒకసారి చూద్దాం.. శుబ్‌మన్‌ గిల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, జడేజా, అశ్విన్‌, శార్దుల్‌ ఠాకూర్‌, బుమ్రా, షమీ. ఈ టీమ్‌లో రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, హార్దిక్‌ పాండ్యా, సిరాజ్‌, కుల్దీప్‌ యాదవ్‌ ఇలా భీకర ఫామ్‌లో ఉన్న ఐదుగురు ఆటగాళ్లు లేరు. వాళ్ళు లేకపోయినా.. ఆస్ట్రేలియా లాంటి టీమ్‌పై ఆహా.. అనిపించే విజయం సాధించింది టీమిండియా. ఫామ్‌లో ఉన్న సగం టీమ్‌ లేకపోయినా.. ఆస్ట్రేలియా లాంటి టీమ్‌ను ఓడించే జట్టును తయారు చేయడం అంత సులువైన విషయం కాదు. అది ద్రవిడ్‌కు మాత్రమే సాధ్యమైంది. పైగా ఇదంతా జరుగుతోంది వరల్డ్‌ కప్‌ ముందు కావడం గమనార్హం.

ఎన్ని మ్యాచ్‌లు గెలిచినా.. వరల్డ్‌ నంబర్‌ వన్‌గా ఉన్నా.. అల్టిమేట్‌గా వరల్డ్‌ కప్‌ గెలవడమే టీమిండియా లక్ష్యం. దాని కోసమే ద్రవిడ్‌ ఇన్నాళ్లు ప్రయోగాలతో టీమ్‌ బిల్డ్‌ చేశాడు. ఓపెనర్లు మినహా.. మూడో నంబర్‌ నుంచి 8వ నంబర్‌ వరకు ఏ బ్యాటర్‌ ఎక్కడైనా ఆడేలా సిద్ధం చేశాడు. ఆసియా కప్‌లో టీమిండియా ఆడిన మ్యాచ్‌లను గమనిస్తే ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. వన్డే క్రికెట్‌లో ఆటగాళ్లు మ్యాచ్‌కు తగ్గట్లు ఆడాల్సి ఉంటుంది. టీ20 క్రికెట్‌లో వచ్చి ఓ 30, 40 పరుగులు బాదేస్తాం, టెస్టుల్లోలాగా 40, 50 బంతులాడి 10 పరుగులు చేస్తాం అంటే వన్డే క్రికెట్‌లో నడవదు. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ కొట్టాలో తెలిసుండాలి.

వన్డే క్రికెట్‌లో మిడిల్డార్‌ ఎంతో కీలకం.. అందుకే ద్రవిడ్‌ దాన్నే స్ట్రాంగ్‌ చేశాడు. పైగా ఆటగాళ్లందరికీ ఫామ్‌లోకి తెచ్చి.. జట్టు మొత్తాన్ని సెట్‌రైట్‌ చేశాడు. రోహిత్‌ శర్మ, గిల్‌, కోహ్లీ, ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌ పాండ్యా, జడేజా, సూర్యకుమార్‌ యాదవ్‌, సిరాజ్‌, షమీ, కుల్దీప్‌ యాదవ్‌, బుమ్రా.. ఇలా బెస్ట్‌ ప్లేయింగ్‌ ఎలెవన్‌ మొత్తం అద్భుతమైన ఫామ్‌లో ఉంది. ఇదే ఫామ్‌ను అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్న వరల్డ్‌ కప్‌లో కూడా చూపిస్తే.. టీమిండియాను మూడో వరల్డ్‌ కప్‌ ముద్దాడకుండా అడ్డుకునే శక్తి ఏ జట్టుకు ఉండదు. ఇలాంటి ఫామ్‌లో విదేశీ గడ్డలపైనే చెలరేగే టీమిండియా స్వదేశంలో కామ్‌గా ఉంటుంది. అసలే మనకి స్వదేశంలో పులులు అనే పేరుంది. ఇప్పుడీ పులులన్నీ వేటకు సిద్ధంగా ఉన్నాయి. మరి వరల్డ్‌ కప్‌ కోసం టీమిండియా ఇలా తయారు చేసిన భారత హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వరల్డ్ కప్ ప్రైజ్ మనీ ప్రకటించిన ICC! విజేతకు ఎన్నికోట్లంటే?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి