iDreamPost

సిక్సులతో హడలెత్తించిన హల్క్‌! కొడితే ఇలా కొట్టాలి.. సెంచరీ!

  • Published Sep 04, 2023 | 10:24 AMUpdated Sep 04, 2023 | 10:24 AM
  • Published Sep 04, 2023 | 10:24 AMUpdated Sep 04, 2023 | 10:24 AM
సిక్సులతో హడలెత్తించిన హల్క్‌! కొడితే ఇలా కొట్టాలి.. సెంచరీ!

విండీస్‌ బాహుబలి రహ్కీమ్‌ కార్న్‌వాల్‌ మరోసారి రెచ్చిపోయి ఆడాడు. అతను నిలబడి కొడితే.. ఎలా ఉంటుందో రుచిచూపించాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా.. 12 సిక్సులతో విరుచుకుపడ్డాడు. ఈ క్రికెట్‌ హల్క్‌ దెబ్బకు సెయింట్‌ బౌలర్లు హడలిపోయారు. 221 పరుగుల టార్గెట్‌ ఛేదించేందుకు బరిలోకి దిగిన తన జట్టుకు ఒంటిచేత్తో విజయాన్ని అందిస్తూ.. ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 48 బంతుల్లో 4 ఫోర్లు, 12 సిక్సులతో 102 పరుగులు చేసి సంచలన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ బాహుబలి వీరబాదుడు ముందు భారీ లక్ష్యం కూడా చిన్నబోయింది. బాల్‌ వస్తే అది బౌండరీ లైన్‌ బయటే పడాలనేంత కసితో కొట్టాడు కార్న్‌వాల్‌. కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా ఆదివారం బార్బడోస్ రాయల్స్ – సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ సునామీ ఇన్నింగ్స్‌ చోటు చేసుకుంది.

బార్బడోస్‌ రాయల్స్‌ జట్టు తరఫున ఆడున్న కార్న్‌వెల్‌ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. వచ్చిన బౌలర్‌ను వచ్చినట్టే చితక్కొట్టాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సెయింట్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 220 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఆ జట్ట ఓపెనర్‌ ఆండ్రీ ఫ్లెచర్‌ 37 బంతుల్లో 56, మరో ఓపెనర్‌ విల్‌ స్మీద్‌ 36 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సులతో 63 పరుగులు చేసి రాణించారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 115 పరుగులు జోడించడంతో ఆ జట్టుకు మంచి స్టార్ట్‌ లభించింది. అనంతరం కెప్టెన్‌ రూథర్‌ఫర్డ్‌ సైతం 27 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సులతో 65 రన్స్‌తో చెలరేగడంతో పేట్రియాట్స్‌ జట్టుకు భారీ స్కోర్‌ లభించింది. దీంతో బార్బడోస్‌ జట్టు ముందు 221 భారీ టార్గెట్‌ నిలిచింది.

కైల్‌ మేయర్స్‌తో కలిసి బార్బోడోస్‌ ఇన్నింగ్స్‌ను ఆరంభించిన కార్న్‌వెల్‌ ఆరంభం నుంచే పేట్రియాట్స్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కార్న్‌వెల్‌ కొడుతున్న సిక్సులకు ప్రత్యర్థి బౌలర్లు బిత్తరపోయారు. ఏదో సింగిల్‌ తీసినంత సులువుగా కార్న్‌వెల్‌ సిక్సుల మోతమోగించాడు. 212.50 స్ట్రైక్‌ రేట్‌తో కార్న్‌వెల్‌ సెంచరీ చేయడం విశేషం. 102 పరుగులు చేసిన తర్వాత అలసిపోయిన ఈ బాహుబలి రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. లేకుంటే మరిన్ని సిక్సులు పడేవి. కార్న్‌వెల్ వెనుదిరిగిన తర్వాత.. బార్బోడోస్‌ కెప్టెన్‌ రోవ్‌మన్‌ పావెల్‌ 26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులతో 49 పరుగులతో రెచ్చిపోయాడు. దీంతో మొత్తానికి 221 పరుగుల టార్గెట్‌ను బార్బోడోస్‌ మరో 11 బంతులు మిగిలి ఉండగానే ఛేదించడం విశేషం. 18.1 ఓవర్లలో కేవలం 2 వికెట్ల నష్టపోయి 223 పరుగులు చేసి బార్బోడోస్‌ ఘన విజయం సాధించింది. మరి ఈ మ్యాచ్లో రహ్కీమ్‌ కార్న్‌వెల్‌ సెంచరీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: VIDEO: కోహ్లీ అంటే పాకిస్థానీలకు పిచ్చి! ఇదే సాక్ష్యం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి