iDreamPost

ఫలిస్తున్న పుష్ప మార్కెటింగ్ స్కెచ్

ఫలిస్తున్న పుష్ప మార్కెటింగ్ స్కెచ్

ఏ సినిమాకైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో తీయడం ఎంత ముఖ్యమో దాన్ని ప్రమోట్ చేసుకోవడం అంతకన్నా కీలకం. ఇంగ్లీష్ లో చెప్పాలంటే మార్కెటింగ్ అనొచ్చు. మనం వాడే వస్తువులు తినే తిండి పదార్థాలు ఏవైనా సరే వాటిని ఉత్పత్తి చేస్తున్న బహుళజాతి సంస్థలు చూపించే యాడ్స్ ప్రభావం ఎంతైనా ఉంటుంది. కాకపోతే సరైన రీతిలో జనానికి అర్థమయ్యేలా చెప్పాలి. అప్పుడే అది కస్టమర్ కు రీచ్ అవుతుంది. ఇక్కడ చిన్నా పెద్ద అనే ఉండదు. బ్రాండ్ ఇమేజ్ ఉంది కదాని సోనీ, యాపిల్ లాంటి కంపెనీలు పబ్లిసిటీ చేయకుండా ఉండవు. దేని లెక్క దానిదే. ఇది అచ్చంగా సినిమాలకు కూడా వర్తిస్తుంది. ఓ ఉదాహరణ చూడండి.

అల వైకుంఠపురములో ఇండస్ట్రీ హిట్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేస్తున్న పుష్ప మీద ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో చూస్తూనే ఉన్నాం. పాన్ ఇండియా స్థాయిలో ఏకంగా అయిదు భాషల్లో దీన్ని విడుదల చేయబోతున్నారు. ఇటీవలే ఫస్ట్ ఆడియో సింగల్ దాక్కో దాక్కో మేకని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇది జరగడానికి పది రోజుల ముందు నుంచే పుష్ప టీమ్ చేసిన సోషల్ మీడియా మార్కెటింగ్ ఓ రేంజ్ ఫలితాలను ఇచ్చింది. ఒక్క తెలుగు వెర్షనే ఇప్పటికే 12 మిలియన్ల వ్యూస్ కు దగ్గరలో ఉంది. అంత హడావిడి చేసిన ఆర్ఆర్ఆర్ లో దోస్తీ తెలుగు పాట ఇప్పటిదాకా అందుకుంది 17 మిలియన్లే. ఇంకా పాతిక కూడా టచ్ కాలేదు.

పుష్ప వచ్చి రెండు రోజులు కాగా ఆర్ఆర్ఆర్ రిలీజై వారం అవుతోంది. దీన్ని బట్టి ప్రమోషన్ స్ట్రాటజీలు ఎలా సాగుతున్నాయో చెప్పొచ్చు. పోలిక ప్రకారం చూసుకున్న పుష్పలో తరహా క్యాచీ ట్యూన్ ఆర్ఆర్ఆర్ కు లేకపోవడం ఇక్కడ కొంచెం ఎఫెక్ట్ ఇచ్చింది. దానికి తోడు పుష్ప రేంజ్ లో ఆర్ఆర్ఆర్ అంత హడావిడి చేయలేకపోయిందన్నది వాస్తవం. అసలు ఏదో సినిమానే రిలీజవుతున్న రేంజ్ లో మైత్రి బృందం చేసిన హంగామా చిన్నది కాదు. ఇప్పుడే ఇలా ఉంటే ఇక టీజర్, ట్రైలర్లకు ఏ స్థాయిలో హైప్ ఉంటుందో వేరే చెప్పాలా. డిసెంబర్ చివరి వారం విడుదల ప్లాన్ చేసుకున్న పుష్ప ఇంకా డేట్ ని ప్రకటించాల్సి ఉంది

Also Read :పవర్ స్టార్ మాస్ మేనియా

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి