iDreamPost

Pushpa Hindi : బాలీవుడ్ లో తగ్గేదేలే అంటున్న ఐకాన్ స్టార్

Pushpa Hindi : బాలీవుడ్ లో తగ్గేదేలే అంటున్న ఐకాన్ స్టార్

డిసెంబర్ లో పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజమౌళి మాట్లాడుతూ ఈ సినిమా ప్రమోషన్ ని నార్త్ లో బాగా చేయమని అక్కడి ఆడియన్స్ దీని గురించి అడుగుతున్నారని నొక్కి చెప్పిన సంగతి గుర్తేగా. నిజానికి ఆ టైంలో హీరో బన్నీ, దర్శకుడు సుకుమార్ ఏమి చేయలేని పరిస్థితి. టైం లేదు. చివరి నిమిషం వరకు విపరీతమైన పని ఒత్తిడి. ఆర్ఆర్ఆర్ లాగా రాష్ట్రాలు తిరుగుతూ పబ్లిసిటీ చేసుకోలేక సైలెంట్ గా ఉండిపోయారు. తక్కువ అంచనాలతోనే హిందీ బెల్ట్ లో పరిమిత థియేటర్లలో రిలీజ్ చేశారు. ఇది చాలదన్నట్టు ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం అమెజాన్ ప్రైమ్ లో ఇరవై రోజులకే స్ట్రీమింగ్ కి రావడం ఎవరూ ఊహించని ట్విస్టు.

ఇన్ని అడ్డంకులు తట్టుకుని పుష్ప పార్ట్ 1 హిందీ వెర్షన్ ఒక్కటే వంద కోట్ల నెట్ వసూళ్లను అందుకోవడం అక్కడి ట్రేడ్ ని సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఒక మాములు కమర్షియల్ సినిమా అది కూడా తెలుగు నేటివిటీకి సంబందించినది ఈ స్థాయిలో ఆడియన్స్ కి కనెక్ట్ కావడం పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అటూఇటు రెండు నెలలుగా బాలీవుడ్ లో చెప్పుకోదగ్గ రిలీజ్ లేదు. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులకు థియేటర్ కు వెళ్ళడానికి ఒక్క చిత్రం రాలేదు. దీంతో ఎడారిలో ఒయాసిస్సులా పుష్పను ఎగబడి చూసేశారు. వారాల తరబడి ఆడేలా చేశారు. యాభై కోట్లే పెద్ద మార్కు అనుకుంటే ఏకంగా సెంచరీ కొట్టడం ఎవరి ఊహకు అందనిది.

దీనిపై తోడు సోషల్ మీడియాలో క్రికెటర్లు, సెలబ్రిటీలు పుష్ప పాటలకు కవర్ సాంగ్ వీడియోలు చేసి వాటిని పోస్ట్ చేయడం రీచ్ ని ఇంకా పెంచింది. ప్రమోషన్లో భాగంగా ఇదంతా ప్రైమ్ చేయించిందనే ప్రచారం బయటికొచ్చింది కానీ అది వాస్తవం కాదు. ఆకలి మీదున్న వాళ్లకు బిర్యానీ పెట్టినట్టుగా హిందీ పుష్పని అక్కడివాళ్లు బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకున్నారు. పార్ట్ 2 ది రూల్ కు ఒక కార్పొరేట్ సంస్థ అన్ని హక్కులకు కలిపి ఏకంగా 300 కోట్ల ఆఫర్ ఇచ్చిందనే వార్త హాట్ టాపిక్ గా మారింది. దానికి మైత్రి వాళ్ళు ఒప్పుకోలేదట కానీ పుష్ప పుణ్యమాని తెలుగు సినిమా డబ్బింగులుకు భారీ డిమాండ్ వచ్చి పడుతోందన్న మాట వాస్తవం

Also Read : February Releases : కొత్త రిలీజుల మీద డిస్ట్రిబ్యూటర్ల చూపు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి