iDreamPost

పుంగనూరు పోలీసుల దాడి కేసులో.. లొంగిపోయిన A1 నిందితుడు!

పుంగనూరు పోలీసుల దాడి కేసులో.. లొంగిపోయిన A1 నిందితుడు!

పుంగనూరులో పోలీసులపై దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏ1 ఉన్న టీడీపీ ఇన్ ఛార్జ్ చల్లాబాబు నెలరోజుల తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులపై దాడి తర్వాత చల్లాబాబు పరారీలో ఉన్నాడు. తాజాగా తానే స్వయంగా వచ్చి పోలీసులకు లొంగిపోయాడు. ఈ దాడి ఘటన ప్రణాళిక ప్రకారమే జరిగినట్లు పోలీసులు వెల్లడించిన విషయం తెలిసిందే. కావాలనే అలజడి సృష్టించాలనే అలా చేసినట్లు వెల్లడించారు.

పుంగనూరులో పోలీసులపై దాడికి సంబంధించి ఇప్పటివరకు పోలీసులు మొత్తం 110 మందిని అరెస్టు చేశారు. అంతేకాకుండా మరో 63 మంది టీడీపీ కార్యకర్తలను అరెస్టు చేసి జడ్డి ముందు హాజరు పరిచే అవకాశం కూడా ఉంది. ఆగస్టు 1న పుంగనూరులో గొడవలు సృష్టించేందుకు ముందుగానే పథకం రచించినట్లు తెలిపారు. హైవేపై చంద్రబాబు మీటింగ్ జరుగుతుండగా.. బలవంతంగా పుంగనూరు పట్టణంలోకి దూసుకెళ్లాలని వ్యూహం రచించారు. ఒకవేళ పోలీసులు వారిని అడ్డుకుంటే కర్రలు, రాళ్లు, బీరు బాటిళ్లతో దాడి చేయాలని సిద్ధమైనట్లు చెప్పారు. అంతేకాకుండా ఈ అల్లర్లకు సంబంధించి పుంగనూరు టీడీపీ ఇన్ ఛార్జ్, ఈ కేసులో ఏ1గా ఉన్న చల్లాబాబుకు ముందు స్పష్టమైన ఆదేశాలు వచ్చాయంటున్నారు. పుంగనూరులో అల్లర్ల పథకాన్ని చల్లా బాబు అనుచరులు వాగ్మూలంలో చెప్పినట్లు తెలిపారు.

పుంగనూరు దాడి ఘటనలో ప్రధాన సూత్రదారి చల్లా బాబుగా పోలీసులు తేల్చారు. ఈ కేసు మాత్రమే కాకుండా చల్లా బాబు అలియాస్ రామచంద్రారెడ్డిపై ఇంకా చాలానే కేసులు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. ఆయన నేర చరిత్ర చిట్టాను తెలియజేశారు. పుంగనూరు నియోజకవర్గం పరిధిలో పలు పోలీసు స్టేషన్లలో చల్లా బాబుపై కేసులు ఉన్నట్లు తెలిపారు. ఆలయ భూములు, ప్రభుత్వ భూముల ఆక్రమణల ఆరోపణలు కూడా ఉన్నాయి. అలాగే 1985లో రొంపిచెర్ల పోలింగ్ స్టేషన్ పై బాంబు దాడి కేసు, చౌడేపల్లి పీఎస్ లో ఐపీసీ సెక్షన్స్ 188, 341 కింద కేసు, సోమల పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నంబర్ 89-2023 కింద కేసు, కల్లూరు పోలీసు స్టేషన్ లో క్రైమ్ నంబర్ 26-2022లో ఐపీసీ సెక్షన్లు 341, 353, 143, 147, 148 కింద కేసు ఉంది. ఈ కేసులు కేవలం చల్లా బాబు క్రైమ్ హిస్టరీ కొన్ని మాత్రమే అంటూ చెబుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి