iDreamPost

అధికారుల సేవకు సలాం కొట్టాల్సిందే…

అధికారుల సేవకు సలాం కొట్టాల్సిందే…

దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత సామాన్యుల కష్టాలు పెరిగాయని, బయటకి వస్తే పోలీసులు కొడుతున్నారని చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారని సామాజిక మాధ్యమాల్లో కొన్ని వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. కానీ ఇదంతా నాణేనికి ఒకవైపు కోణం మాత్రమే. దీనికి రెండో వైపు మరో కోణం కూడా ఉంది..

సోషల్ డిస్టెన్స్ పాటించండి. గుంపులుగా ఉండకండి బయటకు రాకండి.. కరోనా వ్యాపించే ప్రమాదం ఉందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా, దేశం మొత్తం లాక్ డౌన్ విధించినా కొందరు మాత్రం ఆ నిబంధనలు పాటించకుండా కరోనాపై సరైన అవగాహన లేకుండా ఇంటిలో ఉండకుండా చిన్న చిన్న కారణాలతో రోడ్లపైకి రావడంతో వారిని కంట్రోల్ చేయడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు.

ఎమర్జెన్సీ విషయంలో మాత్రమే బయటకి రావాలని, కుటుంబంలో ఒక్కరు మాత్రమే నిత్యావసర వస్తువుల కోసం రైతు బజార్లకు రావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. కానీ చిన్న చిన్న సాకులతో ప్రజలు బయటకు రావడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో పాటుగా కరోనా అనుమానితులు పెరుగుతుండటంతో హెల్త్ వర్కర్స్& డాక్టర్లకు ఊపిరి కూడా సలపనంత శ్రమ వారిపై పడింది. దీంతో పోలీసులు, డాక్టర్లు, హెల్త్ వర్కర్స్ రేయింబవళ్లు పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అధికారులు తమ కుటుంబ సభ్యులతో గడిపేంత సమయం దొరకడం లేదు..అర్ధరాత్రో అపరాత్రో ఏదొక సమయానికి ఇంటికి చేరుకోవడం, వెంటనే డ్యూటీకి వెళ్లిపోవడం కొద్దిరోజులుగా ఇలాగే సాగుతుంది వారి జీవితం.. ప్రజారోగ్యం దృష్టిలో పెట్టుకుని తమ వ్యక్తిగత విషయాలు పక్కన పెట్టి 24 గంటలు డ్యూటీలో ఉంటున్న అధికారులు నిజంగా అభినందనీయులు. ప్రజలు కూడా ప్రభుత్వ ఆదేశాలు అనుసరించి అధికారులకి సహకరిస్తే వారికి కూడా శ్రమకు ఫలితం దక్కుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి