iDreamPost

సీఎంకు బహిరంగ క్షమాపణలు చెప్పాలి.. మాజీ ఎమ్మెల్యేకి హైకోర్టు ఆదేశం

సీఎంకు బహిరంగ క్షమాపణలు చెప్పాలి.. మాజీ ఎమ్మెల్యేకి హైకోర్టు ఆదేశం

రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటాయి. ముఖ్యంగా అధికార పక్షం, ఆ పార్టీ నేతలపై విపక్షాలు విరుచుకుపడుతుంటాయి. అయితే విమర్శలు పరిధి దాటనంత వరకు ఆరోగ్యపరమైన రాజకీయ వాతావరణం ఉంటుంది. కానీ కొంత మంది రాజకీయ నేతలు తమ స్వప్రయోజనాల కోసం.. ఇతర నేతలపై వ్యక్తిగత దూషణ, నోటికి ఇష్టమొచ్చినట్లు తిట్టడం, ఆరోపణలు గుప్పిస్తుంటారు. దీంతో ఈ మధ్య కాలంలో రాజకీయ విమర్శలు బౌండరీలను దాటేస్తున్నాయి. వీరిపై చర్యలు తీసుకోవడం అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఏకంగా ఓ సీఎంపై ఆరోపణలు చేసిన మాజీ ఎమ్మెల్యే ఒకరికి బిగ్ షాక్ ఇచ్చింది స్థానిక హైకోర్టు. ఎక్కడైతే ఆ నేతను తిట్టారో.. అక్కడే బహిరంగ సభ పెట్టి అందరి ముందు క్షమాపణలు చెప్పాలని ఆర్డరేసింది.ఇంతకు ఏ కోర్టు.. ఏ ముఖ్యమంత్రి విషయంలో ఈ తీర్పునిచ్చిందంటే..

మద్రాస్ హైకోర్టు.. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ విషయంలో ఈ ఆదేశాలిచ్చింది. గత నెల 19న కల్లాకురిచ్చిలోని మండవేలిలో అన్నాడిఎంకే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఆర్ కుమారుగురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. సీఎం స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ పై ఓ రేంజ్‌లో విరుచుకుపడిపోయారు. వీరిని ఉద్దేశించి అసభ్య పదజాలాన్ని వినియోగించారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన అధికార డీఎంకే నేతలు.. మాజీ ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసుల అరెస్టు నుండి తప్పించుకోవడానికి మాజీ ఎమ్మెల్యే హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ జీ జయచంద్రన్ నేతృత్వంలోని ధర్మాసనం.. బెయిల్ రావాలంటే.. ఓ కండిషన్ పెట్టింది.

ఏ బహిరంగ సభలో అయితే ముఖ్యమంత్రి, ఆయన కుమారుడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారో.. అదే ప్రాంతంలో వేదికను ఏర్పాటు చేసి బహిరంగ క్షమాపణలు చెప్పాలని కోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించిన నివేదికను తమకు సమర్పించాలని సూచించింది. కాగా, దీనిపై కుమారుగురు తరుఫు న్యాయవాది.. ఆయన ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా.. క్షమాపణలు చెప్పారని, అయినప్పటికీ రాజకీయ ఒత్తిళ్ల కారణంగా పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అయితే అతడి వాదనలతో ఏకీభవించని మద్రాస్ హైకోర్టు.. ఆయన క్షమాపణలు చెప్పేందుకు.. కుమారుగురుకు బహిరంగ సభ నిర్వహించేందుకు అనుమతినివ్వాలని పోలీసులను ఆదేశించింది. అలాగే తదుపరి విచారణకు నెల 11కి వాయిదా వేసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి