iDreamPost

చంద్రబాబు అరెస్ట్‌: సినిమా పరిశ్రమ స్పందిచకపోవడమే మంచిది: సురేష్‌ బాబు

  • Published Sep 19, 2023 | 2:08 PMUpdated Sep 19, 2023 | 2:08 PM
  • Published Sep 19, 2023 | 2:08 PMUpdated Sep 19, 2023 | 2:08 PM
చంద్రబాబు అరెస్ట్‌: సినిమా పరిశ్రమ స్పందిచకపోవడమే మంచిది: సురేష్‌ బాబు

ఆంధ్రప్రదేశ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో భాగాంగా ఏపీ ఏసీబీ కోర్టు.. చంద్రబాబు నాయుడికి 14 రోజుల జ్యూడీషియల్‌ రిమాండ్‌ విధించింది. అయితే చంద్రబాబు అరెస్ట్‌ మీద జనాల్లో పెద్దగా వ్యతిరేకత వ్యక్తం కావడం లేదు. కనీసం ఇన్నాళ్లకయినా బాబు చేసిన మోసాలు వెలుగులోకి రావడం మాత్రమే కాక.. శిక్ష పడుతుంది అని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ప్రజాభిప్రాయాన్ని పచ్చ నేతలు, మీడియా అంగీకరించడం లేదు. బాబు అరెస్ట్‌ను ఖండించకపోవడం దేశ ద్రోహంగా చూస్తున్నారు టీడీపీ నేతలు. ఇక చంద్రబాబు అరెస్ట్‌ అయిన నాటి నుంచి సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఎవరు స్పందించలేదు. దీనిపై కూడా టీడీపీ నేతలు, ఎల్లో మీడియా గుర్రుగా ఉంది. ఈ క్రమంలో తాజాగా ఇదే అంశంపై ప్రముఖ నిర్మాత సురేష్‌బాబుని ప్రశ్నించారు కొందరు రిపోర్టర్లు. వారికి జవాబిస్తూ.. సురేష్‌ బాబు.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

ఈ సందర్భంగా సురేష్‌బాబు స్పందిస్తూ..‘‘ప్రారంభం నుంచి కూడా మేమంతా సినిమా పరిశ్రమను రాజకీయాలకు, మతాలకతీతంగా నిర్మించుకుంటూ వచ్చాము. మేం రాజకీయ నాయకులం కాదు.. మీడియా వాళ్లము కూడా కాదు. మేం ఇక్కడకు వచ్చింది సినిమాలు తీయడానికి.. ఆ పనే చేస్తాము. నా వరకు చిత్ర పరిశ్రమ.. రాజకీయాల గురించి ప్రకటనలు చేయకపోవడమే మంచిది. పైగా ఇది చాలా సున్నితమైన అంశం’’ అన్నారు.

‘‘వ్యక్తిగతంగా మాకు ఫలనా నాయకుడు అంటే ఇష్టం ఉండవచ్చు. అయితే అది పర్సనల్‌. కానీ ఫిల్మ్‌ ప్రొడ్యుసర్‌ కౌన్సిల్‌ మెంబర్‌గా, ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుడిగా స్పందిచడం అనేది కరెక్ట్‌ కాదు. ఆంధ్రా, తెలంగాణ గొడవల సమయంలో కూడా..  పరిశ్రమ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఎందుకంటే పరిశ్రమ ఎప్పుడూ రాజకీయ ప్రకటనలకు దూరంగా వుంది. వ్యక్తిగతంగా ఎవరైనా కావాలంటే స్పందించవచ్చు. కానీ పరిశ్రమ తరఫున.. రాజకీయాల మీద స్పందించడం సరైంది కాదని నా అభిప్రాయం’’ అన్నారు. సురేష్‌ బాబు వ్యాఖ్యలతో చాలా మంది ఏకీభవిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి