iDreamPost

హాయైన వినోదాన్ని పంచిన ప్రేమకథ – Nostalgia

హాయైన వినోదాన్ని పంచిన ప్రేమకథ – Nostalgia

ప్రేమకథలు సీరియస్ గా చెప్పాలనే రూల్ ఏమి లేదు. దేవదాస్, మరో చరిత్ర, లైలా మజ్ను లాంటి అజరామర గాథలు ఎన్నో ఉండొచ్చు గాక. ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించాలంటే దానికి తగిన పాళ్ళలో వినోదం ఉంటే అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి బ్రహ్మాండమైన ఆదరణ దక్కుతుందని రుజువు చేసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. దానికో మంచి ఉదాహరణ ప్రేమంటే ఇదేరా. 1997లో ‘ప్రేమించుకుందాం రా’తో దర్శకుడిగా పరిచయమైన జయంత్ సి పరాంజీ డెబ్యూతోనే ఎంటర్ టైన్మెంట్ కం లవ్ ని మిక్స్ చేసిన తీరు అద్భుత ఫలితాన్ని ఇచ్చింది. చిరంజీవితో చేసిన రెండో చిత్రం’బావగారు బాగున్నారా’ కూడా అంతే స్థాయి రిజల్ట్ దక్కించుకుని ఆయన డిమాండ్ అమాంతం పెంచేసింది.

తనకు బ్రేక్ ఇచ్చిన వెంకటేష్ తో మరో సినిమా చేసే ప్రయత్నంలో ఉన్నారు జయంత్. కథా రచయిత దీనరాజ్ చెప్పిన ఒక లైన్ నచ్చడంతో పరుచూరి బ్రదర్స్ తో కలిసి దాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణకు వెంకీ ఒక కమిట్ మెంట్ పెండింగ్ ఉండటంతో దీన్ని ఆయనకే చేయాలని ఫిక్స్ అయ్యింది. హీరోయిన్ గా అప్పుడు ఫామ్ లో ఉన్న వాళ్ళను కాకుండా జయంత్ ప్రత్యేకంగా బాలీవుడ్ నుంచి సొట్టబుగ్గల బ్యూటీ ప్రీతీ జింటాను తీసుకురావడం అప్పట్లో హాట్ టాపిక్. సంగీత దర్శకుడిగా ఓ రేంజ్ ఫామ్ లో ఉన్న రమణ గోగుల అదిరిపోయే ఆల్బమ్ ని సిద్ధం చేశారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రాజ్ ఇచ్చారు.

స్నేహితుడి పెళ్లికి ఓ పల్లెటూరికి వెళ్లిన హీరో అతని స్నేహితులు అక్కడ చేసే అల్లరితో మొదలై, ఆ తర్వాత అది కాస్తా ప్రేమకథకు దారి తీయడం, కట్ చేస్తే స్టోరీ అక్కడి నుంచి సిటీకి వెళ్లడం, పరువుకు ప్రాణమిచ్చే హీరోయిన్ తండ్రి ఆమెకు వేరే సంబంధం ఖాయం చేయడం ఇలా రకరకాల మలుపులు తిరుగుతూ టైటిల్ తో మొదలుపెట్టి చివరి దాకా పూర్తి ఎంగేజింగ్ గా జయంత్ తీర్చిద్దిన తీరు క్లాస్ మాస్ లేకుండా అందరిని విపరీతంగా అలరించేసింది. చంద్రమోహన్ – అలీ – రమాప్రభ – సత్యనారాయణ తదితరుల కామెడీ, శ్రీహరి విలనీ బాగా పండాయి. వెంకీ యాక్టింగ్ గురించి చెప్పేదేముంది. 1998 అక్టోబర్ 30న రిలీజైన ప్రేమంటే ఇదేరా జనంతో సినిమా అంటే ఇదేరా అనిపించుకుంది. టైటిల్స్ లో వెంకటేష్ మొదలుపెట్టిన రా సెంటిమెంట్ ని మరింత బలపరిచింది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి