iDreamPost
android-app
ios-app

విషాదం: టెట్‌ పరీక్ష హాలులో గర్భిణి మృతి!

విషాదం: టెట్‌ పరీక్ష హాలులో గర్భిణి మృతి!

సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. టెట్‌ పరీక్షా కేంద్రంలో ఎనిమిది నెలల గర్భిణి మృతి చెందింది. హాలులోకి వెళ్లటానికి ఆలస్యం అవుతుందన్న కారణంతో పరుగు పెట్టడంతో బీపీ ఎక్కువై ఈ విషాదం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లాకు చెందిన రాధిక ఎనిమిది నెలల గర్భిణి. రాధిక టెట్‌ ఎగ్జామ్‌కు అప్లై చేసుకుంది. పరీక్ష కోసం బాగా ప్రీపేర్‌ అయింది. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా టెట్‌ ఎగ్జామ్‌ జరిగింది.

రాధికకు హుస్నాబాద్‌ మండలం ఇస్నాపూర్‌లో ఎగ్జామ్‌ సెంటర్‌ పడింది. ఉదయం ఎగ్జామ్‌ సెంటర్‌కు చేరుకునే సమయంలో కొంచెం లేటు అయింది. దీంతో పరుగులు పెట్టుకుంటూ ఎగ్జామ్‌ సెంటర్‌కు వెళ్లింది. ఎగ్జామ్‌ సెంటర్‌కు చేరుకున్న కొద్దిసేపటికే ఆమెకు బీపీ పెరిగింది. బీపీ కారణంగా పరీక్ష హాలులోనే కుప్పకూలింది. ఇది గమనించిన ఇన్విజిలేటర్‌ ఇతర సిబ్బంది.. ఆమె కుటుంబానికి సమాచారం ఇచ్చారు. రాధికతో పాటు పరీక్ష సెంటర్‌కు వచ్చిన భర్త అరుణ్‌ ఆమెను పటాన్‌చెరు గవర్నమెంట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

అయితే, రాధికను పరీక్షించిన వైద్యులు.. ఆమె అప్పటికే చనిపోయినట్లు తేల్చారు. రాధిక మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రాధిక ఎనిమిది నెలల గర్భిణి అయినా.. పరీక్ష కోసం రాత్రింభవళ్లు చాలా కష్ట పడిందని, పరీక్ష రాయడానికి హాలు వరకు వచ్చి.. రాయకుండానే ప్రాణాలు కోల్పోయిందని అంటూ కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి, ఈ విషాద సంఘటనపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.