iDreamPost

బెంగాల్‌ రాజకీయాల్లో కాకరేపుతున్న ప్రశాంత్‌ కిషోర్‌ సవాల్‌..!

బెంగాల్‌ రాజకీయాల్లో కాకరేపుతున్న ప్రశాంత్‌ కిషోర్‌ సవాల్‌..!

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర శాసన సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ వేడి పెరుగుతోంది. అధికారం నిలబెట్టుకునేందుకు తృణముల్‌ కాంగ్రెస్, తొలి సారి అధికారం చేజిక్కించుకునేందుకు బీజేపీ పోటా పోటీ రాజకీయాలు చేస్తున్నారు. ఇరు పార్టీల కార్యకర్తల మధ్య భౌతిక దాడులు జరుగుతుండగా.. అగ్రనేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికలకు మరో ఐదు నెలల సమయం మాత్రమే ఉండడంతో ఇరు పార్టీలు నువ్వా..? నేనా..? అన్నట్లు పోరాడుతున్నాయి.  ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై జరిగిన రాళ్ల దాడితో ఇరు పార్టీల మధ్య పోరు భీకర స్థాయికి చేరుకుంది.

జేపీ నడ్డా పర్యటన తర్వాత.. వెంటనే ఆ రాష్టంలో పర్యటించిన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా బంగారు బెంగాల్‌గా మారుస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. 200పై చిలుకు స్థానాలను బీజేపీ గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

294 సీట్లు ఉన్న బెంగాల్‌ శాసన సభలో త్వరలో తాము ఎన్ని సీట్లు గెలవబోతున్నామో అమిత్‌ షా చెప్పగా.. ఆయనకు తృణముల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ కౌంటర్‌ ఇచ్చారు. బీజేపీకి 99 సీట్లు కన్నా ఎక్కువ రావని జోస్యం చెప్పారు. అంతకు మించి వస్తే.. తాను ట్విట్టర్‌నుంచి వైదొలుగుతానని సవాల్‌ చేశారు. ఈ మేరకు ప్రశాంత్‌ కిషోర్‌ ట్వీట్‌ చేశారు.

‘‘అనుకూల మీడియాలో ఎంత ప్రసారం చేసుకున్నా.. వాస్తవంలో బీజేపీ రెండంకెలు దాటేందుకు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఈ ట్వీట్‌ సేవ్‌ చేసి పెట్టుకోండి. నేను చెప్పిన దానికన్నా బీజేపీ మెరుగైన పనితీరు కనబరిస్తే.. నేను ట్విట్టర్‌ నుంచి తప్పుకుంటా..’’నని ప్రశాంత్‌ కిషోర్‌ సవాల్‌ చేశారు.

ప్రశాంత్‌ కిషోర్‌ ట్విట్‌ బెంగాల్‌లో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. విజయవంతమైన రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్‌ కిషోర్‌కు దేశ వ్యాప్తంగా మంచి పేరు ఉంది. 2019 ఎన్నికల్లో ప్రశాంత్‌ కిషోర్‌ ఏపీలో వైసీపీకి వ్యూహకర్తగా పని చేశారు. ఈ ఎన్నికల్లో వైసీపీ 175 స్థానాలకు గాను 151 సీట్లు సొంతం చేసుకుంది. దీంతో ప్రశాంత్‌ కిషోర్‌కు ఉన్న ఫేమ్‌ ఒక్కసారిగా తారా స్థాయికి చేరుకుంది.

ప్రశాంత్‌ కిషోర్‌ సవాల్‌పై బీజేపీ కూడా వెంటనే స్పందించింది. బెంగాల్‌లో బీజేపీ సునామీ కొనసాగుతుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్‌ విజయ్‌వర్గీయ ధీమా వ్యక్తం చేశారు. బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇది జరిగిన అనంతరం దేశం ఓ వ్యూహకర్తను కోల్పోతుందని ప్రశాంత్‌ కిషోర్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

సీపీఎం కుంచుకోట అయిన బెంగాల్‌లో తొలిసారి తృణముల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) 2011లో అధికారం చేజిక్కించుకుంది. మమతా నేతృత్వంలోని తృణముల్‌ కాంగ్రెస్‌ సీపీఎం కంచుకోటను బద్ధలు కొట్టింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలసి పోటీ చేసిన తృణముల్‌ 228 సీట్లు గెలుచుకుంది. ఇందులో టీఎంసీ సొంతంగా 190 స్థానాల్లో నెగ్గింది. 2016 ఎన్నికల్లోనూ వరుసగా రెండో సారి దీదీ జయకేతనం ఎగురవేసింది. ఈ సారి గోర్ఖా జన్‌ముక్తి మోర్చా(జీజేఎం) టీఎంసీతో కలిసింది. టీఎంసీ 218 సీట్లు, జీజేఎం రెండు సీట్లు వెరసి 220 సీట్లను టీఎంసీ కూటమి గెలుచుకుంది. ఈ సారి కూడా విజయం సాధించి.. హాట్రిక్‌ కొట్టాలనే లక్ష్యంతో దీదీ పని చేస్తున్నారు.

అయితే ఆమెకు బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలు సాధించింది. ఈ విశ్వాసంతోనే బీజేపీ రాబోయే శాసన సభ ఎన్నికల్లోనూ గెలుస్తామనే ధీమాను వ్యక్తం చేస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో 42 లోక్‌ సభ స్థానాలకు గాను 2019 ఎన్నికల్లో టీఎంసీ 22 చోట్ల, బీజేపీ 18 స్థానాల్లోనూ విజయం సాధించాయి. 2014లో కేవలం రెండు సీట్లు మాత్రమే గెలిచిన బీజేపీ.. గడచిన ఎన్నికల్లో 18 చోట్ల విజయం సాధించడం ఆ పార్టీలో ఎనలేని విశ్వాసాన్ని నింపింది. ఇలాంటి సమీకరణాల నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే ఆసక్తి దేశ వ్యాప్తంగా నెలకొంది. బీజేపీ జెండా ఎగురవేస్తుందా..? లేదా..? టీఎంసీ హాట్రిక్‌ కొడుతుందా..? ప్రశాంత్‌ కిషోర్‌ వ్యూహాలు బీజేపీని అడ్డుకుంటాయా..? అనేది తేలాలంటే వచ్చే మే నెల వరకూ వేచి చూడాల్సిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి