iDreamPost

ఇళ్లపై రాజకీయం ఇంతా అంతా కాదయా….!

ఇళ్లపై రాజకీయం ఇంతా అంతా కాదయా….!

ఆత్మగౌరవానికి ప్రతీక…ఇల్లు!! తినడానికి సరైన ఆహారం లేక గంజి తాగి సొంతిట్లో ఆత్మగౌరవంతో బ్రతికే వారు కోకొల్లలు. తాజాగా ఏపీలో 26 లక్షల కుటుంబాలకు సొంతింటి కలను నిరవేర్చే దిశగా ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అడుగులేస్తున్నారు. ఈ దిశగా రాబోయే ఉగాది రోజే నిరుపేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేసేందుకు రంగం సిద్ధమైంది. అయితే విపక్షాలు, కొంత మంది హితం కోసం అహోరాత్రులు పనిచేసే మీడియా ఈ బృహత్తర కార్యక్రమంపై నానా యాగీ చేస్తున్నాయి. ఇప్పటికే ఈ వ్యవహారాన్ని కొంత మంది కోర్టులకు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏపీలో రాజకీయం అంతా ఇళ్ల చుట్టూనే తిరుగుతోంది.

నవరత్నాల్లో పేర్కొన్న ‘పేదలందరికీ ఇళ్లు’ హామీని నెరవేర్చే దిశగా ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇళ్ల స్థలాల పంపిణీకి పూనుకున్నారు. అయితే పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీని ఆహ్వానిస్తూనే…ప్రతి పక్షాలు, మీడియాలోని ఒక వర్గం జగన్‌ నిర్ణయంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. పేదల భూములు లాక్కుని పేదలకే పంచుతున్నారంటూ ప్రభుత్వ నిర్ణయాన్ని దుయ్యబడుతున్నాయి. అయితే ప్రభుత్వ మాత్రం అన్యాక్రాంతమైన అసైన్డ్‌ భూములనే తీసుకుంటున్నామని స్పష్టంచేస్తోంది.

భూమి లేని పేదలకు, స్వాంతంత్య్ర సమరయోధులకు గత ప్రభుత్వాలు భూములు కేటాయించాయి. వీటినే అసైన్డ్‌ భూములుగా పిలుస్తున్నారు. తొలి నాళ్లలో ఇచ్చిన భూమిపై సర్వ హక్కులు లబ్దిదారుడికే కేటాయించినప్పటికీ…తర్వాత దశల్లో ఇచ్చిన అసైన్డ్‌ భూమికి వారసత్వ హక్కులు మాత్రమే కల్పించారు. అయితే పేదల అశక్తతను ఆసరాగా చేసుకొని రాజకీయ నాయకులు, బడా బాబులు అసైన్డ్‌ భూములను దర్జాగా కబ్జా చేసేశారు. పశ్చిమ గోదావరిలో చింతమనేనితోపాటు పలువురు టీడీపీ నేతలను చింతలపూడి, పెదవేగి, జంగారెడ్డిగూడెం, పోలవరం ప్రాంతాల్లో పెద్ద ఎత్తున్న అసైన్డ్‌ భూములను కైవసం చేసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో మారేడుమిల్లి, రంపచోడవవరం, గోగవరం, జగ్గంపేట తదితర చోట్ల అసైన్డ్‌ భూములు తారుమారైనట్లు తెలుస్తోంది. అలాగే విశాఖపట్నంలోని భీమిలీలో భారీ భూ గోల్‌మాల్‌ జరిగింది. దీని వెనుక ఓ మాజీ మంత్రి హస్తం ఉన్నట్లు అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు కూడా వచ్చాయి. ఈ పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. అయితే ప్రభుత్వ తాజా నిర్ణయం వల్ల ఆయా భూములు తిరిగి పేదల అవసరాలకే ఉపయోగపడనున్నాయి.

అవరామతిలో ఇళ్ల స్థలాలు కేటాయింపుపై కొందరు చేస్తున్న ప్రచారంలోనూ హేతుబద్ధత కనిపించడం లేదు. రైతుల నుంచి సమీకరించిన భూమిలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొంత శాతంలో నిర్మాణాలు చేపట్టగా, విట్‌కు 200, అమృత ట్రస్టుకు 200, ఇండో–యూకే హెల్త్‌ ఇన్‌స్టిట్యూట్‌కు 150, బిలియనీర్‌ బీఆర్‌ శెట్టికి 100 ఎకరాలు కేటాయించారు. అప్పుడు అభ్యంతరాలు వ్యక్తంచేయని కొంత మంది ఇప్పుడు పేదల ఇళ్ల పంపిణీకి అభ్యంతరాలు వ్యక్తం చేయడం, నానా యాగీ చేయడం వెనుక అర్థం ఏమిటి? ఉన్నవాళ్లకు లబ్ది చేకూర్చే భూ కేటాయింపులకు అడ్డు చెప్పని వారు…పేదల ఇళ్ల స్థలాలపై గొడవ చేయడం చూస్తుంటే…ఇది పూర్తిగా ఎవరో వెనకుండి నడిపిస్తున్న తతంగంగా అనిపిస్తోంది.

ఇక ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హామీల అమలుపై వాయువేగంతో దూసుకెళ్తున్నారు. అమ్మ ఒడి, లక్ష ఉద్యోగాలు, ఇప్పుడు ఇళ్ల స్థలాలు ఏది చేసినా భారీగా చేస్తున్నారు. అయితే కొన్నిసార్లు ఉదాత్తమైన లక్ష్యంతో పనులను మొదలుపెట్టినా హడావిడిగా వాటిని అమలుచేయడం వల్ల సంపూర్ణ ఫలితాలే కాదు పేరు కూడా రాదు. ఇప్పుడు ఉగాదికి స్థలాలను పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్ణయించడంతో అధికారులు ఎంపికలో కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకోకుండా స్థలాలను ఎంపిక చేస్తున్నారు. తద్వారా కొన్ని చోట్ల పొలాలకు వెళ్లే దారులను, చెరువు ముంపు స్థలాలను కూడా ఇళ్ల పట్టాల పంపిణీకి ఎంపిక చేశారు. ఇలాంటి చర్యల ద్వారా మొత్తం కార్యక్రమానికే చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇంతటి పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పుడు డెడ్‌లైన్‌లలో అన్నీ జరిగిపోవాలనుకోకుండా నిర్ణీత కసరత్తు చేసి ముందుకెళ్లడం చేస్తే జగన్‌ ప్రభుత్వానికి మరింత మంచి పేరొచ్చేందుకు ఆస్కారం ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి