iDreamPost

బీసీలకు 34 శాతం సీట్లు ఏ విధంగా ఇవ్వబోతున్నారు..?

బీసీలకు 34 శాతం సీట్లు ఏ విధంగా ఇవ్వబోతున్నారు..?

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల రాజకీయం అంతా బీసీల చుట్టూనే తిరుగుతోంది. రాష్ట్ర జనాభాలో 50 శాతం ఉన్న బీసీలు ఏ పార్టీ వైపునకు మొగ్గు చూపితే వారిదే రాజ్యాధికారం. అందుకే అన్ని పార్టీలు బీసీ పాట పాడుతున్నాయి. స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లు కోర్టు తీర్పు వల్ల 34 శాతం నుంచి 24 శాతానికి పడిపోవడంతో రాజకీయం వేడెక్కింది. రాజకీయ పార్టీల నేతలు బీసీలే లక్ష్యంగా రాజకీయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు.

బీసీలు కోల్పోతున్న రిజర్వేషన్లను తాము పార్టీ పరంగా ఇస్తామని అధికార వైఎస్సార్‌సీపీ, ప్రతిపక్ష టీడీపీ అధినేతలు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడులు అధికారికంగా ప్రకటించారు. 34 శాతం సీట్లు వారికి ఇస్తామని స్పష్టం చేశారు. పార్టీల అధినేతల ప్రకటనలతో ప్రస్తుతానికి బీసీలు సంతోషంగానే ఉన్నారు. ప్రస్తుతం బీసీలకు 24 శాతం సీట్లు దక్కుతున్నాయి. మిగతా 10 శాతం పార్టీలు బీసీలకే కేటాయిస్తే.. ఆ సంఖ్య 34కు చేరుకుంటుంది. అయితే ఇక్కడే అనేక ప్రశ్నలు, సందేహాలు తలెత్తుతున్నాయి.

బీసీలకు పార్టీలు కేటాయించే 10 శాతం సీట్లు జనరల్‌ కోటాలో నుంచి ఇవ్వాల్సి ఉంటుంది. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మండల పరిషత్‌ అధ్యక్ష పదవులు, జిల్లా పరిషత్‌ చైర్మన్, పంచాయతీ సర్పంచ్, వార్డు మెంబర్‌.. ఇలా అన్ని స్థానాల్లోనూ బీసీలకు పార్టీలు 10 శాతం సీట్లు కేటాయిస్తాయా..? అన్నదానిపై క్లారిటీ లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో 10,047 ఎంపీటీసీ స్థానాలకు గాను 9989 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో 10 శాతం అంటే.. దాదాపు 100 జనరల్‌ స్థానాలను బీసీలకు కేటాయిచాలి. ఇక 660 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలకు జరుగుతున్నాయి. వీటిలో 10 శాతం అంటే 66 జడ్పీటీసీ సీట్లు జనరల్‌లో ఉన్న 50 శాతం సీట్లలో ఇవ్వాలి. అలాగే 660 మండల పరిషత్‌ అధ్యక్ష స్థానాల్లోనూ 66 స్థానాలు బీసీ సామాజిక వర్గాలకు ఇవ్వాలి.

13 జిల్లా పరిషత్‌ స్థానాలకు గాను ప్రస్తుతం ఒకటి ఎస్టీ, రెండు ఎస్సీ, బీసీలకు మూడు రిజర్వ్‌ చేయగా.. జనరల్‌ కోటాలో ఏడు చైర్మన్‌ పీఠాలున్నాయి. జనరల్‌లో ఉన్న ఏడులో మూడు జనరల్‌ మహిళలకు రిజర్వ్‌ చేశారు. మిగిలిన నాలుగు జనరల్‌ చైర్మన్‌ పీఠాల్లో నేతల హామీల్లో భాగంగా ఒకటి బీసీలకు కేటాయించాల్సి ఉంటుంది. అప్పుడు నేతలు చెప్పినట్లు 34 శాతం సీట్లు బీసీలకు దక్కినట్లవుతుంది.

అధికార వైఎస్సార్‌సీపీ, ప్రతిపక్ష టీడీపీ.. రెండూ 24 శాతం రిజర్వేషన్లకు అదనంగా మరో 10 శాతం సీట్లు పార్టీ పరంగా బీసీలకు ఇవ్వడం కార్యరూపం దాల్చితే.. మరో చిక్కుముడి ఎదురవుతుంది. బీసీలకు అదనంగా పార్టీ పరంగా కేటాయించే 10 జనరల్‌ స్థానాల్లో రెండు పార్టీలు బీసీ అభ్యర్థులనే నిలబెడతాయా..? లేదా..? అన్నది మరో ప్రశ్న. ఒక జనరల్‌ స్థానంలో ఇరు పార్టీలు బీసీలను పోటీకి నిలబెడితే సమస్యలేదు. కానీ ఒక పార్టీ జనరల్‌ అభ్యర్థిని, మరో పార్టీ బీసీ అభ్యర్థిని పోటీకి దింపితేనే సమస్య ఎదురవుతుంది. ఈ సమస్యకు ఇరు పార్టీలు ఏ విధంగా పరిష్కారం చూపుతాయి?. ఇరు పార్టీల అధినేతలు తమ ప్రకటనలకు కట్టుబడి ఉండి.. బీసీలకు పార్టీ తరఫున జనరల్‌ కోటాలో ఉన్న 50 శాతం సీట్లలో 10 శాతం కేటాయించి.. ఒక స్థానంలో బీసీలనే పోటీకి దింపి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవడం అనేది ఒక సవాల్‌ లాంటిదని చెప్పవచ్చు. నేతల ప్రకటనలు ఓట్ల రాజకీయంలో భాగంగా చూడాలా..? లేదా అనేది మరికొద్ది రోజుల్లో తేలుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి