iDreamPost

పోఖ్రాన్ 2 పరీక్షకు 22 ఏళ్ళు – ప్రపంచం భారత్ వైపు ఆశ్చర్యంగా చూసిన రోజు

పోఖ్రాన్ 2 పరీక్షకు 22 ఏళ్ళు  – ప్రపంచం భారత్ వైపు ఆశ్చర్యంగా చూసిన రోజు

నేడు భారత జాతీయ సాంకేతిక దినోత్సవం “1998 లో ఈ రోజున మన శాస్త్రవేత్తలు సాధించిన అసాధారణమైన విజయాన్ని మేము ఎప్పటికి మర్చిపోలేము. ఇది భారతదేశ చరిత్రలో ఒక మైలురాయి ” అని రాజస్థాన్ పోఖ్రాన్‌లో భారతదేశం చేసిన అణు పరీక్షను ప్రస్తావిస్తూ పిఎం మోడీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

ఇందిరా గాంధి ఆద్వర్యంలో “స్మైలింగ్ బుద్దా”

ఇందిరా గాంధి ప్రధానిగా ఉన్నప్పుడు భారత్ ప్రభుత్వం 1974 మే 18న అణు శక్తి ప్రయోగం జరిపినట్టు ప్రకటించారు. దేశంలో ఉన్న అణుశాస్త్రజ్ఞులు అణ్వస్త్రాల తయారీ గురించి పరిశోధన జరుపుతున్నారు అని ఇందిరా గాంధి పార్లమెంటులో ప్రకటించిన మూడున్నర సంవత్సరాలు తరువాత రాజస్థాన్ లోని ఫోక్రాన్ ప్రాంతంలో ఆపరేషన్ “స్మైలింగ్ బుద్దా” పేరున 100 మీటర్ల మించిన లోతులో ఈ అణు ప్రయోగం జరిగినట్లుగా ప్రకటించారు. అయితే ఆనాడు తాము ప్రయోగించిన అణు శక్తి అంతర్జాతీయ ఒప్పందాలకు విరుద్దం కాదని, 1963 పాక్షిక నిషేద ఒప్పందానికి మాత్రమే భారత దేశం కట్టుబడి ఉందని , ఈ ఒప్పదం ప్రకారం అణ్వస్త్రాలు వాతావరణంలో కానీ , అంతరిక్షంలో కానీ, జలాల అడుగు భాగంలో కానీ పరీక్షించకూడదని మాత్రమే ఉందని అయితే తాము ఈ ఒప్పందం నిషేదించకుండా గనుల త్రవ్వకం , మట్టి తవ్వకం, వంటి శాంతియుత ప్రయోజనాల కోసమే అణుపరీక్ష జరిపినట్టు, అయితే అణుశక్తిని, సైనికంగా వినియోగించడానికి భారత్ దేశం కూడా గట్టిగా వ్యతిరేకిస్తుందని ప్రకటించారు.

అలాగే 1968 అణ్వస్త్రాల తయారీ నిషేద ఒప్పందానికి భారత్ దేశం వ్యతిరేకించిందని, ఈ ఒప్పందం ప్రపంచాన్ని అణ్వస్త్ర దేశాలు, అణ్వస్త్ర రహిత దేశాలుగా రెండుగా విడకొట్టారని. దీంతో అణ్వస్త్ర దేశాలపై నిర్భందం విదించకుండా కేవలం అణ్వస్త్ర రహిత దేశాలపై మాత్రమే నిర్భందం విదించడాన్ని భారత దేశం పూర్తిగా వ్యతిరేకిస్తుందని చెప్పుకొచ్చారు. ఆ తరువాత అనేక ప్రతిపాదనలు ఉన్నప్పటికీ, 1998 వరకు భారతదేశం అణు పరీక్షలు చేయలేదు. 1995లో పి.వి నరసింహారావు ఈ విషయంలో అడుగు ముందుకు వేసి అణు పరీక్షకు శాస్త్రవేత్తలకు అనుమతి ఇచ్చినా , అమెరికన్ గూడాచారి వ్యవస్థ ఈ విషయం పసిగట్టి ఒత్తిడి తీసుకుని రావడంతో చివరి నిమిషంలో ఆ ప్రయత్నం విరమించుకున్నారు.

వాజ్‌పేయి ఆద్వర్యంలో “ఆపరేషన్ శక్తి”

1998 మే 11న అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు రాజస్థాన్ లోగల పోఖ్రాన్‌ ప్రాంతంలో దివంగతులు అబ్దుల్ కలాం ఆద్వర్యంలో “ఆపరేషన్ శక్తి” పేరున అణు పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు. ఈ పరీక్షలో ఏకంగా 5 బాంబులను రెండు రోజుల వ్యవదిలో పేల్చారు మొదటి మూడు పేలుళ్లు ఒకేసారి మే 11 న మధ్యాహ్నం 3.45 గంటలకు జరపగా, తరువాత మే 13 న ఒకేసారి రెండు అణు శక్తులని పేల్చారు. ఈ ప్రయోగం ద్వారా ఆనాడు భారతదేశం ఒక పెద్ద సాంకేతిక పురోగతిని సాధించింది. అణు పరికరాన్ని పరీక్షించే ఉద్దేశం భారతదేశానికి లేదని అప్పటి విదేశాంగ కార్యదర్శి కె రఘునాథ్ అమెరికా ప్రతినిధికి చెప్పిన తరువాత ఈ పరీక్ష జరపడంతో నేరుగా అగ్రరాజ్యాన్నే ఢీ కొట్టినట్టు ప్రపంచం అంతా భావించింది. దీంతో అణు ఆయుధం సమకూర్చుకున్న 6వ దేశంగా భారత్ నిలిచింది. ఈ పరిణామంతో దక్షిణ ఆసియా అణు శక్తికి ముఖ్య కేంద్రం అవుతుందని అమెరికన్లు ఆనాడు భయపడ్డారు.

ఆరోజుల్లో ఉన్న పరిస్థితుల్లో ప్రపంచ దేశాల్లో ఆటం బాంబ్ తయారీ సామర్ద్యం రష్యా, చైనా, అమెరికా, ఫ్రాన్స్ , బ్రిటన్ లాంటి దేశాలకు ఉన్న, హైడ్రోజన్ బాంబ్ తయారీ సామర్ధ్యం మాత్రం కేవలం, అమెరికా రష్యాలకు మాత్రమే ఉండేది. ఆ తరువాత భారత్ జరిపిన అణు పరిక్షలతో ఆ జాబితాలోకి భారత్ వచ్చి చేరింది. ఈ చర్యతో అణు శాస్త్ర విజ్ఞానం లో భారతీయులు ప్రపంచంలో మరెవ్వరికి తీసిపోరని, ఎవరినైనా మించిపోగల శక్తి భారత్ కి ఉందన్న గట్టి సంకేతం పంపించారు, దీంతో విశ్వంలో ఏ మూల ఏమి జరిగినా తమ గూడాచారి ఉపగ్రహాలు పసిగట్టేస్థాయి అన్న సి.ఐ.ఏ గొప్పలు కుప్పకూలాయి. ప్రపంచంలో తాము ఒక్కరమే తెలివైన వాళ్ళం అనే అహంకారం తో ఉన్న అమెరికా లోని డొల్ల తనం ప్రపంచం ముందు ఆవిష్కృతం అయింది. దీంతో ఆనాటి విజయానికి సంకేతంగా భారత్ లో ప్రతి ఏటా ఇదే రోజున భారత జాతీయ సాంకేతిక దినోత్సవం జరుపుకుంటూ దేశాన్ని ప్రపంచదేశాల ముందు గర్వంగా తలెత్తుకునేలా చేసిన శాస్త్రవేత్తలకు సెల్యుట్ చేయడం అనావతీగా వస్తుంది. మేరా భారత్ మహాన్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి