iDreamPost

జగన్‌.. సామాజిక న్యాయ పరిరక్షకుడు : తమిళనాడు పార్టీ

జగన్‌.. సామాజిక న్యాయ పరిరక్షకుడు : తమిళనాడు పార్టీ

ఆంధ్రప్రదేశ్‌ యువ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పరిపాలన విధానం, ప్రజలకు మంచి చేసే నిర్ణయాలు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వైఎస్‌ జగన్‌ తీసుకున్న పలు నిర్ణయాలను దేశంలోని వివిధ పార్టీల నేతలు అభినందించారు. సచివాలయ వ్యవస్థను కొనియాడిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. అన్ని రాష్ట్రాలు ఈ వ్యవస్థను అమలు చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. సీనియర్‌ ముఖ్యమంత్రులు సైతం వైఎస్‌ జగన్‌ పరిపాలనా దక్షతను కొనియాడారు.

తాజాగా సీఎం వైఎస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయం తమిళనాడు పార్టీలను సైతం ఆకర్షించింది. 139 బీసీ కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పాలకమండళ్ల ఏర్పాటులోనూ అన్ని సామాజికవర్గాల వారికి ప్రాధాన్యం కల్పించారు. మొత్తం 729 ప్రభుత్వ నామినేటెడ్‌ పోస్టుల్లో అన్ని బీసీ కూలాల వారిని నియమించారు. ఇందులో 50 శాతం పదవులను మహిళలకు కేటాయించారు. ఈ చర్యపై తమిళనాడుకు చెందినపట్టలి మక్కల్‌ కచ్చి (పీఎంకే )పార్టీ సీఎం వైఎస్‌ జగన్‌పై ప్రశంసల జల్లు కురిపించింది.

ఏపీలో 56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేయడంపై పీఎంకే అధ్యక్షుడు ఎస్‌.రాంధాస్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని అభినందిస్తూ లేఖ రాశారు. కార్పొరేషన్ల ఏర్పాటు చేయడం ద్వారా సీఎం వైఎస్‌ జగన్‌.. సామాజిక న్యాయ పరిరక్షకుడుగా మారారని తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామికి రాసిన లేఖలో కొనియాడారు. బీసీల ఉన్నతికి ఏర్పాటు చేసిన 56 కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవుల్లో 29 మహిళలకు కేటాయించడం అభినందనీయమని ప్రశంసించారు.

బీసీ కార్పొరేషన్ల ఏర్పాటు, పాలక మండళ్ల నియామకంపై చౌకబారు విమర్శలు చేసిన టీడీపీ నేతలకు తమిళనాడుకు చెందిన పీఎంకే పార్టీ అధ్యక్షుడు రాసిన లేఖ చెంపపెట్టుగా మారిందనడంలో సందేహం లేదు. బీసీల అభ్యున్నతికి ఏర్పాటు చేసిన కార్పొరేషన్లపై టీడీపీకి చెందిన బీసీ నేతలే చులకన భావంతో విమర్శలు చేయడం రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఇప్పుడు ఇరత రాష్ట్రాల పార్టీలూ సీఎం జగన్‌ నిర్ణయాన్ని కొనియాడడంతో టీడీపీ నేతల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లైంది. ఏదైనా పథకం ప్రవేశపెట్టినా, విధానపరమైన నిర్ణయం తీసుకున్నా.. వెంటనే మైకు పుచ్చుకుని విమర్శలు చేసే టీడీపీ నేతలు ఇకపై ఆచితూచి స్పందిస్తారా..? లేదా..? యథాప్రకారం నడుచుకుంటారా..? వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి