iDreamPost

పిఠాపురం సూరిబాబు టీ

పిఠాపురం సూరిబాబు టీ

తూర్పు గోదావరి జిల్లా.. ఈ ప్రాంతం చక్కటి రుచులకుపెట్టింది పేరు.. జిల్లాలోని కాకినాడ సుబ్బయ్య హోటల్, తాపేశ్వరం కాజా, ఆత్రేయపురం పూతరేకులు, అంబాజీపేట పొట్టిక్కలు ఎంత ప్రసిద్ధిగాంచాయి.. ఇవన్నీ జిల్లాలో ఎంత ఫేమస్సో.. పిఠాపురం సూరిబాబు టీ కూడా అంతే ఫేమస్.. ఫేమస్ కాదు.. ఇదొక బ్రాండ్ కూడా.. సోషల్ మీడియాలోనూ సూరిబాబు టీకి ఎంతో పబ్లిసిటీ ఉంది. తూర్పు గోదావరి జిల్లాలో సూరిబాబు కోసం అసలు పరిచయం కూడా చేయనక్కర్లేదు. ఎవ్వరైనా పిఠాపురం కోటగుమ్మం సెంటర్ కు వెళ్తే కచ్చితంగా సూరిబాబు టీ తాగాల్సిందే.. సూరిబాబు టీ తాగాలని ఆరాటపడే వాళ్లెందరో ఉన్నారు. సూరిబాబు టీ అభిమానుల జాబితాలో పాతకాలం సినీ డైరక్టర్లు, నటులు, రాజకీయ నాయకులు, న్యాయవాదులు, ప్రముఖ వ్యాపారవేత్తలెందరో ఉన్నారు.

సూరిబాబు చేతితో పెట్టే స్ట్రాంగ్ టీకోసం ఆయన పాక వద్ద పడిగాపులు పడతారు. దాదాపుగా నలభై ఏళ్ళ క్రితం ఈయన పది పైసలకు టీ అమ్మకం ప్రారంభించారు. ఇప్పుడు సూరిబాబు చాయ్ ధర ఏడు రూపాయలకు చేరింది. నాలుగు దశాబ్ధాలు గడిచినా సూరిబాబు టీకి ఉన్న డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. చాలా సంవత్సరాలుగా ఇక్కడ టీ తాగుతున్న వాళ్ళను పిలిచి సూరిబాబు టీ స్పెషాలిటీ ఏంటని అడిగితే.. ఏమో.. ఆయన చేతి టీ అలవాటు అయిపొయింది.. త్రాగకపోతే ఉండలేమని అక్కడి స్థానికులు చెప్తుంటారు. యాభై ఐదేళ్ల వయసున్న వియ్యపు సూరిబాబు జీవితంలో మూడొంతులు టీబల్ల వద్దే గడిచిపోయాయి. గంటల తరబడి టీ పొయ్యి ముందు నిలబడి ఉంటారు. ఆలస్యమవుతుందని కస్టమర్లు విసుక్కున్నా ఓపికగా సమాధానం చెప్పి.. వాళ్లకు టీఇచ్చి వాళ్లను మెప్పించి పంపిస్తారు.

సూరిబాబు టీ ప్రత్యేకతలు ఇవే..

40ఏళ్లనుండీ ఇప్పటివరకూ ఆయన టీపొడి బ్రాండ్ ఒక్కటే
డికాషన్ ను బొగ్గుల పొయ్యి పైనే కాస్తుంటారు.
పాలను మాత్రం కిరోసిన్ పొయ్యి మీద వేడి చేస్తారు
పాలను ఇత్తడి మగ్ లోనే కాస్తుంటారు..
టీని గుడ్డ సంచిలోనే వడపోస్తుంటారు..
చిక్కటి నాణ్యమైన కల్తీలేని పాలను వాడుతున్నారు. ఉదయం 4గంటలనుండి రాత్రి 11గంటలవరకు సూరిబాబు పొయ్యి వద్దే నిలబడి ఉంటారు.

అయితే అదే పొయ్యిపై సూరిబాబు కొడుకులు గానీ, ఆయన సోదరులు గాని టీ కాచినా సూరిబాబు రుచి మాత్రం రాదు. సూరిబాబు పొయ్యి దగ్గర లేకపోతే టీ తాగకుండా వెనక్కి వెళ్లిపోయేవాళ్లు చాలామంది ఉన్నారు. ‘సూరిబాబు చేతిలోనే టేస్ట్ మహత్యం” ఉందని చెప్పుకుంటున్నారు. తాగుతున్నంతసేపు చక్కటి వాసన, చిక్కగా, కమ్మని రుచితో సూరిబాబు టీ ఉంటుంది. సూరిబాబు వద్ద టీ ఒక్కటే కాదు.. కాఫీ, హార్లిక్స్, బూస్ట్ లకు కూడా అంతే డిమాండ్. కాఫీ పది రూపాయలు, బూస్ట్ పదిహేను రూపాయలు తీసుకుంటారు. క్వాలిటీనే సూరిబాబు పెట్టుబడి.. ఓర్పు, చక్కటి మాట తీరు, శుచి, శుభ్రతే, కల్తీ లేకపోవడమే ఆయన ఇన్నేళ్ల వ్యాపార రహస్యం. ఎన్నో ఏళ్లనుండి టీకోసం వస్తున్న వాళ్ళనైనా లేదా కొత్త వాళ్లనైనా తనకు దేవుళ్లలానే సూరిబాబు భావిస్తారు. ఇవే ఆయన విజయ రహస్యాలు.. నోరు మంచిదైతేనే కాదు, చెయ్యి మంచిదైనా కూడా ఊరు మంచిదవుతుంది.. అలాగే వ్యాపారం మంచిగా ఉంటుంది అనడానికి సూరిబాబే చక్కటి ఉదాహరణ.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి