iDreamPost

ఈ నిర్లక్ష్యం ఏ మూల్యానికో..?

ఈ నిర్లక్ష్యం ఏ మూల్యానికో..?

ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్‌ 19 పాజిటివ్‌ కేసులు 10వేల మార్కును దాటేసాయి. ఇతర రాష్ట్రాలకంటే వ్యాప్తి శాతంలో తక్కువగా ఉన్నప్పటికీ ఈ అంకెలు నిపుణులను ఆందోళన పరుస్తున్నాయనే చెప్పాలి. అధికార యంత్రాంగం శతవిధాలా ప్రయత్నిస్తూ వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు కృషి చేస్తోంది. దేశం మొత్తంమీదు అత్యధిక వైద్య పరీక్షలు చేస్తూ వైరస్‌ వ్యాప్తిని కనిపెట్టి, చికిత్స చేసేందుకు సీయం వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో అధికార యంత్రాంగా చర్యలు చేపడుతోంది.

అయితే ఇక్కడ వైరస్‌ వ్యాప్తిని నిరోధించడంలో అత్యంత కీలకమైన ప్రజల నుంచి మాత్రం తగినంత శ్రద్ద కానరావడం లేదన్నది ఒప్పుకోక తప్పని వాస్తవం. వైద్య ఆరోగ్యశాఖ, పోలీసు, వాలంటీర్లు, పంచాయతీ రాజ్, రెవిన్యూ శాఖల సిబ్బంది సంయుక్తంగా తమతమ విధులను ప్రాణాలకు తెగించే నిర్వహిస్తున్నారు. లాక్డౌన్‌లో జనమంతా భయపడి ఇళ్ళలో ఉంటే వాళ్ళే ప్రాణాలొడ్డి రోడ్లపై నిలబడ్డారు. వారి త్యాగాన్ని మెచ్చుకుంటూ సోషల్‌ మీడియాలో మెస్సేజ్‌లు అయితే పెట్టారుగానీ, వారి త్యాగానికి తగ్గ విలువను మాత్రం ఇవ్వడం లేదు. వాళ్ళంత కష్టపడి నియంత్రించిన కరోనాను లాక్డౌన్‌ ఎత్తివేత పుణ్యమాని ఇప్పుడు ఉధృతం అయ్యేందుకు ప్రజలే కారణమవుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కనీస బాధ్యత లేకుండా విచ్చలవిడి గుమిగూడుతున్నవారిని చూస్తే ఈ అభిప్రాయం నిజమేని తోస్తుంది.

పెళ్ళికెళితే వైరస్‌సోకింది, పార్టీ చేసుకుంటే వచ్చింది, అష్టాచెమ్మాలాడినా వ్యాపించింది, ఆఖరికి పరామర్శకు వెళ్ళినా వైరస్‌ భారిన పడ్డారు. ఇటువంటి వార్తలన్నింటినీ నిత్యం టీవీలు, పేపర్లు, సోషల్‌ మీడియా ద్వారా తెలుసుకుంటూనే ఉన్నారు. కానీ వ్యక్తిగతంగా పాటించాల్సిన జాగ్రత్తలను మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే వైద్య పరీక్షలు చేయడానికి వచ్చినవారిపై తిరగబడ్డ సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ స్థాయి నిర్లక్ష్యం ఏ మూల్యం చెల్లించడానికో అన్న ప్రశ్న ఇక్కడే ఎదురవుతోంది. 20 మందితో పెళ్ళి చేసుకునేందుకు అనుమతి తీసుకుని 200 మందికి భోజన ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయంటే ఏ స్థాయి నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.

నాన్‌వెజ్‌మార్కెట్‌లు, హోటల్స్, టీ స్టాల్స్, చిల్లర దుకాణాల వద్ద ఏ మాత్రం భౌతిక దూరం పాటించడం లేదు. లాక్డౌన్‌ సమయంలో కనీసం పోలీస్‌లు వస్తారన్న ఆందోళనైనా సదరు దుకాణ యజమానులు, కొనుగోలుదారుల్లో కన్పించేది. ఇప్పుడా పరిస్థితి కూడా ఉండడం లేదు. ఈ తోపులాటలోకి వెళ్ళలేని వాళ్ళు భౌతికదూరం పాటించండయ్యా అంటూ చెప్పబోతే.. వారితో వాగ్వాదాలకు దిగుతున్న ప్రబుద్దులు కూడా లేకపోలేదు. ప్రమాదం వస్తే ప్రభుత్వం, యంత్రాంగాల వైపు సాయం కోసం చూస్తున్నప్పుడు, వారు చెప్పే జాగ్రత్తలు ఎందుకు పాటించడం లేదన్నది ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు వాళ్ళు నేర్చుకునే అవకాశం లేనప్పుడు దండించైనా నేర్పించాల్సిన బాధ్యతను ప్రభుత్వాలు చేపట్టకమానవు.

అయితే అంతదాకా తెచ్చుకోవడమెందుకు అనుకుంటే తప్పని సరిగా అధికార యంత్రాంగం సూచనలు పాటించాల్సిందే. చేతులను శుభ్రం చేసుకోవడం, ముఖ్యానికి మాస్కు వేసుకోవడం, భౌతిక దూరం పాటించడం, ఏ మాత్రం అనారోగ్య లక్షణాలు ఉన్నా సమీపంలోని వైద్యులను సంప్రదించడం అనేవి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికి వారు ఖచ్చితంగా అనుసరించాలి. లేకపోతే తమ నిర్లక్ష్యం బైటవారి కంటే వారివారి కుటుంబ సభ్యులకే ఎక్కువ ప్రమాదమని గుర్తించుకోవాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి