iDreamPost

వారి పెళ్లితో ప్రజలకు ఊరట

వారి పెళ్లితో ప్రజలకు ఊరట

పదిహేను రోజులుగా ఏ న్యూస్‌ ఛానెల్‌ను చూసినా కరోనా వైరస్‌కు సంబంధించిన వార్తలే. అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ న్యూస్‌ ఛానెళ్లు అన్నింటిలోనూ కరోనాపై చర్చలు, సూచనలు, ప్రజల బాధలు, మరణాల వార్తలే. ఈ వార్తలు చూస్తున్న ప్రజల్లో ఏదో తెలియని భయం, ఆందోళన నెలకొన్నాయి. వైరస్‌ కన్నా భయం చాలా ప్రమాదంగా మారింది. అయితే ఈ భయాల నుంచి న్యూస్‌ ఛానెళ్లు, ప్రజలు రాములోరి పెళ్లి వల్ల కొద్దీగా ఊరట పొందారు.

ఈ రోజు శ్రీరామనవమి. సీతారాముల కళ్యాణ మహోత్సవం. భద్రాదిలో రాములోరి పెళ్లి పురోహితుల సమక్షంలో జరుగుతోంది. ప్రజలు తమ ఇళ్ల నుంచే న్యూస్‌ ఛానెళ్ల ద్వారా కళ్యాణాన్ని వీక్షిస్తున్నారు. నిన్న రాత్రి వరకూ అక్కడ అన్ని కేసులు, ఇక్కడ ఇంత మంది చనిపోయారు, ప్రధాని సమీక్ష, సీఎం అత్యవసర సమావేశం.. వంటి ఆందోళన కలగించే వార్తలు ప్రసారం కాగా.. ఈ రోజు ఉదయం నుంచే రాములోరి కళ్యాణ మహోత్సవం అన్ని న్యూస్‌ ఛానెళ్లలో ప్రత్యక్ష ప్రసారమవుతోంది. బ్యాక్‌గ్రౌండ్‌లో.. సీతారాముల కళ్యాణం చూతము రారండి.. పాటలు ప్రతి ఇళ్లలో వినిపిస్తున్నాయి.

ప్రతి సంవత్సరం గ్రామాల్లో అంగరంగ వైభవంగా సాగే సీతారాముల కళ్యాణం ఈ ఏడాది కరోనా వైరస్‌ కారణంగా ఆ ఊసే వినపడడంలేదు. లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలు తమ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇళ్లలోనే పూజలు చేసుకుంటున్నారు. కరోనా పోవాలని.. సుభిక్షమైన జీవితం మళ్లీ ప్రసాదించాలంటూ ప్రజలు సీతారాములను వేడుకుంటున్నారు. పరిస్థితులు సద్దుమణిగాక మంచి ముహూర్తం చూసి తమ గ్రామాల్లో సీతారాముల కళ్యాణం జరిపించాలని ప్రజలు నిర్ణయించుకుంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి