iDreamPost

Peddhanna : పెద్ద‌న్న సుత్త‌న్న‌

Peddhanna : పెద్ద‌న్న సుత్త‌న్న‌

పండ‌గ పూట ఈ మ‌ధ్య నాకు రాహుకాలం వెంటాడుతోంది. ద‌స‌రాకి టైం బాగ‌లేక ఎల్జిబుల్ బ్యాచిల‌ర్ చూశాను. అఖిల్ ఉతికినా, ఏదో ఏరియ‌ల్ పౌడ‌ర్‌తో సుకుమారంగా వాషింగ్ మిష‌న్‌లో కాసేపు తిప్పాడు. దీపావ‌ళి నాడు లోప‌ల ఏదో అనుమానం పీకుతా వుంది. ర‌జ‌నీకాంత్ రాడ్ ప‌ట్టుకుని నిల‌బ‌డ్డాడు. అయినా మ‌న ర‌జ‌నీ క‌దా అని ధైర్యం చేశాను. పాత‌కాలం హీరో క‌దా, కొంచెం మోటు ప‌ద్ధ‌తి. మ‌ట్టిబాన‌లో చ‌వుడు వేసి ఉడికించి బ‌య‌టికి తీసి బండ‌కి ద‌బ‌ద‌బ‌ బాదాడు. ఇదేం ఉతుకుడు బాబోయ్ అని కెవ్వున అరిస్తే గ‌ట్టిగా పిండి, మ‌ళ్లీ ఉతికి ఎండ‌బెట్టాడు.

పెద్ద‌న్న Open కాగానే ర‌జ‌నీ కొంద‌రిని చావ‌బాదుతాడు. అప్పుడే మ‌న‌కి అనుమానం వ‌స్తుంది. Next గాల్లోకి ఎగిరేది ప్రేక్ష‌కులే అని , అదే నిజం. క‌ల‌క‌త్తాలో ర‌క్తం కారుతున్న కొడ‌వ‌లితో ప్లాష్ బ్యాక్ ప్రారంభిస్తాడు. రాజోలులో పంచాయ‌తీ స‌ర్పంచ్ హీరో, అత‌ని అనుచ‌రుడు సూరీ. 1980 నాటి కామెడీతో క‌థ ఆరంభం. న‌ర‌సింహ కాలం నాటి డైలాగ్‌లు. ప్ర‌కాశ్‌రాజ్‌తో హీరోకి చిన్న గొడ‌వ‌. ఈ లోగా ర‌జ‌నీ చెల్లి కీర్తి సురేష్ రైలు దిగుతుంది. అన్న‌కి చెల్లి అంటే ప్రాణం. అదే మ‌న‌కి శాపం. ఫ‌స్టాప్‌లో మ‌నం కాసేపు నిద్ర‌పోయి లేచినా క‌థ‌లో ఏమీ మార్పు వుండ‌దు. అన్న‌య్యా అని చెల్లి, క‌న‌కం అని అన్న‌య్య అంటూ వుంటారు. కీర్తి సురేష్‌కి న‌టించ‌డానికి ఏమీ లేదు. క‌ళ్ల నీళ్ల‌తో విచిత్రమైన ఎక్స్‌ప్రెష‌న్‌తో స్ర్కీన్ అంతా క‌నిపిస్తూ వుంటుంది. త‌మిళ‌నాడులో నీటి క‌ర‌వు అనే మాట అబ‌ద్ధం. కీర్తి క‌నీసం రెండు బిందెల క‌న్నీళ్లైనా కారుస్తుంది. భ‌య‌భ్రాంతులైన చాలా మంది ప్రేక్ష‌కులు జారిప‌డ్డారు కూడా.

అన్నాచెల్లెళ్ల టీవీ సీరియ‌ళ్ల నుంచి క‌థ‌ని ముందుకు నెట్ట‌డానికి ఒక కారులో నుంచి ఖుష్బూ , ఇంకో కారులోంచి మీనా దిగుతారు. వాళ్లు ఒక‌ప్ప‌టి హీరో మ‌ర‌ద‌ళ్లు. ర‌జ‌నీతో మోటు స‌ర‌సం చేస్తూ ప్రేక్ష‌కుల్ని చెవులు మూసి చావ‌గొట్టే ప్ర‌య‌త్నం చేస్తారు. ఈ మ‌ధ్య‌లో హీరోయిన్ న‌య‌న‌తార కాసేపు లాయ‌ర్‌గా క‌నిపిస్తుంది.

ఊళ్లో జాత‌ర జ‌రుగుతున్న‌పుడు ప్ర‌కాశ్‌రాజ్‌తో మ‌ళ్లీ గొడ‌వ‌. కొట్ట‌డంలో కూడా ఏదో ఉదాత్త‌త క‌న‌బ‌రిచి ప్ర‌కాశ్‌రాజ్ మ‌న‌సుని హీరో మారుస్తాడు. దాంతో త‌న త‌మ్మునికి కీర్తిసురేష్‌ని చేసుకుంటాన‌ని ప్ర‌కాశ్‌రాజ్ అంటాడు. ఎన్ని కోట్లు ఆస్తి ఉన్నా జ‌బ్బు చేస్తే వెళ్లాల్సింది డాక్ట‌ర్ ద‌గ్గ‌రికే కాబట్టి, త‌న చెల్లెలిని ప్రకాశ్‌రాజ్ త‌మ్ముడికి (అత‌ను డాక్ట‌ర్‌) ఇస్తానంటాడు ర‌జ‌నీ. ఇదేం లాజిక్కో. (ఎన్ని కోట్లు డ‌బ్బున్నా తినాల్సింది అన్న‌మే కాబ‌ట్టి రైతుకి ఇస్తాన‌ని మ‌న సినిమాల్లో ఎప్ప‌టికీ అన‌రు)

పెళ్లికి ఏర్పాట్లు జ‌రుగుతుండ‌గా కీర్తి సురేష్ మాయం. ర‌జ‌నీకి గాయం. ప్రేమించిన వాడితో క‌ల‌క‌త్తాలో కీర్తి కాపురం.

చెల్లి మ‌న‌సు తెలుసుకోలేక పోయాన‌నే సెంటిమెంట్‌తో హీరో క‌ల‌క‌త్తా వెళ్తాడు. చెల్లి క‌ష్టాల్లో వుంది. తాను ఇలా ఉన్న విష‌యం అన్న‌కి తెలియ‌కూడ‌దు. అందుకే ఆమెకి తెలియ‌కుండా హీరో ఆమెని కాపాడుతాడు. ఇది సెకెండాఫ్‌.

ర‌జ‌నీ ఎంత సూప‌ర్‌స్టార్ అయినా ఇలాంటి క‌థ‌లు ఇప్పుడు వ‌ర్కౌట్ కావు. చ‌ద్ద‌న్నం లోకి పులిసిపోయిన పెరుగు పోసి నాలుగేళ్ల క్రితం పెట్టిన ఊర‌గాయ‌తో నీళ్ల‌లో నానిన అప్ప‌డాలు నంజుకుంటూ తింటే ఎంత పాత‌గా వుంటుందో అంత పాత క‌థ ఇది. క‌నీసం ట్రీట్‌మెంట్ కొత్త‌గా రాసుకుంటారా అంటే ర‌జ‌నీ పాత రీళ్ల‌న్నీ తెచ్చి మ‌ళ్లీ చూపించిన‌ట్టుంది.

సెకెండాఫ్‌లో అభిమ‌న్యుసింగ్ విల‌న్‌. వాడిని , వాడి అనుచ‌రుల‌ని హీరో ఎలాగూ చిత‌క‌బాదుతాడు, సినిమా అయిపోతుంద‌ని ఆశ ప‌డితే మ‌న‌కు నిరాశే. అత‌నికో అన్న జ‌గ‌ప‌తిబాబు. అర‌వింద‌స‌మేత జ‌గ‌ప‌తిబాబుకి Next level. మాంసం ముక్క‌ల్ని న‌ములుతూ కొడ‌వ‌లి ప‌ట్టుకుని పెద్ద మీసాల‌తో… సింపుల్‌గా చెప్పాలంటే పిల్ల‌ల‌కి డైప‌ర్లు వేయ‌కుండా తీసుకెళితే జ‌గ‌ప‌తిబాబుని చూస్తే ఆ అరుపుల‌కి సీట్‌లోనే ఒక‌టి రెండు చేసేస్తారు. సినిమాలో వున్న వ‌య‌లెన్స్‌కి ఇది అద‌నం.

ర‌జ‌నీని చూస్తే జాలేస్తుంది. ఫ‌స్ట్ డే టికెట్ల కోసం ఒక‌ప్పుడు కొట్టుకున్న‌ది ఇత‌ని కోస‌మేనా? ఇనార్బిట్‌మాల్‌లో ఫ‌స్ట్ డే స‌గం థియేట‌ర్ ఖాళీనా! సినిమా అంతా ర‌జ‌నీనే మోసాడు నిజానికి. కొన్ని సీన్స్‌లో ఎమోష‌న్స్ పండాయి. మాన‌వాతీత శ‌క్తితో విల‌న్ల‌ని చావ‌బాదిన ర‌జ‌నీని ఇక చూడ‌లేరు. ఆయ‌నే త‌న‌ని స్ర్కీన్ మీద చూసి తానే భ‌య‌ప‌డే స్థితి రాకూడ‌దు.

ర‌జ‌నీ సార్ , మీ సినిమాల‌కి Exit గేట్‌లో తొక్కిస‌లాట జ‌రిగే రోజుల్ని కొని తెచ్చుకోకండి. మీ పేరు ముంద‌రి సూప‌ర్‌స్టార్ బిరుదుని కాలితో త‌న్నేయండి. మీలో అద్భుత న‌టుడున్నాడు. అత‌న్ని మా ముందు నిల‌బెట్టండి. ఇనుప రాడ్ల‌తో చావ‌బాదే ర‌జ‌నీని పాత ట్రంక్ పెట్టెలో పెట్టి తాళం వేయండి. అదో జ్ఞాప‌కం.

సినిమాల్లో ఫిలాస‌పీ చెప్ప‌డం కాదు, ప‌రుగు ఎక్క‌డ ఆపాలో తెలుసుకోండి.
మిమ్మ‌ల్ని సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌తో చూసిన మాలాంటి వాళ్ల తో ఇలాంటి స‌మీక్ష‌లు రాసే దుస్థితి క‌ల్పించ‌కండి.

Also Read : Peddhanna Review : పెద్దన్న రివ్యూ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి