iDreamPost

పవన్‌ ముందు కొత్త సవాళ్లు.. ఏం సమాధానం చెప్పాలో తెలియక

పవన్‌ ముందు కొత్త సవాళ్లు.. ఏం సమాధానం చెప్పాలో తెలియక

పవన్‌ కళ్యాణ్‌ రాజకీయ సిద్ధాంతాల్లో ప్రధానమైనది అవినీతిపై రాజీలేని పోరాటం. అదే ధ్యేయంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఎక్కడ అవినీతి జరిగినా ప్రశ్నిస్తాను.. అవినీతి అంతమే తన ధ్యేయమని చెప్పారు. మరి తీరా రాజకీయాల్లోకి వచ్చాక.. ఆయన అనుకున్న మార్గంలోనే వెళ్తున్నారా.. చెప్పినట్లుగానే అవినీతిపై పోరాటం చేస్తున్నారా.. అంటే.. ఆయన పార్టీ నేతలే సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. అవినీతిని అంతం చేస్తాను, పోరాటం చేస్తాను అని ప్రకటించిన పవన్‌ కళ్యాణ్‌.. మరి ఇప్పుడు చేస్తున్న పని ఏంటి.. అసలు ఆయన చర్యలను ఎలా సమర్థించాలో పార్టీ నేతలకు, కార్యకర్తలకే అర్థం కాక తలలు పట్టుకుంటున్నారట. అసలు టీడీపీతో పొత్తును ఎలా సమర్థించుకోవాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నారంట జనసేన కేడర్‌.

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో అరెస్ట్‌ అయ్యి జైలుకు వెళ్లారు. పక్కా ఆధారాలతో సీఐడీ ఆయన మీద కేసులు నమోదు చేసింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ పేరటి బాబు భారీ స్కామ్‌ చేశారని.. కళ్ల ముందు క్లియర్‌గా కనిపిస్తున్నప్పటికి.. పవన్‌ కళ్యాణ్‌ మాత్రం అవేం పట్టించుకోకుండా.. చంద్రబాబు అరెస్ట్‌ అక్రమం అంటూ ఆయనకు మద్దతు పలికారు. చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా పవన్‌తో పాటు జనసేన కార్యకర్తలు సైతం రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలిపారు.

చంద్రబాబును రిమాండ్‌కు తరలించిన వెంటనే పవన్‌ కళ్యాణ్‌ హాడావుడిగా జైలుకి వెళ్లి.. చంద్రబాబును పరామర్శించి.. తదుపరి రాజకీయ చర్చలు జరిపి పొత్తుపై ప్రకటన కూడా చేశారు. ఇక పవన్‌ ప్రకటన ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అయితే దీనిపై అప్పటికే జనసేన నేతల్లో తీవ్ర అసంతృప్తి ఉందని.. అవినీతి కేసులో జైలుకి వెళ్లిన వ్యక్తి కోసం తాము నిరసనలు చేయడం ఏంటి అనే ప్రశ్నలు తలత్తాయని వార్తలు కూడా వచ్చాయి.

టీడీపీతో పొత్తు ప్రకటన బెడిసి కొట్టిందా..

ఇక ఇప్పుడు ఏకంగా పవన్‌ టీడీపీతో పొత్తు అని ప్రకటించడం జనసేన కేడర్‌ని మరింత ఆశ్చర్యానికి గురి చేసింది. పవన్‌ ప్రకటన మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం అ‍య్యింది. పవన్‌ సైకిల్‌ ఎక్కితే.. తాము మద్దతివ్వమని కాపు నేతలు, అభిమానులు బహిరంగంగానే విమర్శలు చేశారు. దాంతో పవన్‌ కాస్త వెనక్కి తగ్గారు. ఆ తర్వాత 15 రోజుల పాటు.. చంద్రబాబు కేసులో ఎంతటి కీలక పరిణామాలు చోటు చేసుకున్నా సరే పవన్‌ నోరు విప్పలేదు. అయితే పవన్‌ తీసుకున్న నిర్ణయాల కారణంగా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని కార్యకర్తలు, జనసేన పార్టీ నేతలు భావిస్తున్నారని తెలుస్తోంది.

వారాహి యాత్రపై ప్రభావం..

దీనికి తోడు ప్రస్తుతం మరిన్ని కొత్త సవాళ్లు ఎదురుకాబోతున్నాయి. అకోబ్టర్‌ 1 నుంచి అనగా ఆదివారం నుంచి పవన్‌ వారాహి యాత్రం ప్రారంభం అవుతుందని గతంలోనే ప్రకటించారు. అయితే యాత్రలో.. చంద్రబాబు అరెస్ట్‌, ఆయనపై నమోదయిన అవినీతి కేసులు గురించి ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పాలి.. పొత్తులపై ఎలా సమర్థించుకోవాలో అర్థం కాక జనసేన అధ్యక్షుడు తల పట్టుకున్నారట. అంతేకాక తొందరపడి టీడీపీతో పొత్తు ఉంటుందని ప్రకటించి.. దెబ్బ తిన్నాము అనే భావనలో ఉన్నారంట.

ఈ క్రమంలో రేపు వారాహి యాత్రలో ఎదురుయ్యే ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలి.. చంద్రబాబుది అక్రమ అరెస్ట్‌ అనే వాదనకే కట్టుబడి ఉంటాలా.. లేదంటే స్టాండ్‌ మార్చుకోవాలా.. ఈ తలనొప్పులన్ని ఎందుకు అనుకుని.. వారాహి యాత్రే వాయిదా వేయాలా.. అనే దానిపై పార్టీలో జోరుగా చర్చలు సాగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. మరి పవన్‌ కళ్యాణ్‌ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అంటూ క్యాడర్‌ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఒకప్పుడు టీడీపీ అవినీతిని ప్రశ్నించిన పవన్‌.. ఇప్పుడు అదే అవినీతిని తన భుజాల మీద మోయాల్సి రావడం.. ఆ పార్టీ దయనీయ స్థితికి అద్ధం పడుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.