iDreamPost

సహాయచర్యలు చేపట్టకుండా ఎందుకీ దీక్షా రాజకీయాలు మేడం?

సహాయచర్యలు చేపట్టకుండా  ఎందుకీ దీక్షా రాజకీయాలు మేడం?

కరోనా వైరస్ మహమ్మారిలా విరుచుకుపడుతున్న వేళ , లాక్ డౌన్ తో ప్రజలు పడుతున్న ఇక్కట్లు దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పలు సహాయక చర్యలు చేపట్టగా , తొలి సారిగా అధికారంలోకి వచ్చిన వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు , నేతలు సైతం తమ తమ నియోజక వర్గాల్లో శక్తి కొలదీ వ్యక్తిగతంగా సహాయం చేస్తూ కరోనా కట్టడి కోసం పాటుపడుతున్న వేళ ప్రతిపక్ష టీడీపీ పార్టీ చేస్తున్న స్వప్రయోజన రాజకీయాలు , అసంబద్ధ ఆరోపణలు , కపట దీక్షలు ప్రజల్లో సైతం టీడీపీ పట్ల అసహనానికి కారణమవుతున్నాయి .

లాక్ డౌన్ సమయంలో సైతం అన్ని సామాజిక పెన్షన్లు ఇంటి వద్దకే అందించిన ప్రభుత్వం , రేషన్ తో పాటు , లాక్ డౌన్ సహాయక మొత్తంగా వెయ్యి రూపాయలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం , నిత్యవసరాలను కూడా పేదల ఇంటికే చేర్చింది . అంతే కాక మరో విడత నిత్యావసరాలతో పాటు రెండు వేలు సహాయక మొత్తంగా ఇవ్వటానికి సన్నాహాలు చేస్తోంది .

ఇహ లాక్ డౌన్ కారణంగా వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్ కి తరలించుకోలేక , అమ్ముకోలేక ఇబ్బంది పడుతున్న రైతుల్ని గుర్తించి వారికి రవాణా , మార్కెటింగ్ సదుపాయాలు కలిగించడం , వివిధ శాఖల ద్వారా గిట్టుబాటు ప్రభుత్వం కొనుగోలు చేయడం లాంటి చర్యలతో ఆదుకొంటుంది . ఈ విషయంలో ఎవరైనా రైతు ఒక్క ఫోన్ కాల్ చేసినా , లేదా సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా వెంటనే గుర్తించి సహాయం చేయడంలో మన వ్యవసాయ శాఖ మిగతా రాష్ట్రాల కన్నా ఎంతో ముందుంది .

అదే సమయంలో వార్డ్ వలంటీర్స్ ద్వారా కరోనా అనుమానితుల్ని గుర్తించి టెస్ట్స్ చేయించి వ్యాధి వ్యాప్తి నిరోధానికి తీసుకొంటున్న చర్యల పట్ల , ప్రతి వ్యక్తికి మూడు మాస్క్ లు చొప్పున పదహారు కోట్ల మాస్కలు ఉచితంగా పంపిణీ ప్రారంభించడం పట్ల , పీపీఏ కిట్స్ స్థానికంగా తయారు చేసి కేంద్రానికి కూడా అందించటానికి సిద్ధపడటం పట్ల జాతీయంగా ఎన్డీ టివి , టైమ్స్ నౌ , కేంద్ర ఆరోగ్య శాఖల నుండి ప్రశంసలు అందుకొంటుండగా ప్రతిపక్ష టీడీపీ నాయకుడికి , మిగతా నేతలకు అవేమీ కంటికి కనపడలేదు .

తాము అధికారంలో ఉండగా ఏ సమస్యనైనా పక్కదోవ పట్టించటానికి , ప్రతిపక్షాలు ఏ ప్రజా సమస్యని తమ దృష్టికి తెచ్చినా , లేదా సమస్యల పై పోరాడినా వాటిలో ఏ ఒక్కటీ పరిష్కరించకపోగా ఎదురుదాడికి దిగిన టీడీపీ నాయకులు ఈ రోజు ప్రజలందరూ కలిసి కట్టుగా కరోనా పై పోరాడాల్సిన విపత్కర పరిస్థితుల్లో సైతం అసంబద్ధ ఆరోపణలు , అసాధ్య కోరికలతో ఆందోళనలకు దీక్షలకు దిగడం శోచనీయం .

ప్రతి ఇంటికీ ఐదు వేల చొప్పున కోటి ముప్పై లక్షల కుటుంబాలకు 6500 కోట్ల రూపాయలను పంచాలని అసాధ్యమైన గొంతెమ్మ కోరికలు కోరుతూ టీడీపీ నేతలు దీక్షకి దిగడం చూస్తే అవి అందుకోవాల్సిన సామాన్యులు సైతం ఔరా అని ముక్కున వేలేసుకొంటున్నారు . ఇదే కోరిక పై మొన్న విజయవాడలో గద్దె రామ్మోహన్ దీక్షకు దిగగా , నేడు రాప్తాడు నియోజక వర్గంలో పరిటాల సునీత , ఆమె తనయుడు శ్రీరామ్ ఇదే డిమాండ్ తో దీక్షకు దిగారు .

ఇదే నియోజక వర్గం నుండి గత ఎన్నికల్లో వైసీపీ తరుపున గెలిచిన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నియోజక వర్గంలో రైతుల సాగునీటి సమస్యల పరిష్కారానికి విశేష కృషి చేస్తున్నారు . ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా నిరాశ్రయులైన వారికి వసతి , ఆహార ఏర్పాట్లు చేస్తూ , నియోజక వర్గ ప్రజలకు , లాక్ డౌన్ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి సొంత ఖర్చులతో మాస్క్లు , హ్యాండ్ సానిటైజర్లు అందిస్తూ పలు సహాయక కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు.

మరో వైపు దశాబ్దాలుగా రాజకీయం చేస్తున్న పరిటాల కుటుంబం మాత్రం ఈ క్లిష్ట సమయంలో ప్రజలకు ఏ మాత్రం సహాయక పడకపోగా కనీసం పల్లెల్లో తమ కుటుంబాన్ని నమ్ముకున్న వర్గాలకు కూడా లాక్ డౌన్ సమయంలో ఇసుమంత సహాయం అందించిన దాఖలాలు లేవు.అధికారమలో ఉన్నప్పుడు దర్పాన్ని ప్రదర్శిస్తూ ఆర్భాటాలు చేసే పరిటాల వర్గం ఇప్పుడు మాత్రం సొంత ఊరితోసహా ఎక్కడ పెద్ద ఎత్తున సహాయచర్యలు చేపట్టటంలేదు.

కానీ రాజకీయ మైలేజ్ కోసం , మీడియాలో పబ్లిసిటీ కోసం మాత్రం రాష్ట్ర ఆర్ధిక స్థితిని , ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకోకుండా ప్రతి కుటుంబానికి ఐదు వేలు చెల్లించమని డిమాండ్ చేస్తూ దీక్షకి దిగడం చూసిన వారు మాత్రం , నియోజకవర్గ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడకపోగా ఈ తరహా చర్యల వలనే ప్రజల ఆదరణను , వర్గాన్ని , పల్లెల్లో పట్టుని కోల్పోయారు . ఇహ ముందు ఉన్న కొంచెం ఆదరణని కోల్పోతారు అని వ్యాఖ్యానించడం టీడీపీ దుస్థితికి అర్థం పడుతుంది .

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి