iDreamPost

ఏపీ సర్కార్‌ అదనపు అఫిడవిట్‌.. నిమ్మగడ్డ ఆశలపై నీళ్లు..?

ఏపీ సర్కార్‌ అదనపు అఫిడవిట్‌.. నిమ్మగడ్డ ఆశలపై నీళ్లు..?

ఉద్యోగ విమరణ చేసే లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్న ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ ఆశలు అడియాశలైనట్లుగానే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మార్చి నెలాఖరున రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పదవి నుంచి రిటైర్డ్‌ కాబోతున్న నిమ్మగడ్డ.. ఆ లోపు ఎన్నికలు నిర్వహించాలనే లక్ష్యంతో ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామంటూ సర్కూలర్‌ జారీ చేశారు. అయితే కరోనా నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించడం ప్రజలకు శ్రేయస్సు కాదంటూ ఏపీ ప్రభుత్వం తోసిపుచ్చింది. లేఖలతో మొదలైన ఈ వివాదం, ఆ తర్వాత గవర్నర్‌ వద్దకు చేరి.. చివరకు కోర్టులో నడుస్తోంది. కరోనా తగ్గిందని, ఆర్థిక సంఘం నుంచి నిధులు రావాలంటే పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం ముఖ్యమని నిమ్మగడ్డ, ప్రజా శ్రేయస్సే ముఖ్యమని, కరోనా ఇంకా తగ్గలేదని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తమ వాదనలను వినిపించాయి. తమ వాదనలను అఫిడవిట్ల రూపంలోనూ దాఖలు చేశాయి.

అయితే ఈ రోజు ఏపీ ప్రభుత్వం అదనపు అఫిడవిట్‌ను దాఖలు చేసింది. ఇందులోని అంశాలు.. నిమ్మగడ్డ ఆశలపై నీళ్లు చల్లేలా ఉన్నాయి. జనవరి, ఫిబ్రవరి నెలల్లో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ప్రారంభించేందుకు కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసిందని, ఈ ప్రక్రియను నిర్వహించేందుకు పోలీసులతోపాటు ఇతర శాఖల అధికారులు విధులు నిర్వహించాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. మొదటి డోస్‌ తర్వాత నాలుగు వారాలకు రెండో డోస్‌ ఇవ్వాల్సి ఉంటుందని కేంద్రం తన మార్గదర్శకాలలో పేర్కొన్నదని ఏపీ ప్రభుత్వం తన అఫిడవిట్‌లో పేర్కొంది. ఎన్నికల ప్రక్రియ మాదిరిగానే వ్యాక్సినేషన్‌ను నిర్వహించాల్సి ఉంటుందని తెలిపింది. ప్రజారోగ్యం దృష్ట్యా వ్యాక్సినేషన్‌కు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందని అఫిడవిట్‌లో పేర్కొంది. అందువల్ల ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేమని రాష్ట్ర ప్రభుత్వం మరోమారు తేల్చి చెప్పింది.

ఇటీవల కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై ప్రధాని మోదీ సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యాక్సిన్‌ పంపిణీపై ముఖ్యమంత్రులకు కీలక సూచనలను చేశారు. మారుమూల ప్రాంతాలలోని ప్రజలకు వ్యాక్సిన్‌ అందాలని స్పష్టం చేశారు. ఆ మేరకు వ్యాక్సిన్‌ పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్టమైన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ప్రధాని మోదీ సూచనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సిన్‌ పంపిణీకి చర్యలు చేపట్టాయి. పోలింగ్‌ ప్రక్రియ మాదిరిగానే.. పోలింగ్‌బూత్‌లలో వ్యాక్సిన్‌ను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ కూడా అధికారులతో సమీక్ష నిర్వహించి దిశానిర్ధేశం చేశారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రోజుకు ఏపీలో సరాసరి దాదాపు 500 కేసులు నమోదవుతున్నాయి. ఓ వైపు కరోనా వ్యాప్తి నివారణ చర్యలు, మరో వైపు వ్యాక్సిన్‌ పంపిణీ ఏర్పాట్ల నేపథ్యంలో అధికార యంత్రంగం తీరకలేకుండా గడిపే పరిస్థితులున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం వాదన వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర హైకోర్టు కూడా సర్కార్‌ వదనను బలపరచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రభుత్వం దాఖలు చేసిన అదనపు అఫిడవిట్‌పై కౌంటర్‌దాఖలు చేసేందుకు ఎన్నికల కమిషనర్‌ తరఫు న్యాయవాది సమయం కోరారు. దీంతో విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. ఎన్నికల కమిషనర్‌ తన వాదనను ఏ విధంగా వినిపించబోతున్నారనేది ప్రస్తుతం ఆసక్తికర అంశం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి