iDreamPost

వైసీపీలోనే పంచాయతీ పోరు..!

వైసీపీలోనే పంచాయతీ పోరు..!

పంచాయతీ ఎన్నికల తొలి విడత పోరు తుది దశకు చేరుకుంది. మరో 24 గంటల్లో పల్లె ఓటెత్తబోతోంది. రేపు ఉదయం 6:30 గంటల నుంచి పోలింగ్‌ ప్రారంభం కాబోతోంది. విజయనగరం మినహా మిగతా 12 జిల్లాలో 3,249 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 525 పంచాయతీలు ఏకగ్రీవం కాగా. నెల్లూరు జిల్లాలోని ఓ పంచాయతీ సర్పంచ్, వార్డులకు ఎవరూ నామినేషన్‌లు దాఖలు చేయకపోవడంతో మిగతా 2,723 పంచాయతీలకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3:30 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. ఆ తర్వాత లెక్కింపు ప్రారంభిస్తారు. తొలుత వార్డులు, తర్వాత సర్పంచ్‌ ఓట్లు లెక్కిస్తారు. సర్పంచ్‌కు పింక్‌ బ్యాలెట్, వార్డులకు తెలుపు బ్యాలెట్‌లను వినియోగిస్తున్నారు.

వైసీపీ అభ్యర్థుల మధ్యే పోటీ..

పంచాయతీ ఎన్నికలు జరగడం ఇది తొలిసారి కాకపోయినా.. అనేక పరిణామాల నేపథ్యంలో ఈ ఎన్నికలు ప్రాధాన్యతను సందరించుకున్నాయి. పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలు కాకపోయినా.. పార్టీల మధ్య హోరాహోరీ పోరు గతంలో సాగింది. ఈ సారి ఇందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి నెలకొంది. అధికార వైఎస్సార్‌సీపీ వర్గీయుల మధ్యనే ఈ సారి పోటీ నెలకొంది. గ్రామ సచివాలయాలు, వలంటీర్ల ఏర్పాటు, రైతు భరోసా కేంద్రం.. ఇలా అనేక పాలనాపరమైన సంస్కరణలతో పంచాయతీ సర్పంచ్‌ పదవికి మునుపెన్నడూలేనంతగా ప్రాధాన్యత ఏర్పడింది. దీంతో అధికార పార్టీ నేతలు సర్పంచ్‌ అయ్యేందుకు ఆసక్తి చూపుతున్నారు. దాదాపు 80 శాతం పంచాయతీల్లో వైసీపీ పార్టీ వారే పోటీ పడుతున్నారు. పలు పంచాయతీల్లో ఇరు వర్గాల మధ్య సయోధ్యను స్థానిక ఎమ్మెల్యేలు కుదిర్చినా.. మెజారిటీ పంచాయతీల్లో మాత్రం వైసీపీ నేతలే ఢీ కొనబోతున్నారు. కొన్ని చోట్ల టీడీపీ బలపర్చిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా.. మెజారిటీ పంచాయతీల్లో ప్రేక్షక పాత్రకే టీడీపీ వర్గాలు పరిమితమయ్యాయి.

గెలిచి వస్తాం..

వైసీపీ నేతలను పిలిచి పార్టీ బలపరిచే వ్యక్తి ఒక్కరే పోటీ చేసేలా స్థానిక ఎమ్మెల్యేలు మంతనాలు జరిపారు. అయినా గ్రామ నేతలు ససేమిరా అన్నారు. రెండో దశ నామినేషన్లు ఈ రోజుతో ముగియబోతున్నాయి. మొదటి దశతోపాటు, రెండో దశలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇరు వర్గాలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ.. ఎమ్మెల్యేలకు అభయం ఇస్తున్నాయి. పంచాయతీ సర్పంచ్‌గా గెలిచి మీ వద్దకు వస్తామని ఇరు వైపుల నేతలు గంటాపథంగా చెబుతున్నారు. వైసీపీ రెండు వర్గాలుగా చీలిపోతే టీడీపీకి లాభిస్తుందనే ఆందోళన ఎమ్మెల్యేలలో ఉన్నా.. వారి అనుమానాలను, సందేహాలను నేతలు తీర్చుతున్నారు. టీడీపీ తరఫున పోటీనే ఉండదని, ఒక వేళ ఉన్నా అది నామమాత్రమేనంటూ స్పష్టం చేస్తున్నారు. ఎవరు గెలిచినా.. పార్టీ నేతే కావడంతో ఎమ్మెల్యేలు కూడా ఇద్దరినీ ఆశీర్వదించిపంపుతున్నారు. తమకు ఎమ్మెల్యే మద్ధతు ఉదంటూ ఇద్దరూ ప్రచారం చేసుకుంటూ పంచాయతీ పోరును ఆసక్తికరంగా మార్చేశారు. రేపు మంగళవారం సాయంత్రం కల్లా అభ్యర్థుల భవితవ్యం తేలిపోతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి